TATA IPL 2022 LSG vs DC: ప్లేఆఫ్ రేసులో పోటీ పడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన పోరులో పరాజయం పాలైంది. లక్నో నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో 6 పరుగుల తేడాతో ఓడింది. లక్నో బౌలర్లలో మోహిసిన్ ఖాన్ నాలుగు వికెట్లతో చెలరేగాడు.
ఐపీఎల్ ప్లేఆఫ్ రేసులో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. లక్నోతో వాంఖెడే వేదికగా ముగిసిన మ్యాచ్ లో ఆ జట్టు నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కీలక సమయంలో వికెట్లు కోల్పోయి బొక్క బోర్లా పడింది. 196 పరుగుల లక్ష్య ఛేదనలో కెప్టెన్ రిషభ్ పంత్, మిచెల్ మార్ష్, రొవ్మెన్ పావెల్ లు దూకుడుగా ఆడి విజయంమీద ఆశలు కల్పించినా లక్నో బౌలర్లు కీలక సమయంలో వికెట్లు తీసి ఢిల్లీ ని దెబ్బకొట్టారు. 20 ఓవర్లు ఆడిన ఢిల్లీ.. 189 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా ఈ మ్యాచ్ లో లక్నో 6 పరుగుల తేడాతో గెలుపొందింది. లక్నో బౌలర్లలో మోహిసిన్ ఖాన్.. 4-0-16-4తో ఆకట్టుకున్నాడు.
తాజా విజయంతో పాయింట్ల పట్టికలో ఈ మ్యాచ్ కు ముందు మూడో స్థానంలో ఉన్న లక్నో.. రెండో స్థానానికి చేరింది. 10 మ్యాచులు ఆడిన లక్నో.. 7 విజయాలు, 3 ఓటములతో 14 పాయింట్లు సాధించి టాప్-2 కు చేరింది. ఇక ఈ ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ (9 మ్యాచులు.. 4 విజయాలు, 5 పరాజయాలు.. 8 పాయింట్లు) ఆరో స్థానంలో నిలిచింది. ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఆ జట్టు తర్వాత ఆడబోయే ఐదింటిలోనూ నెగ్గాల్సిందే.
భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఓపెనర్లు దారుణంగా విఫలమయ్యారు. 7 బంతులాడిన పృథ్వీ షా.. చమీర వేసిన 2 ఓవర్లోని రెండో బంతికి కృష్ణప్ప గౌతమ్ కు క్యాచ్ ఇచ్చాడు. షార్ట్ లెంగ్త్ బంతిని ఆడే క్రమంలో బంతి బ్యాట్ కు ఎడ్జ్ తీసుకుని ఎత్తుకు లేచింది. మిడాన్ లో ఉన్న గౌతమ్ ఈజీ క్యాచ్ అందుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్లోనే డేవిడ్ వార్నర్ (3) కూడా మోహిసిన్ ఖాన్ బౌలింగ్ లో వార్నర్ కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు.
3 ఓవర్లలో 13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఢిల్లీని మిచెల్ మార్ష్ (20 బంతుల్లో 37.. 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ రిషభ్ పంత్ (30 బంతుల్లో 44.. 7 ఫోర్లు, 1 సిక్సర్) ఆదుకున్నారు. కృనాల్ పాండ్యా వేసిన నాలుగో ఓవర్లో 4, 4, 6, 4 తో 19 పరుగులు పిండుకున్నాడు పంత్. ఆ మరుసటి ఓవర్ వేసిన హోల్డర్ బౌలింగ్ లో మిచెల్ మార్ష్ రెండు సిక్సర్లు బాదాడు. చమీర వేసిన ఆరో ఓవర్లో కూడా మార్ష్ 4, 6 తో సేమ్ సీన్ రిపీట్ చేశాడు. దీంతో 6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది.
కృష్ణప్ప గౌతమ్ వేసిన 8 వ ఓవర్ తొలి బంతికి మార్ష్ ను వదిలేయగా అది వెళ్లి వికెట్ కీపర్ డికాక్ చేతిలో పడింది. లక్నో అప్పీల్ చేయగా అంపైర్ ఔటిచ్చాడు. కానీ టీవీ రిప్లైలో బంతి బ్యాట్ కు తాకలేదని తేలింది. అతడి స్థానంలో వచ్చిన లలిత్ యాదవ్ (3) రవిబిష్ణోయ్ వేసిన 9 వ ఓవర్లో బౌల్డ్ అయ్యాడు.
మార్ష్, లలిత్ ఔటైనా పంత్ మాత్రం దూకుడు కొనసాగించాడు. మరోవైపు పావెల్ (21 బంతుల్లో 35.. 3 ఫోర్లు, 2 సిక్సర్లు) గౌతమ్ వేసిన 12 వ ఓవర్లో 6, 6, 4 బాదాడు. వీళ్లిద్దరూ కుదురుకుంటున్నారని భావించిన రాహుల్.. మోహిసిన్ ఖాన్ కు బంతినిచ్చాడు. 13 వ ఓవర్లో ఆఖరి బంతికి అతడు.. పంత్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మ్యాచ్ లో ఇదే టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత ఢిల్లీ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది.
పంత్ నిష్క్రమించాక ఆదుకుంటాడనుకున్న పావెల్ ను కూడా మోహిసిన్ ఖాన్ బోల్తా కొట్టించాడు. ఇన్నింగ్స్ 17.1 ఓవర్లో షార్ట్ లెంగ్త్ డెలివరీని షాట్ ఆడోబోయి మిడ్ వికెట్ వద్ద ఉన్న కృనాల్ కు చిక్కాడు. మరోరెండు బంతుల తర్వాత మోహిసిన్.. శార్దూల్ (1) ను కూడా అలాగే ఔట్ చేశాడు.
ఇక ఆఖర్లో అక్షర్ పటేల్ (42 నాటౌట్) క్రీజులో ఉన్నా అతడు వికెట్ల పతనాన్ని ఆపాడే తప్ప విజయాన్ని అందించలేదు. ఆఖరి ఓవర్లో 22 పరుగులు అవసరం కాగా తొలి బంతికి కుల్దీప్ యాదవ్ (8 నాటౌట్) సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత బంతికి అక్షర్ నాలుగు బంతులాడినా 15 పరుగులు చేయలేకపోయాడు లక్నో బౌలర్లలో మోహిసిన్ ఖాన్ కు నాలుగు వికెట్లు దక్కగా.. చమీర, రవి బిష్ణోయ్, గౌతమ్ కు తలో వికెట్ దక్కింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో కెఎల్ రాహుల్ (77), దీపక్ హుడా (52), క్వింటన్ డికాక్ (23) లు రాణించారు.
సంక్షిప్త స్కోరు వివరాలు :
- లక్నో సూపర్ జెయింట్స్ : 195-3
- ఢిల్లీ క్యాపిటల్స్ : 189-7
- ఫలితం : 6 పరుగుల తేడాతో లక్నో గెలుపు
