TATA IPL 2022 - KKR vs DC: ఐపీఎల్ లో లో స్కోరింగ్ గేమ్ లతో విసుగెత్తిపోయిన అభిమానులకు  అసలైన విందు.  ఆదివారం పుష్టుగా భోజనం చేసి  బ్రబోర్న్ స్టేడియానికి వచ్చిన  ప్రేక్షకులతో పాటు టీవీల ముందు కూర్చున్న కోట్లాది అభిమానులకు ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్స్ ఫుల్ మీల్స్ పెట్టారు. 

తొలి రెండు మ్యాచులలో విఫలమైన ఢిల్లీ బ్యాటర్ పృథ్వీ షా వరుసగా రెండో మ్యాచ్ లో మెరుపు హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. డేవిడ్ వార్నర్ బాబాయ్ తోడురాగా.. ఢిల్లీకి భారీ స్కోరును అందించడంలో బాటలు వేశాడు. ఇద్దరూ కలిసి పవర్ ప్లే, మిడిల్ ఓవర్స్ అని తేడా లేకుండా చెలరేగి ఆడారు. అగ్నికి ఆయువు తోడైనట్టు వీరికి కెప్టెన్ రిషభ్ పంత్ దూకుడు కూడా తోడైంది. అయితే వరుసగా వికెట్లు కోల్పోయి రన్ రేట్ కాస్త తగ్గినా.. ఆఖర్లో ఢిల్లీ మళ్లీ మెరుపులు మెరిపించింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచులో నెగ్గాలంటే కేకేఆర్ శ్రమించాల్సిందే. 

బ్రబోర్న్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు గత మ్యాచులో మాదిరే అదిరే ఆరంభాన్నిచ్చారు ఓపెనర్లు. మెరుపు షాట్లతో విరుచుకుపడ్డ పృథ్వీ షా (29 బంతుల్లో 51.. 7 ఫోర్లు, 2 సిక్సర్లు), సంయోచితంగా బ్యాటింగ్ చేసిన డేవిడ్ వార్నర్ (45 బంతుల్లో 61.. 6 ఫోర్లు, 2 సిక్సర్లు) లు కోల్కతా బౌలర్లకు పట్టపగలే చుక్కులు చూపించారు. ఒకరిని మించి ఒకరు వీర బాదుడు బాదారు. 

ఎదుర్కున్న తొలి బంతికే బౌండరీ బాదిన పృథ్వీ షా.. ఉమేశ్ యాదవ్ వేసిన అదే ఓవర్లో ఐదో బంతికి మరో ఫోర్ కొట్టాడు. రెండో ఓవర్లో వార్నర్, షాలు తలో బౌండరీ కొట్టారు. ఉమేశ్ వేసిన 3వ ఓవర్లో కూడా షా రెండు బ్యాక్ టు బ్యాక్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఇక కమిన్స్ వేసిన నాలుగో ఓవర్లో వార్నర్ భాయ్ తొలి రెండు బంతులను బౌండరీ రోప్ దాటించాడు. అదే ఓవర్లో ఆఖరి బంతికి సిక్సర్ బాదాడు షా., దీంతో నాలుగు ఓవర్లలోనే ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. 

పవర్ ప్లే ముగిసినా ఈ ఇద్దరూ అదే దూకుడు కొనసాగించారు. ఈ క్రమంలో వెంకటేశ్ అయ్యర్ వేసిన 8వ ఓవర్లో సిక్సర్, ఫోక్ కొట్టిన షా.. ఈ సీజన్ లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కానీ తర్వాత ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికీ స్కోరు 93 పరుగులు. 

షా ఔటైనా.. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ పంత్ (14 బంతుల్లో 27.. 2 ఫోర్లు, 2 సిక్సర్లు) వార్నర్ తో కలిసి స్కోరుబోర్డును వేగంగా ముందుకు నడిపించాడు.వరుణ్ చక్రవర్తి వేసిన 11వ ఓవర్లో పంత్ 6, 4 కొట్టాడు. అదే ఓవర్లో వార్నర్ కూడా ఫోర్ కొట్టడంతో మొత్తంగా ఆ ఓవర్లో 24 పరగులొచ్చాయి. ఇక రసెల్ వేసిన 13వ ఓవర్లో సిక్స్ కొట్టిన వార్నర్ భాయ్.. హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే అదే ఓవరర్లో ఐదో బంతికి పంత్.. భారీ షాట్ ఆడి బ్యాక్ వర్డ్ పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఉమేశ్ యాదవ్ కు చిక్కాడు. 

పంత్ నిష్క్రమించాక ఢిల్లీ స్కోరు వేగం తగ్గింది. నరైన్ వేసిన 14వ ఓవర్లో లలిత్ యాదవ్ (1) ఎల్బీడబ్ల్యూ గా వెనుదిరిగగా.. అతడి స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన పావెల్ (8) కూడా నరైన్ వెనక్కి పంపాడు. ఇక 16వ ఓవర్లో వార్నర్ కూడా.. ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో రహానే కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. 

అయితే ఆఖర్లో వచ్చిన అక్షర్ పటేల్ (14 బంతుల్లో 22 నాటౌట్.. 2 ఫోర్లు, 1 సిక్సర్), శార్దూల్ ఠాకూర్ (11 బంతుల్లో 29 నాటౌట్ .. 3 సిక్సర్లు, 1 ఫోర్) లు బ్యాట్ ఝుళిపించడంతో ఢిల్లీ కోల్కతా ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ (2 వికెట్లు) మినహా బౌలింగ్ వేసిన ప్రతి బౌలర్ భారీగా పరుగులిచ్చుకున్నాడు.