TATA IPL 2022 PBKS vs RR: ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పన గెలవాల్సిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ కు ఓటమి తప్పలేదు. బ్యాటర్లు రాణించినా బౌలర్లు విఫలమయ్యారు. రాజస్తాన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్ తో పాటు ఆఖర్లో హెట్మెయర్ దూకుడుగా ఆడి జట్టును గెలిపించాడు.
ఐపీఎల్-2022 లో భాగంగా ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో పంజాబ్ కు ఓటమి తప్పలేదు. బ్యాటర్లు రాణించినా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. రాజస్తాన్ కు నిర్దేశించిన 190 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కాపాడుకోలేకపోయింది. భారీ లక్ష్య ఛేదనలో రాజస్తాన్ తరఫున యశస్వి జైస్వాల్ (41 బంతుల్లో 68.. 9 ఫోర్లు, 2 సిక్సర్లు) తో పాటు జోస్ బట్లర్, హెట్మెయర్ (16 బంతుల్లో31.. 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో రెండు పరాజయాల తర్వాత ఆ జట్టు మళ్లీ విజయాన్ని అందుకుంది. తాజా విజయంతో పంజాబ్ ప్లేఆఫ్ ఆశలు అడుగంటినట్టే. 11 మ్యాచులాడిన పంజాబ్ కు ఇది ఆరో పరాజయం కాగా.. అన్నే మ్యాచులాడిన రాజస్తాన్ కు ఇది ఏడో విజయం. అదీగాక రెండో సారి బ్యాటింగ్ చేసి గెలవడం ఈ సీజన్ లో రాజస్తాన్ కు ఇదే తొలిసారి కావడం గమనార్హం.
గతేడాది ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియలో రూ. 4 కోట్లకు రాజస్తాన్ దక్కించుకున్న జైస్వాల్.. సీజన్ లో తొలి 3 మ్యాచులు సరిగా రాణించలేదు. మూడు మ్యాచుల్లో కలిపి అతడు 25 (20, 1, 4) మాత్రమే చేయడంతో ఆ తర్వాత మ్యాచులకు అతడిని పక్కనబెట్టారు. కానీ ఏడు మ్యాచుల తర్వాత పునరాగమనం చేసిన జైస్వాల్ తనదైన ఆటతో తానెంత విలువైన ఆటగాడో నిరూపించుకున్నాడు. కీలక సమయంలో రెచ్చిపోయి ఆడి రాజస్తాన్ ను ప్లేఆఫ్స్ కు మరింత చేరువ చేశాడు.
కాగా.. పంజాబ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. రాజస్తాన్ కు మంచి ఆరంభమే దక్కింది. జోస్ బట్లర్ (16 బంతుల్లో 30.. 5 ఫోర్లు, 1 సిక్సర్) ఉన్నదికాసేపే అయినా మెరుపులు మెరిపించాడు. యశస్వి జైస్వాల్ తో కలిసి తొలి వికెట్ కు నాలుగు ఓవర్లలోనే 46 పరుగులు జోడించాడు.
జైస్వాల్ తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు, సిక్సర్ తో తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. రబాడా వేసిన నాలుగో ఓవర్లో 6, 4, 4, 4 సాయంతో 18 పరుగులు రాబట్టిన బట్లర్.. అదే ఓవర్లో ఆఖరి బంతికి రాజపక్సకు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. అతడి స్థానంలో వచ్చిన రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ (12 బంతుల్లో 23.. 4 ఫోర్లు) టచ్ లోనే కనిపించినా.. రిషి ధావన్ వేసిన 9వ ఓవర్లో తొలి బంతికి ధావన్ కు చిక్కాడు 10 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ 2 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది.
సందీప్ శర్మ వేసిన పదో ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదిన జైస్వాల్.. చాహర్ వేసిన 12వ ఓవర్లో ఐదో బంతికి సింగిల్ తీసి ఈ సీజన్ లో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో పడిక్కల్ (31.. 3 ఫోర్లు) కాస్త నిదానంగా ఆడినా.. జైస్వాల్ మాత్రం దూకుడును కొనసాగించాడు. రిషి ధావన్ వేసిన 13వ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు.14 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ 2 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.
ఆఖరి 6 ఓవర్లలో 50 పరుగులు చేయాల్సి ఉండగా.. అర్ష్దీప్ సింగ్ వేసిన 15వ ఓవర్ రెండో బంతికి జైస్వాల్.. లివింగ్ స్టోన్ కు చిక్కాడు. ఆ ఓవర్లో మూడు పరుగులు మాత్రమే వచ్చాయి. రబాడా వేసిన 16వ ఓవర్లో కూడా 8 పరుగులే దక్కాయి. కానీ అర్ష్దీప్ 17వ ఓవర్లో రెండు ఫోర్లు బాదాడు హెట్మెయర్. రబాడా వేసిన 18వ ఓవర్లో 16 పరుగులొచ్చాయి. అర్ష్దీప్ వేసిన 19 వ ఓవర్లో ఐదో బంతికి పడిక్కల్ ఔటయ్యాడు. ఆ ఓవర్లో అతడు 3 పరుగులే ఇచ్చి వికెట్ కూడా తీశాడు. కానీ అప్పటికీ సాధించాల్సిన లక్ష్యం 7 బంతుల్లో 8 పరుగులు. రాహుల్ చాహర్ వేసిన ఆఖరి ఓవర్లో.. రెండో బంతికి హెట్మెయర్ సిక్సర్ బాదాడు. తర్వాత బంతికి సింగిల్ తీసి విజయాన్ని ఖాయం చేశాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. బెయిర్ స్టో (56) హాఫ్ సెంచరీ చేయగా.. జితేశ్ శర్మ (38), రాజపక్స (27), లివింగ్ స్టోన్ (22) రాణించారు.
సంక్షిప్త స్కోరు వివరాలు :
- పంజాబ్ కింగ్స్ : 20 ఓవర్లలో 189-5
- రాజస్తాన్ రాయల్స్ : 19.4 ఓవర్లలో 190-4
- ఫలితం : 6 వికెట్ల తేడాతో రాజస్తాన్ గెలుపు
