T20 worldcup 2021: తొడ కండరాల గాయంతో టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి దూరమైన షకీబ్ అల్ హసన్... ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న బంగ్లా...

టీ20 వరల్డ్‌కప్ 2021  టోర్నీలో బంగ్లాదేశ్‌కి ఏదీ పెద్దగా కలిసి రావడం లేదు. బీభత్సమైన ఫామ్‌లో ఉన్న బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్, టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి దూరమయ్యాడు. దీంతో మిగిలిన రెండు మ్యాచుల్లో షకీబ్ లేకుండానే బరిలో దిగనుంది బంగ్లాదేశ్...క్వాలిఫైయర్స్‌ రౌండ్‌లో స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో ఓడిన బంగ్లాదేశ్, ఆ తర్వాత రెండు మ్యాచుల్లో గెలిచి సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించింది.

అయితే స్కాట్లాండ్‌తో మ్యాచ్ ఓటమి కారణంగా గ్రూప్ 2 రావాల్సిన బంగ్లా, పటిష్టమైన జట్లు ఉన్న గ్రూప్ 1కి వెళ్లాల్సి వచ్చింది. సూపర్ 12లో వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిన బంగ్లాదేశ్ జట్టు, ఇప్పటికీ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 171 పరుగుల భారీ స్కోరు చేసిన బంగ్లాదేశ్, ఆ లక్ష్యాన్ని కాపాడుకోలేక 5 వికెట్ల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్‌లో 2 వికెట్లు తీసి రాణించాడు షకీబ్ అల్ హసన్.

టీ20 వరల్డ్‌కప్‌లోనే అత్యధిక టీ20 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా టాప్‌లోకి దూసుకెళ్లాడు షకీబ్. 107 టీ20 వికెట్లు తీసిన శ్రీలంక మాజీ బౌలర్ లసిత్ మలింగను అధిగమించిన షకీబ్, 117 వికెట్లతో అత్యధిక అంతర్జాతీయ టీ20 వికెట్లు తీసిన బౌలర్‌గా టాప్‌లో నిలిచాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన ఆఫ్ఘాన్ యంగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్, 101 వికెట్లతో షకీబ్ అల్ హసన్, లసిత్ మలింగ తర్వాతి స్థానంలో నిలిచాడు...

Must Read: టీ20 వరల్డ్‌కప్‌లో ఆఖరిగా వికెట్ తీసిన భారత బౌలర్‌ ఎవరో తెలుసా... విరాట్ కోహ్లీ తర్వాత...

ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ ఘోరంగా ఫెయిల్ అయ్యింది బంగ్లాదేశ్. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పోరాడి ఓడింది బంగ్లాదేశ్... తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 142 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో 139 పరుగులకి పరిమితమై 3 పరుగుల తేడాతో ఓడింది బంగ్లాదేశ్.

వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనే బ్యాటింగ్ చేసేటప్పుడు నడవడానికి ఇబ్బంది పడ్డాడు షకీబ్ అల్ హసన్. అతని గాయాన్ని పరీక్షించిన డాక్టర్లు, మూడు వారాల విశ్రాంతి అవసరమని సూచించడంతో టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి దూరమయ్యాడు షకీబ్... ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్ జట్టు, నవంబర్ 2న సౌతాఫ్రికాతో, ఆ తర్వాత నవంబర్ 4న ఆస్ట్రేలియాతో మ్యాచులు ఆడనుంది. 

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ తర్వాత పాకిస్తాన్‌తో కలిసి టీ20, టెస్టు సిరీస్ ఆడనుంది బంగ్లాదేశ్. నవంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే బంగ్లా టూర్‌లో మూడు టీ20 మ్యాచులు, రెండు టెస్టులు ఆడనుంది పాకిస్తాన్. స్వదేశంలో తిరుగులేని రికార్డు ఉన్న షకీబ్ అల్ హసన్ లేని లోటు, పాకిస్తాన్‌తో జరగబోయే సిరీస్‌లో బంగ్లా జట్టుపై తీవ్రంగా పడే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: వెన్నెముక లేని వెధవలు, మతం పేరుతో దూషిస్తారా... మహ్మద్ షమీపై వచ్చిన ట్రోల్స్‌పై విరాట్ కోహ్లీ ఫైర్...

అవినీతి ఆరోపణలతో ఏడాదిపాటు నిషేధానికి గురైన షకీబ్ అల్ హసన్, రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు. బంగ్లాలో జరిగిన ధాకా ప్రీమియర్ లీగ్‌లో అంపైర్‌తో గొడవపడి వార్తల్లో నిలిచాడు షకీబ్ అల్ హసన్...