IPL 2022 SRH vs RCB: ఐపీఎల్-15లో ప్లేఆఫ్స్ రేసులో ముందు వరుసలో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆరో స్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ నేడు కీలక పోరులో తలపడనున్నది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే సన్ రైజర్స్ కు ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి.
వరుసగా మూడు పరాజయాల తర్వాత మళ్లీ విజయబోణీ కొట్టాలని సన్ రైజర్స్ హైదరబాద్ చూస్తున్నది. ఈ సీజన్ లో వరుసగా ఐదు విజయాల తర్వాత ఆ జట్టు మళ్లీ గాడి తప్పి మూడు పరాజయాలు అందుకుని ప్లేఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఈ సీజన్ లో గత మ్యాచ్ లో ఆర్సీబీని చిత్తుగా ఓడించినట్టే ఈ మ్యాచ్ లో కూడా మట్టికరిపించి తిరిగి గాడిన పడాలని భావిస్తున్నది. ముంబైలోని వాంఖెడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది.
మరోవైపు ఈ సీజన్ లో ఏప్రిల్ 23న జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ చేతిలో దారుణంగా ఓడిన రాయల్ ఛాలెంజర్స్ అందుకు బదులు తీర్చుకోవాలని భావిస్తున్నది. ఆ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ బౌలర్ల ధాటికి ఆర్సీబీ బ్యాటర్లు.. 68 పరుగులకే కుప్పకూలారు.
ఐపీఎల్-15 పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న ఆర్సీబీ (11 మ్యాచులు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు).. సన్ రైజర్స్ పై పగ తీర్చుకోవడమే కాదు.. ఈ మ్యాచ్ లో నెగ్గితేనే ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. లేదంటే తర్వాత జరుగబోయే రెండు మ్యాచులలో తప్పకుండా నెగ్గాల్సి ఉంటుంది.
ఇక హైదరాబాద్ విషయానికొస్తే (10 మ్యాచులు.. 5 విజయాలు, 5 ఓటములు.. 10 పాయింట్లు) పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఆ జట్టు ఢిల్లీ, బెంగళూరును వెనక్కి నెట్టి నాలుగో స్థానానికి చేరే అవకాశం ఉంటుంది. బెంగళూరుకు మనకన్నా రెండు పాయింట్లు ఎక్కువున్న ఆ జట్టుకు నెట్ రన్ రేట్ మనకంటే తక్కువగా ఉంది.
ఈ మ్యాచ్ లో ఆర్సీబీ తరఫున గత మ్యాచ్ లో బరిలోకి దిగిన జట్టే ఆడుతుండగా.. హైదరాబాద్ తరఫున రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నది. శ్రేయస్ గోపాల్, సీన్ అబాట్ స్థానంలో ఫజల్ హక్ ఫరూఖీ, జగదీశ్ సుచిత్ బరిలోకి దిగనున్నారు.
ముఖాముఖి : ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 20 మ్యాచులు జరగగా అందులో హైదరాబాద్ దే ఆధిపత్యం. 12 మ్యాచుల్లో ఎస్ఆర్హెచ్ గెలవగా.. 8 మ్యాచుల్లో బెంగళూరు నెగ్గింది.
తుది జట్లు :
సన్ రైజర్స్ హైదరాబాద్ : కేన్ విలియమ్సన్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, మార్క్రమ్, నికోలస్ పూరన్, శశాంక్ సింగ్, ఫరూఖీ, జగదీశ్ సుచిత్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి. నటరాజన్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, గ్లెన్ మ్యాక్స్వెల్, మహిపాల్ లోమ్రర్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, జోష్ హెజిల్వుడ్, మహ్మద్ సిరాజ్
