TATA IPL 2022- LSG vs RCB: ఐపీఎల్-15 లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న  మ్యాచ్ లో కోహ్లి మరోసారి అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. గోల్డెన్ డకౌటై  నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నాడు. 

కింగ్ కోహ్లి.. పరుగుల యంత్రం.. ఛేదనలో మొనగాడు.. ఇవన్నీ ఒకప్పుడు. కానీ కాలం ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండదు. అదేంటో గానీ కోహ్లికైతే గతేడాది నుంచి అది అస్సలు అనుకూలంగా లేదు. ఒకరకంగా చెప్పాలంటే ఇది బ్యాడ్ టైమ్.. ఫెవికాల్ కంటే గట్టిగా అతుక్కున్నట్టుంది. ఆహా.. ఓహో అని ఒకప్పుడు అతడిని వేనోళ్ల కీర్తించిన నోళ్లే.. ఇప్పుడు ‘ఇదేం ఆటరా బాబోయ్..’ అని శాపిస్తున్నాయ్.. గతంలో మంచినీళ్లు తాగిన ప్రాయంగా సెంచరీలు బాదిన ఆటగాడు.. ఇప్పుడు క్రీజులో నిలదొక్కుకోవడానికే తంటాలు పడుతుంటే.. అతడి అభిమానులు సైతం తిట్టుకోక ఏం చేస్తారు. అలా ఉంది విరాట్ కోహ్లి ఆట.. 

ఐపీఎల్ అంటేనే పూనకం వచ్చినోడిలా ఆడే కోహ్లి.. ఈ సీజన్ లో మాత్రం అట్టర్ ఫ్లాఫ్ అవుతున్నాడు. లక్నో తో జరుగుతున్న మ్యాచ్ తో కలిసి కోహ్లి ఇప్పటివరకు ఏడు మ్యాచులాడాడు. వాటిలో స్కోర్లు వరుసగా.. 41 నాటౌట్, 12, 5, 48, 1, 12, 0 గా ఉన్నాయి. లక్నోతో మ్యాచ్ లో కూడా కోహ్లి డకౌట్ అయ్యాడు. 

ఆ భారం లేదుగా...? 

కెప్టెన్ గా ఉన్నప్పటి కంటే ఆ బరువు దిగిపోయాక కోహ్లి ఆట అధ్వాన్నమైంది. గతేడాది జాతీయ టీ20 జట్టుకు, ఐపీఎల్ లో ఆర్సీబీ సారథ్య బాధ్యతలకు గుడ్ బై చెప్పాక కోహ్లిని ఆపడం ఇక ఎవరి తరమూ కాదన్నారు అతడి అభిమానులు. కెప్టెన్సీ భారం కూడా పోయిన నేపథ్యంలో మళ్లీ పాత కోహ్లిని చూస్తామనుకున్నారు. కానీ వారి ఆశలు అడియాసలే అయ్యాయి. కెప్టెన్సీ వదులుకున్నాక కోహ్లి ఇంకా దరిద్రంగా ఆడుతున్నాడే తప్ప గొప్ప ఇన్నింగ్స్ ఆడాడని చెప్పడానికి ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా లేదు. 

భారత జట్టుకు టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాక బీసీసీఐ.. అతడిని వన్డేల నుంచి కూడా తప్పించింది. తదనంతరం దక్షిణాఫ్రికా లో గతంతో పోలిస్తే బలహీనంగా ఉన్న దక్షిణాఫ్రికా ను కూడా విరాట్ సేన ఓడించలేదు. ఓడించకపోగా సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో కోహ్లి.. టెస్టు నాయకత్వానికి కూడా గుడ్ బై చెప్పాడు. సీనియర్ ఆటగాడిగా జూనియర్లకు మార్గనిర్దేశనం చేస్తాడనుకుంటే.. అతడే తంటాలు పడుతున్నాడు. 

Scroll to load tweet…

దిగిపోయాక మెరిశాడా..? 

టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాక కోహ్లి.. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్, వెస్టిండీస్ తో వన్డేలు, టీ20, శ్రీలంకతో టెస్టులు ఆడాడు. వీటిలో అడపా దడపా హాఫ్ సెంచరీలు మినహా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా లేదు. 

ఐపీఎల్ లో వెలగబెట్టాడా..? 

ఇక ఐపీఎల్ సంగతికొస్తే.. నాయకత్వం నుంచి తప్పుకున్నాక అపోజిషన్ టీమ్ లకు బ్యాండ్ బజా బరాతే అనుకున్నారు కోహ్లి అభిమానులు. అపోజిషన్లకు ఏమో గానీ అది అతడికే వర్తించేట్టు ఉంది. ఏడు మ్యాచుల్లో ఒక్క హాఫ్ సెంచరీ లేదు. తాజా ఫామ్ బట్టి చూస్తే తర్వాతి మ్యాచులలో చేస్తాడన్న గ్యారెంటీ కూడా లేదంటున్నారు స్వయంగా కోహ్లి అభిమానులు. ప్రముఖ తెలుగు సినీ నటుడు నాని నటించిన జెర్సీ సినిమాలో అతడి భార్య పాత్రధారిణి ‘నువ్వు ఇంతకు మించి దిగజారవు అనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను తప్పు అని ప్రూవ్ చేస్తున్నావ్..’ అన్నట్టు.. ‘నీ గురించి గొప్పగా అనుకున్న ప్రతిసారి నువ్వు మమ్మల్ని తప్పు అని ప్రూవ్ చేస్తున్నావ్..’ అని కామెంట్స్ చేస్తున్నారు. 

Scroll to load tweet…

వీటితో పాటు పుష్ప సినిమాలోని ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా..’ డైలాగ్ ను.. ‘కోహ్లి అంటే ఫైర్ అనుకుంటివా..? పుష్పం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కామెంట్లన్నీ కోహ్లి ని వ్యతిరేకించేవారు కాదు.. స్వయానా అతడి అభిమానులు చేస్తున్నవే.. మరికొందరైతే.. ‘కోహ్లి.. ఇంత దరిద్రంగా ఆడేకంటే గౌరవంగా రిటైరైపోవచ్చు కదా..’ అంటున్నారు. 

ఫామ్ శాశ్వతం కాకపోవచ్చు.. కానీ 

కోహ్లి వైఫల్యాల గురించి మాట్లాడుకున్నప్పుడల్లా అతడి అభిమానులు.. ‘ఫామ్ శాశ్వతం కాదు. క్లాస్ శాశ్వతం అంటారు..’ కావచ్చు. కానీ క్రికెట్ గురించి మాట్లాడుకునేప్పుడు రికార్డులు పనికొస్తాయేమో గానీ దీర్ఘకాలంలో ఆడేప్పుడు మాత్రం అవి ఎందుకు పనికిరావన్న విషయాన్ని ఎంత త్వరగా తెలుసుకుంటే కోహ్లికి అంత మంచిది. గతమెంత ఘనంగా ఉన్నా వర్తమానంలో బాగా ఆడితేనే ఏ ఆడిగాడి కెరీర్ అయినా భాగుంటుదనేది చరిత్ర చెబుతున్న వాస్తవం..

ఇటీవలే పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయభ్ అక్తర్.. కోహ్లిని ఉద్దేశిస్తూ ఒక వ్యాఖ్య చేశాడు. అదేంటంటే.. ‘ఐపీఎల్ అనేది ఎవరు భాగా ఆడితే వారినే జట్టులో ఉంచుకునే ఫ్రాంచైజీ క్రికెట్. బాగా ఆడని ఆటగాళ్లకు నిర్దాక్షిణ్యంగా తీసేస్తారు. అందులో రెండో ఆలోచనే లేదు. దానికి కోహ్లి కూడా అతీతుడేమీ కాదు. ఇలాంటి పరిస్థితులలో కోహ్లి స్టార్ హోదా ఏమాత్రం పనికిరాదు. ఒక్క ఛాన్స్ ఇస్తే నిరూపించుకునే ఆటగాళ్లు వందలాది మంది ఉన్నారు. కోహ్లి ఆడని రోజున జట్టు యాజమాన్యం అతడిని కూడా డ్రాప్ చేస్తుంది.’ అన్న వ్యాఖ్యలు అతడికి బాగా సరిపోతాయి. 

సెంచరీ లేక సెంచరీ..

చివరగా.. 2019 వరకు సెంచరీల మీద సెంచరీలు బాదిన కోహ్లి అంతర్జాతీయ కెరీర్ లో శతకం బాదక 100 ఇన్నింగ్స్ లు దాటింది. ఇందులో 17 టెస్టులు, 21 వన్డేలు, 25 టీ20లు, 37 ఐపీఎల్ మ్యాచులున్నాయి. ఇటీవలే లంకతో మొహాలీలో ముగిసిన మ్యాచ్ లో కెరీర్ లో వందో టెస్టు ఆడిన కోహ్లి.. ఆ మ్యాచ్ లో కూడా వంద కొట్టలేదు. అందుకే కోహ్లి.. ఇంకెన్నాళ్లు..?