TATA IPL 2022 - LSG vs RCB: డుప్లెసిస్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో బ్యాటింగ్ లో అదరగొట్టిన రాయల్ ఛాలెంజర్స్.. బౌలింగ్ లో కలిసికట్టుగా రాణించింది. కట్టుదిట్టంగా బంతులేసి సీజన్ లో ఐదో విజయాన్ని అందుకున్నది.
మూడు రోజుల క్రితం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించిన లక్నో సూపర్ జెయింట్స్.. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగని పోరులో చేతులెత్తేసింది. బెంగళూరుతో డీవై పాటిల్ స్టేడియం వేదికగా మ్యాచ్ లో 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. బెంగళూరు నిర్దేశించిన 182 పరుగుల లక్ష్య ఛేదనలో.. లక్నో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆర్సీబీ బౌలర్ జోష్ హెజిల్వుడ్ ఐపీఎల్ కెరీర్ లో అత్యుత్తమ గణాంకాలు (4-0-25-4) నమోదు చేశాడు. లక్నో బ్యాటర్లలో కీలక వికెట్లన్నీ అతడికే దక్కాయి.ఈ సీజన్ లో ఆర్సీబీకి ఇది ఐదో విజయం కాగా లక్నోకు మూడో ఓటమి.. తాజా విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో రెండో స్థానాని (10 పాయింట్లతో) కి ఎగబాకింది. గుజరాత్ టైటాన్స్ ప్రథమ స్థానంలో ఉంది.
ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ ఆదిలోనే తడబడింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ఫామ్ లో ఉన్న లక్నో ఓపెనర్ క్వింటన్ డికాక్ (3).. ఫస్ట్ స్లిప్ లో ఉన్న గ్లెన్ మ్యాక్స్వెల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ వెంటే మనీష్ పాండే (6) కూడా హెజిల్వుడ్ బౌలింగ్ లోనే హర్షల్ పటేల్ కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు.
అయితే బ్యాటింగ్ లో ప్రమోట్ అయిన కృనాల్ పాండ్యా (28 బంతుల్లో 42... 5 ఫోర్లు, 2 సిక్సర్లు) తో జతకలిసిన కెప్టెన్ కెఎల్ రాహుల్ (24 బంతుల్లో 30.. 3 ఫోర్లు, 1 సిక్సర్) తో ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు. ఈ ఇద్దరూ కలిసి మడో వికెట్ కు 31 పరుగులు జోడించారు. అయితే హర్షల్ పటేల్ వేసిన 8వ ఓవర్లో లెగ్ సైడ్ వెళ్తున్న బంతి రాహుల్ బ్యాట్ కు తాకి కీపర్ చేతుల్లో పడింది. దీంతో అతడు కూడా పెవిలియన్ చేరాడు.
ఈ క్రమంలో దీపక్ హుడా (13) తో జతకట్టిన కృనాల్ ధాటిగా ఆడాడు. షాబాజ్ వేసిన 9వ ఓవర్లో సిక్సర్ కొట్టిన అతడు.. హసరంగ వేసిన తర్వాతి ఓవర్లో కూడా బంతిని స్టాండ్స్ లోకి పంపాడు. అయితే 13వ ఓవర్ వేసిన సిరాజ్.. ఈ జంటను విడదీశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే మ్యాక్స్వెల్.. కృనాల్ ను పెవిలియన్ కు పంపాడు.
ఒకవైపు వరుసగా వికెట్లు పడుతున్నా అయుష్ బదోని (13), మార్కస్ స్టోయినిస్ (15 బంతుల్లో 24.. 2 ఫోర్లు, 1 సిక్స్), జేసన్ హోల్డర్ (16) లు ఉండటంతో లక్నో విజయంపై ఆశలు పెట్టుకుంది. కానీ బదోనిని హెజిల్వుడ్.. 17వ ఓవర్లో ఔట్ చేశాడు. అప్పటికీ 18 బంతుల్లో 44 పరుగులు అవసరముండగా.. 18వ ఓవర్లో హర్షల్ 10 పరుగులిచ్చాడు. 19వ ఓవర్ వేసిన హెజిల్వుడ్.. రెండో బంతికి ప్రమాదకర ప్టోయినిస్ ను ఔట్ చేయడమే గాక 3 పరుగులే ఇచ్చాడు. ఇక ఆఖరి ఓవర్లో హర్షల్ 12 పరుగులిచ్చాడు. కానీ విజయం మాత్రం ఆర్సీబీదే.
ఆర్సీబీ బౌలర్లలో హెజిల్వుడ్ ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లు బౌలింగ్ వేసిన అతడు.. 25 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ కెరీర్ లో హెజిల్వుడ్ కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. మ్యాక్స్వెల్, హర్షల్, సిరాజ్ లు తలో వికెట్ దక్కించుకున్నారు. డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బంతులేస్తాడని పేరున్న హర్షల్ పటేల్ (4 ఓవర్లలో 47 పరుగులు) భారీగా పరగులిచ్చుకోవడం గమనార్హం.
తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆదిలోనే షాక్ తగిలినా తర్వాత పుంజుకుంది. సారథి ఫాఫ్ డుప్లెసిస్ (96) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి మ్యాక్స్వెల్ (23), షాబాజ్ అహ్మద్ (26) లు సాయపడ్డారు. డుప్లెసిస్ అద్భుత ప్రదర్శనతో ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.
