TATA IPL 2022 SRH vs RCB: బౌలర్లు విఫలమైనా బ్యాటర్లు ఆదుకుంటారనుకున్న హైదరాబాద్ అభిమానుల ఆశలపై సన్ రైజర్స్ ఆటగాళ్లు నీళ్లు చల్లారు. భారీ లక్ష్య ఛేదనలో  ?? పరుగులకే చేతులెత్తేశారు. తాజా ఓటమితో హైదరాబాద్ ప్లేఆఫ్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది.   

ఈ సీజన్ లో హైదరాబాద్ చేతిలో ఎదురైన దారుణ పరాభవానికి బెంగళూరు అంతే ధీటుగా బదులు తీర్చుకుంది. తొలుత బ్యాటింగ్ చేసి హైదరాబాద్ బౌలర్ల ను చితకబాది ఆ తర్వాత బౌలింగ్ లో సన్ రైజర్స్ బ్యాటర్లను వణికించింది. బెంగళూరు నిర్దేశించిన 193 పరుగుల లక్ష్య ఛేదనలో హైదరాబాద్..19.2 ఓవర్లలో 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా ఆర్సీబీ 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. హసరంగ ఐదు వికెట్లతో చెలరేగి హైదరాబాద్ ఓటమిలో కీలక పాత్ర పోషించాడు. రాహుల్ త్రిపాఠి రాణించికుంటే హైదరాబాద్ ఆ స్కోరు కూడా చేసి ఉండేది కాదు. తాజా విజయంతో ప్లేఆఫ్ రేసుకు బెంగళూరు మరింత దగ్గరవగా.. హైదరాబాద్ ఆ అవకాశాలను ఇంకా సంక్లిష్టం చేసుకుంది. ఇక తర్వాత ఆడబోయే 3 మ్యాచుల్లో నెగ్గితేనే హైదరాబాద్ కు ప్లేఆఫ్ ఛాన్స్ ఉంటుంది. లేకుంటే కష్టమే..

బెంగళూరు నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన సన్ రైజర్స్ కు తొలి ఓవర్లోనే ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్లు కేన్ విలియమ్సన్ (0) తొలి బంతికే రనౌట్ కాగా.. ఐదో బంతికి ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మ (0) కూడా మ్యాక్స్వెల్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. స్కోరు బోర్డుపై ఒక్క పరుగు కూడా చేరకుండానే హైదరాబాద్ రెండు వికెట్లు కోల్పోయింది. 

ఓపెనర్ల నిష్క్రమణ అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన రాహుల్ త్రిపాఠి (37 బంతుల్లో 58.. 6 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్క్రమ్ (21 బంతుల్లో 27.. 1 ఫోర్, 1 సిక్స్) లు ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. మంచి బంతులను గౌరవిస్తూనే గతి తప్పిన బంతులను బౌండరీ లైన్ దాటించారు. 8వ ఓవర్లో సన్ రైజర్స్ స్కోరు 50 పరుగులకు చేరగానే 9వ ఓవర్ రెండో బంతికి హసరంగ.. మార్క్రమ్ ను ఔట్ చేశాడు. 

మార్క్రమ్ ఔటైనా గత మ్యాచ్ లో సన్ రైజర్స్ ను ఆదుకున్న నికోలస్ పూరన్ (19) ఈ మ్యాచ్ లో కూడా రాణిస్తాడని భావించిన సన్ రైజర్స్ అభిమానులకు నిరాశమే మిగిలింది. హసరంగ వేసిన 13వ ఓవర్ తొలి బంతికి భారీ షాట్ ఆడబోయిన పూరన్.. మిడ్ వికెట్ వద్ద ఉన్న షాబాజ్ అహ్మద్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఒకవైపు వరుసగా వికెట్లు కోల్పయిన సన్ రైజర్స్ కు బెంగళూరు బౌలర్లు అష్టదిగ్బంధనం చేశారు. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగుల రాక గగనమై ఛేదించాల్సిన రన్ రేట్ భారీగా పెరిగిపోయింది. 

సిరాజ్ వేసిన 14వ ఓవర్లో తొలి బంతికి సిక్సర్ కొట్టి 32 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు త్రిపాఠి. ఆఖరి బంతికి త్రిపాఠి ఇచ్చిన క్యాచ్ ను హసరంగ డ్రాప్ చేశాడు. అయితే తర్వాత ఓవర్ వేసిన హసరంగ.. సుచిత్ (2) ను పెవిలియన్ కు పంపాడు. 16వ ఓవర్ వేసిన జోష్ హెజిల్వుడ్.. వరుస బంతుల్లో రాహుల్ త్రిపాఠితో పాటు కార్తీక్ త్యాగి (0) ని కూడా ఔట్ చేశాడు. దీంతో సన్ రైజర్స్ ఓటమి ఖరారైపోయింది. ఇక ఆ తర్వాత ఓవర్లో శశాంక్ సింగ్ (8) కూడా హసరంగ బౌలింగ్ లోనే మ్యాక్స్వెల్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత బంతికే..హసరంగ ఉమ్రాన్ మాలిక్ (0) ను ఔట్ చేశాడు. ఆరు బంతుల వ్యవధిలో ఎస్ఆర్హెచ్ నాలుగు వికెట్లు కోల్పోవడం గమనార్హం. ఆఖర్లో భువనేశ్వర్ (8) ను హర్షల్ పటేల్ ఔట్ చేయడంతో హైదరాబాద్ ఇన్నింగ్స్ 125 పరుగుల వద్ద ముగిసింది. ఆర్సీబీ బౌలర్లలో హసరంగ కు 5 వికెట్లు దక్కగా.. హెజిల్వుడ్ కు రెెండు, మ్యాక్స్వెల్ కు ఒకటి దక్కింది. 

అంతకుముందు టాస్ గెలిచిన ఆర్సీబీకి ఫాఫ్ డుప్లెసిస్ (73 నాటౌట్), రజత్ పాటిదార్ (48) దూకుడుగా ఆడారు. ఇక ఆఖర్లో మ్యాక్స్వెల్ (33), దినేశ్ కార్తీక్ (30 నాటౌట్) లు కూడా మెరవడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. 

సంక్షిప్త స్కోరు వివరాలు : 
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : 20 ఓవర్లలో 192-3
- సన్ రైజర్స్ హైదరాబాద్ : 19.2 ఓవర్లలో 125 ఆలౌట్ 
- ఫలితం : 67 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలుపు