Asianet News TeluguAsianet News Telugu

T20 Worldcup 2021: భారత బౌలర్ల విశ్వరూపం... 85 పరుగులకే స్కాట్లాండ్ ఆలౌట్...

T20 worldcup 2021: 85 పరుగులకే ఆలౌట్ అయిన స్కాట్లాండ్... రవీంద్ర జడేజా, మహ్మద్ షమీలకు మూడేసి వికెట్లు...

T20 Worldcup 2021: Team India bowlers Impressive performance against Scotland
Author
India, First Published Nov 5, 2021, 8:57 PM IST

టీ20 వరల్డ్‌కప్‌ 2021 టోర్నీలో ఇప్పటిదాకా అద్భుతాలు చేయలేకపోయిన భారత బౌలర్లు, పసికూన స్కాట్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విశ్వరూపం చూపించాడు. టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నిర్ణయానికి విలువ నిస్తూ, భారత బౌలర్లు సమిష్టిగా రాణించారు. దీంతో స్కాట్లాండ్ 17.4 ఓవర్లలో 85 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

కెప్టెన్ కేల్ కోట్జర్‌ను బుమ్రా బౌల్డ్ చేయడంతో 13 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది స్కాట్లాండ్. అయితే బుమ్రా వేసిన మొదటి ఓవర్ ఆఖరి బంతికి సిక్సర్ బాదిన స్కాట్లాండ్ ఓపెనర్ జార్జ్ మున్సీ, రవిచంద్రన్ అశ్విన్ ఓవర్‌లో వరుసగా హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. 19 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 24 పరుగులు చేసిన జార్జ్ మున్సేని షమీ అవుట్ చేశాడు. షమీ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించిన మున్సే, హార్ధిక్ పాండ్యాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

Read: ఒకే రకమైన పొజిషన్‌లో టీమిండియా, విండీస్‌... టీ20ల్లో వెస్టిండీస్ పతనానికి కారణమేంటి...

ఆ తర్వాత రవీంద్ర జడేజా బంతితో మ్యాజిక్ చేశాడు. రిచీ బెర్టింటన్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన రవీంద్ర జడేజా, అదే ఓవర్‌లో వికెట్ కీపర్ మాథ్యూ క్రాస్‌ను కూడా ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌ చేర్చి స్కాట్లాండ్‌ను దెబ్బ తీశాడు.  క్రిస్ గ్రీవ్స్‌ని రవిచంద్రన్ అశ్విన్ అవుట్ చేయగా, 28 బంతుల్లో 16 పరుగులు చేసిన కలమ్ మెక్‌లార్డ్‌ను మహ్మద్ షమీ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి బంతికి సఫ్యాన్ షరీఫ్ రనౌట్ అయ్యాడు. షమీ ఎల్బీడబ్ల్యూకి అప్పీలు చేసినా అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు.

అయితే సఫ్యాన్‌ క్రీజు దాటి రావడం గమనించిన ఇషాన్ కిషన్, పరుగెత్తుకుంటూ వెళ్లి రనౌట్ చేశాడు. ఆ తర్వాతి బంతికి అల్స్‌దర్ ఎవన్స్‌ను మహ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత 13 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసిన మాథ్యూ వాట్‌ను బుమ్రా బౌల్డ్ చేయడంతో 85 పరుగులకే ఆలౌట్ అయ్యింది స్కాట్లాండ్...

మాథ్యూ వాట్ వికెట్‌తో అత్యధిక టీ20 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా యజ్వేంద్ర చాహాల్‌ను అధిగమించి, టాప్‌లో నిలిచాడు జస్ప్రిత్ బుమ్రా... భారత జట్టు రన్‌రేట్ ఆఫ్ఘాన్‌ నెట్ రన్‌రేట్‌ కంటే మెరుగవ్వాలంటే 86 పరుగుల టార్గెట్‌ను 7.1 ఓవర్లలోనే అధిగమించాల్సి ఉంటుంది టీమిండియా. 8.5 ఓవర్లలోపు లక్ష్యాన్ని ఛేదిస్తే న్యూజిలాండ్ కంటే మెరుగైన రన్‌రేట్‌ను అందుకుంది. 11.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదిస్తే భారత నెట్ రన్ రేట్ +1.000గా మారుతుంది...

Read also: రోహిత్ శర్మ కాదు, అతనికే టీమిండియా టీ20 కెప్టెన్సీ... ఏ మాత్రం కెప్టెన్సీ స్కిల్స్‌ లేని వ్యక్తికి...

భారత జట్టుకి టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఇది రెండో అత్యల్ప టార్గెట్. ఇంతకుముందు 2012 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఇంగ్లాండ్‌ను 80 పరుగులకి ఆలౌట్ చేసింది టీమిండియా. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీయగా, ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన మహ్మద్ షమీ కూడా 3 వికెట్లు పడగొట్టాడు. బుమ్రాకి రెండు వికెట్లు దక్కాయి. 15 పరుగులకే 3 వికెట్లు తీసిన జడేజా, టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసుకున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios