TATA IPL 2022 - KKR vs DC: ఢిల్లీ నిర్దేశించిన భారీ స్కోరు ముందు కోల్కతా ఢీలా పడిపోయింది.  కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆ జట్టు బ్యాటర్లు  తడబడ్డారు.  సారథి శ్రేయస్ అయ్యర్, నితీశ్ రాణాలు రాణించినా ఆ పరుగులు విజయాన్ని చేరలేదు. 

ఐపీఎల్ లో ఇంతవరకు కప్పు నెగ్గని జట్టుగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్.. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచులో మాత్రం ఛాంపియన్లలా ఆడింది. ముందు బ్యాటింగ్ లో విజృంభించి ఆడిన ఢిల్లీ.. ఆ తర్వాత బౌలింగ్ లో కూడా కేకేఆర్ కు గట్టి షాక్ ఇచ్చింది. ఢిల్లీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఖలీల్ అహ్మద్ 3 వికెట్లతో రాణించాడు. భారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్.. 19.4 ఓవర్లలో 171 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా 44 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. 215 పరుగులు చేసిన విషయం తెలిసిందే. వరుసగా రెండు విజయాల తర్వాత ఆ జట్టుకు ఇది మొదటి ఓటమి కాగా.. రెండు పరాజయాల అనంతరం ఢిల్లీకి తొలి గెలుపు.

కొండంత లక్ష్యం ఎదుట ఉండటంతో కోల్కతా ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్ (8 బంతుల్లో 18.. 1 ఫోర్, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. అయితే అతడు ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన రెండో ఓవర్లో వరుస బంతుల్లో సిక్సర్లు బాదాడు. కానీ తర్వాత ఖలీల్ అహ్మద్ వేసిన మూడో ఓవర్ల అక్షర్ పటేల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మరోవైపు రహానే (14 బంతుల్లో 8) కూడా ఖలీల్ కే చిక్కాడు. దీంతో కేకేఆర్.. 38 పరగులకే ఓపెనర్లను కోల్పోయింది. 

వీరి స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (33 బంతుల్లో 54.. 5 ఫోర్లు, 2 సిక్సర్లు), నితీశ్ రాణా (20 బంతుల్లో 30.. 3 సిక్సర్లు) లు సింగిల్స్, డబుల్స్ తీయడానికే యత్నించారు. క్రీజులో కుదురుకోవడానికే ప్రాముఖ్యతనివ్వడంతో కేకేఆర్ స్కోరులో వేగం తగ్గింది. భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉన్నా తొలి 9 ఓవర్లలో కేకేఆర్ చేసింది 74 పరుగులే... 

Scroll to load tweet…

అయితే అప్పటికే క్రీజులో కుదురుకున్న శ్రేయస్ అయ్యర్.. బ్యాట్ కు పని చెప్పాడు. పావెల్ వేసిన పదో ఓవర్లో అయ్యర్ ఫోర్ కొట్టగా.. నితీవ్ రానా సిక్సర్ బాదాడు. తర్వాత కుల్దీప్ యాదవ్ ఓవర్లో కూడా పది పరుగులు వచ్చాయి. అయితే సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోతుండటంతో రాణా హిట్టింగ్ కు దిగే క్రమంలో 12వ ఓవర్లో లలిత్ యాదవ్ బౌలింగ్ లో పృథ్వీ షా కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 69 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఇక కుల్దీప్ వేసిన 13 వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన శ్రేయస్.. అదే ఓవర్లో ముందుకొచ్చి ఆడే క్రమంలో స్టంపౌట్ అయ్యాడు. 

వీరి స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ఆండ్రీ రసెల్ (21 బంతుల్లో24 ), సామ్ బిల్లింగ్స్ (9 బంతుల్లో 15.. 1 ఫోర్, 1 సిక్సర్) కూడా క్రీజులో నిలవలేదు. సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోతుండటంతో ధాటిగా ఆడటానికి యత్నించినా ఢిల్లీ బౌలర్లు మాత్రం అందుకు అవకాశమివ్వలేదు. గత మ్యాచులో 15 బంతుల్లోనే 56 పరుగులు చేసిన ప్యాట్ కమిన్స్.. ఈసారి మాత్రం 4 పరుగులే చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. రసెల్ ఆఖరుదాకా క్రీజులో ఉన్నా అతడు పెద్దగా మెరపులు మెరిపించలేకపోయాడు. 

ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్ రాణించారు. ముస్తాఫిజుర్ పొదుపుగా బౌలింగ్ చేయగా.. అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ (2 వికెట్లు) భారీగా పరుగులిచ్చారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆది నుంచి దూకుడు మంత్రాన్నే జపించింది. ఆ జట్టు ఓపెనర్లు పృథ్వీ షా (51), డేవిడ్ వార్నర్ (61) లు తొలి వికెట్ కు 93 పరుగులు జోడించారు. వన్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ రిషభ్ పంత్ (27) కూడా దాటిగా ఆడాడు. ఇక ఆఖర్లో అక్షర్ పటేల్ (22 నాటౌట్), శార్దూల్ ఠాకూర్ (29 నాటౌట్) లు బ్యాట్ ఝుళిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్.. 5 వికెట్ల నష్టానికి 215 పరగులు చేసింది.