TATA IPL 2022 RR vs MI: ఐపీఎల్-15 లో వరుసగా 8 ఓటములతో ప్లేఆఫ్స్ నుంచి అనధికారికంగా నిష్క్రమించిన ముంబై ఇండియన్స్..  పాయింట్ల పట్టికలో  రెండో స్థానంలో ఉన్న రాజస్తాన్ రాయల్స్ ను ఢీకొంటున్నది. 

వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ నేడు రాజస్తాన్ రాయల్స్ తో తలపడుతున్నది. గత 8 మ్యాచులలో ఒక్క విజయం కూడా లేక తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న.. ముంబై సారథి రోహిత్ శర్మ ఇవాళ 35వ పుట్టినరోజునైనా గెలుపు సాధించాలని కోరుకుంటున్నాడు. ప్లేఆఫ్ ఆశలు అడుగంటిన వేళ ముంబై కూడా ఇక పరువు నిలుపుకోవాలని భావిస్తున్నది. మరో ఆరు మ్యాచులు తమ చేతిలో ఉన్న నేపథ్యంలో వాటిలో నైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నది. డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరుగుతున్న నేటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 

పాయింట్ల పట్టికలో టాప్-2 గా ఉన్న రాజస్తాన్ రాయల్స్.. నేడు ఈ మ్యాచ్ ను గెలిచి తిరిగి అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తున్నది. ఈ సీజన్ లో ముంబై ని కోలుకోనియకుండా చేసేందుకు తగిన ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ సీజన్ లో రెండు జట్లు ఒకసారి తలపడగా అందులో రాజస్తాన్ నే విజయం వరించింది. ఈ సీజన్ లో 8 మ్యాచులాడిన రాయల్స్.. 6 విజయలు, 2 ఓటములతో.. 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

ముంబైతో జరిగిన గత మ్యాచ్ లో రాజస్తాన్ ఓపెనర్ జోస్ బట్లర్ సెంచరీ సాధించాడు. ముంబై అంటేనే పూనకం వచ్చినోడిలా ఆడే బట్లర్.. ఈ మ్యాచ్ లో కూడా అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని కోరుకుంటున్నాడు. అయితే గత మ్యాచ్ (ఆర్సీబీతో) లో సంజూ శాంసన్, బట్లర్ మినహా బ్యాటింగ్ లో ఎవరూ రాణించలేదు. దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హిట్మెయర్, మిచెల్ లు విఫలమయ్యారు. కానీ రియాన్ పరాగ్ ఒంటరి పోరాటం చేసి హాఫ్ సెంచరీతో చెలరేగాడు.

ఇక బౌలింగ్ లో ఆ జట్టుకు ఈ ఐపీఎల్ లోనే ఏ జట్టుకు లేనంత పటిష్ట బౌలింగ్ దళముంది. ట్రెంట్ బౌల్ట్, ప్రసిధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్ లు భీకరమైన ఫామ్ లో ఉన్నారు. వీరిని ఎదిరించి నిలవడం ముంబై బ్యాటర్లకు సవాలే. 

ఇక ముంబై పరిస్థితి ఘోరంగా ఉంది. బ్యాటింగ్ లో ఆ జట్టు ఓపెనర్ ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ లు వరుసగా విఫలమవుతున్నారు. వన్ డౌన్ లో వచ్చే బ్రెవిస్ పెద్దగా ఆకట్టుకోవడం లేదు. తిలక్ వర్మ బాగానే ఆడుతున్నా అతడికి సాయంగా నిలిచేవాళ్లే కరువవుతున్నారు. సీజన్ లో తాను ఆడిన తొలి 3 మ్యాచులలో ఫర్వాలేదనిపించిన సూర్యకుమార్ యాదవ్.. తర్వాత విఫలమవుతున్నాడు. ఇక విధ్వంసకర కీరన్ పొలార్డ్ వరుసగా విఫలమవుతూ జట్టుకు భారంగా మారుతున్నాడు. బ్యాటింగ్ ఇలా ఉంటే బౌలింగ్ లో ముంబై గత మ్యాచులతో పోలిస్తే నాలుగైదు మ్యాచుల్లో కాస్త మెరుగైంది. డేనియల్ సామ్స్, ఉనద్కత్, మెరెడిత్ తో పాటు బుమ్రా లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. ముంబై జట్టులో బ్రెవిస్ స్థానంలో టిమ్ డేవిడ్, ఉనద్కత్ స్థానంలో కుమార్ కార్తీకేయన్ ఆడుతున్నాడు. 

తుది జట్లు : 

రాజస్తాన్ రాయల్స్ : దేవదత్ పడిక్కల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, డారిల్ మిచెల్ రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ సేన్, ప్రసిధ్ కృష్ణ యుజ్వేంద్ర చాహల్ 

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, హృతిక్ షోకీన్, డానియల్ సామ్స్, టిమ్ డేవిడ్, కుమార్ కార్తీకేయన్, రిలే మెరెడిత్, జస్ప్రీత్ బుమ్రా