TATA IPL 2022 - LSG vs RCB: లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న  మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్  కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ  మ్యాచ్ లో విరాట్ కోహ్లి డకౌట్ తో  మరోసారి నిరాశ పరిచాడు. 

ఒక్క ఓవర్ పూర్తి కాకుండానే ఏడు పరుగులకు రెండు వికెట్లు. ఆ స్థితి నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోరు సాధించిందంటే దానికి కారణం ఆ జట్టు సారథి డుప్లెసిస్ (64 బంతుల్లో 96.. 11 ఫోర్లు, 2 సిక్సర్లు) దే. క్లాస్, మాస్ కలగలిపి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు అతడు. నాలుగు పరుగుల వ్యవధిలో సెంచరీ కోల్పోయాడే గానీ ఐపీఎల్-15 లో నాలుగో శతకం నమోదయ్యేదే. గ్లెన్ మ్యాక్స్వెల్, యువ ఆటగాడు షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్ ల సాయంతో జట్టుకు భారీ స్కోరు అందించాడు. నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ.. 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు సాధించింది. విరాట్ కోహ్లి డకౌట్ అయి మరోసారి నిరాశపరిచాడు. 

టాస్ ఓడి లక్నో ఆహ్వానం మేరకు బ్యాటింగ్ కు వచ్చిన ఆర్సీబీకి తొలి ఓవర్లోనే రెండు భారీ షాక్ లు తగిలాయి. చమీర వేసిన తొలి ఓవర్లో ఐదో బంతికి అనూజ్ రావత్ (4).. లక్నో సారథి కెఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత బంతికే విరాట్ కోహ్లి.. బ్యాక్ వర్డ్ పాయింట్ వద్ద ఉన్న హుడాకు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. ఏడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది ఆర్సీబీ. 

ఈ క్రమంలో గ్లెన్ మ్యాక్స్వెల్ (11 బంతుల్లో 23.. 3 ఫోర్లు, 1 సిక్సర్) తో కలిసాడు డుప్లెసిస్. చమీర వేసిన మూడో ఓవర్లో డుప్లెసిస్ ఓ ఫోర్ కొట్టి మ్యాక్సీకి బ్యాటింగ్ ఇవ్వగా అతడు అదే ఓవర్లో 4, 4, 6 బాదాడు. ఆ తర్వాత అవేశ్, కృనాల్ ను కూడా ఈ జంట శిక్షించింది. అయితే ఆరో ఓవర్లో కృనాల్ వేసిన బంతికి మ్యాక్స్వెల్ తన ట్రేడ్ మార్క్ షాట్ రివర్స్ స్వీప్ ఆడాడు. కానీ హోల్డర్ అద్భుతమైన క్యాచ్ తో వెనుదిరిగాడు. అతడి స్థానంలో వచ్చిన ప్రబుదేశాయ్ (10) కూడా త్వరగానే నిష్క్రమించాడు. 

Scroll to load tweet…

కాగా షాబాజ్ అహ్మద్ (26) తో కలిసి డుప్లెసిస్ బ్యాట్ కు పనిచెప్పాడు. స్టోయినిస్ వేసిన 9వ ఓవర్లో ఫోర్ బాది గేర్ మార్చిన డుప్లెసిస్.. రవి బిష్ణోయ్ వేసిన 14వ ఓవర్లో సిక్సర్ బాది ఈ సీజన్ లో రెండో హాఫ్ సెంచరీ సాధించాడు. అర్థ శతకం తర్వాత డుప్లెసిస్ మరింత రెచ్చిపోయాడు. కృనాల్ వేసిన 15వ ఓవర్లో బౌండరీ, సిక్సర్ బాది డెబ్బైలలోకి చేరాడు. షాబాజ్ అవుటైనా దినేశ్ కార్తీక్ (13 నాటౌట్) తో కలిసి డుప్లెసిస్ ఆర్సీబీ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపాడు. రవి బిష్ణోయ్ వేసిన 18వ ఓవర్లో రెండు బౌండరీలు బాది సెంచరీకి దగ్గరైన అతడు.. హోల్డర్ వేసిన ఆఖరి ఓవర్లో ఐదో బంతికి భారీ షాట్ ఆడబోయి బ్యాక్ వర్డ్ స్క్వేర్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న స్టోయినిస్ కు చిక్కాడు. దీంతో నాలుగు పరుగుల దూరంలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. 

లక్నో బౌలర్లలో చమీర, హోల్డర్ లు తలో రెండు వికెట్లు తీయగా కృనాల్ ఒక్క వికెట్ పడగొట్టాడు. విజయానికి లక్నో 20 ఓవర్లలో 182 పరుగులు చేయాల్సి ఉంది.