TATA IPL 2022 DC vs SRH: ఐపీఎల్ లో ప్లేఆఫ్  రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచులలో కూడా  సన్ రైజర్స్ హైదరాబాద్ ఆట తీరు మారడం లేదు.  ముందు బౌలర్ల అద్వాన్న ప్రదర్శన కొనసాగగా.. బ్యాటర్లు కూడా వారినే అనుసరించారు. 

ఐపీఎల్-15 ప్లే అకాశాలను సన్ రైజర్స్ హైదరాబాద్ మరింత సంక్లిష్టం చేసుకుంది. నిలవాలంటే గెలవాల్సిన పరిస్థితుల్లో కూడా అదే నిర్లక్ష్యపు ఆటతీరుతో బౌలింగ్ లోనూ బ్యాటింగ్ లోనూ విఫలమై ఐపీఎల్ లో 5 విజయాల తర్వాత వరుసగా మూడో పరాజయాన్ని మూటగట్టుకుంది. భారీ లక్ష్య ఛేదనలో ఓపెనర్లు విఫలమైనా.. పూరన్ (62), మార్కమ్ (42) విజయం కోసం ప్రయత్నించినా వాళ్ల పోరాటం హైదరాబాద్ కు విజయాన్ని అందించలేదు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఎస్ఆర్హెచ్.. 8 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా 21 పరగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది.

భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్ రైజర్స్ కు ఆదిలోనే భారీ షాక్ లు తగిలాయి. ఈ సీజన్ లో సన్ రైజర్స్ తరఫున అత్యధిక స్కోరు చేసిన అభిషేక్ శర్మ (7) రెండో ఓవర్లోనే ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక ఈ సీజన్ లో ఫామ్ లేమితో తంటాలు పడుతున్న ఎస్ఆర్హెచ్ సారథి కేన్ విలియమ్సన్ (4) కూడా మళ్లీ విఫలమయ్యాడు. భారీ ఛేదనలో 5 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 24 పరుగులు. 

ఆశలు కల్పించిన మార్క్రమ్-పూరన్

ఆదుకుంటాడనుకున్న రాహుల్ త్రిపాఠి (18 బంతుల్లో 22.. 2 ఫోర్లు, 1 సిక్సర్) కూడా మిచెల్ మార్ష్ బౌలింగ్ లో ఠాకూర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 7 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోరు 37-3. ఆ తర్వాత పరుగుల రాక కాస్త నెమ్మదించింది. పది ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోరు 63 పరుగులే. అయితే కుల్దీప్ యాదవ్ వేసిన పదో ఓవర్లో మార్క్రమ్ (25 బంతుల్లో 42.. 4 ఫోర్లు, 3 సిక్సర్లు), నికోలస్ పూరన్ (34 బంతుల్లో 62.. 2 ఫోర్లు, 6 సిక్సర్లు) లు గేర్ మార్చారు. ఆ ఓవర్లో తలా ఓ సిక్సర్ బాదారు.

మార్ర్కమ్.. మిచెల్ మార్ష్ వేసిన 11వ ఓవర్లో కూడా 3 ఫోర్లు బాది జోరు కొనసాగించాడు. దీంతో సన్ రైజర్స్ శిభిరంలో కూడా గెలుపు మీద ఆశలు రేగాయి. అదే ఊపులో కుల్దీప్ వేసిన 12వ ఓవర్లో కూడా రెండు సిక్సర్లు బాదాడు. కానీ ఖలీల్ అహ్మద్ వేసిన 13వ ఓవర్ ఐదో బంతికి భారీ షాట్ ఆడబోయి లాంగాఫ్ లో కుల్దీప్ యాదవ్ కు చిక్కాడు. దీంతో 60 పరుగుల నాలుగో వికెట్ కు తెరపడింది. 

పూరన్ ప్రయత్నించినా...

మార్క్రమ్ ఔటైనా పూరన్ జోరు కొనసాగించాడు. నోర్త్జ్ వేసిన 14వ ఓవర్లో రెండు సిక్సర్లు బాది 16 పరుగులు రాబట్టిన అతడు.. శార్దూల్ వేసిన 15వ ఓవర్లో కూడా.. శార్దూల్ వేసిన ఓవర్లోనూ ఓ భారీ షాట్ ఆడాడు. కానీ అదే ఓవర్లో.. నాలుగో బంతిని ఫోర్ కొట్టిన శశాంక్ (10).. ఐదో బంతికి నోర్త్జ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కాన పూరన్-మార్క్రమ్ ల జోరుకు పది ఓవర్లకు 63 ఉన్న సన్ రైజర్స్ స్కోరు.. 15 ఓవర్లు ముగిసేటప్పటికీ 134 చేరింది. 30 బంతుల్లో 71 పరుగులొచ్చాయి.

ఇక ఆఖరి నాలుగు ఓవర్లలో 62 పరుగులు అవసరమనగా.. సీన్ అబాట్ (7) ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో రిపల్ పటేల్ కు క్యాచ్ ఇచ్చాడు. అంతేగాక ఆ ఓవర్లో ఏడు పరుగులే వచ్చాయి. కానీ శార్దూల్ వేసిన 18వ ఓవర్లో పూరన్.. 4, 6 కొట్టాడు. కానీ ఐదో బంతికి పావెల్ కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. ఇక ఆ తర్వాత హైదరాబాద్ ఇన్నింగ్స్ లో చెప్పుకోవడానికి ఏమీలేదు. 

ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా.. శార్దూల్ రెండు, నోర్త్జ్, మిచెల్ మార్ష్, కుల్దీప్ యాదవ్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 207 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (92 నాటౌట్), రొవ్మెన్ పావెల్ (65 నాటౌట్), రిషభ్ పంత్ (26) దంచికొట్టారు.

సంక్షిప్త స్కోరు వివరాలు : 

- ఢిల్లీ క్యాపిటల్స్ : 207-3 
- సన్ రైజర్స్ హైదరాబాద్ : 186-8
- ఫలితం : 21 పరుగుల తేడాతో ఢిల్లీ గెలుపు