టీ20 వరల్డ్‌కప్ 2021: 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్న ఆస్ట్రేలియా... డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ హాఫ్ సెంచరీలు... 

టీ20 వరల్డ్‌కప్‌ 2021 టోర్నీని టైటిల్ ఫెవరెట్‌గా ఆరంభించిన వెస్టిండీస్, ఒకే ఒక్క విజయంతో టోర్నీని ముగించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి సూపర్ 12 రౌండ్ మ్యాచ్‌లో వెస్టిండీస్, ఆసీస్ చేతిలో చిత్తుగా ఓడింది. వెస్టిండీస్ విధించిన 158 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.2 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది ఆస్ట్రేలియా...

ఆరోన్ ఫించ్ 11 బంతుల్లో 9 పరుగులు చేసి అవుట్ కాగా... మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ కలిసి 124 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించి, ఆసీస్‌కి ఈజీ విక్టరీ అందించారు. విజయానికి ఒక్క పరుగు కావాల్సిన దశలో మిచెల్ మార్ష్ అవుట్ కాగా... ఓపెనర్ డేవిడ్ వార్నర్ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

మిచెల్ మార్ష్ 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేసి క్రిస్ గేల్ బౌలింగ్‌లో జాసన్ హోల్డర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. డేవిడ్ వార్నర్ 56 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 89 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

Read: ఒకే రకమైన పొజిషన్‌లో టీమిండియా, విండీస్‌... టీ20ల్లో వెస్టిండీస్ పతనానికి కారణమేంటి...


అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది... మొదటి ఓవర్‌లో నాలుగు పరుగులు మాత్రమే రాగా, రెండో ఓవర్‌లో లూయిస్ వరుసగా మూడు ఫోర్లు, క్రిస్ గేల్ ఓ సిక్సర్ బాదడడంతో 20 పరుగులు వచ్చాయి. అయితే ప్యాట్ కమ్మిన్స్ వేసిన మూడో ఓవర్‌లో వెస్టిండీస్‌కి తొలి దెబ్బ తగిలింది. 9 బంతుల్లో 2 సిక్సర్లతో 15 పరుగులు చేసిన క్రిస్ గేల్, కమ్మిన్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

వస్తూనే ఫోర్ బాదిన నికోలస్ పూరన్, హజల్‌వుడ్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రెండో బంతికే రోస్టన్ ఛేజ్‌ను కూడా హజల్‌వుడ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఒకానొక దశలో 30/0 స్కోరుతో ఉన్న వెస్టిండీస్, 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

26 బంతుల్లో 5 ఫోర్లతో 29 పరుగులు చేసిన ఓపెనర్ ఇవిన్ లూయిస్, ఆడమ్ జంపా బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 28 బంతుల్లో 2 ఫోర్లతో 27 పరుగులు చేసిన హెట్మయర్ కూడా జోష్ హజల్‌వుడ్ బౌలింగ్‌లో కీపర్ మాథ్యూ వేడ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

Read also: రోహిత్ శర్మ కాదు, అతనికే టీమిండియా టీ20 కెప్టెన్సీ... ఏ మాత్రం కెప్టెన్సీ స్కిల్స్‌ లేని వ్యక్తికి...

ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించి, ఆఖరి మ్యాచ్ ఆడుతున్న ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో 12 బంతుల్లో ఓ సిక్సర్‌తో 10 పరుగులు చేసి జోష్ హజల్‌వుడ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...
31 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 44 పరుగులు చేసిన పోలార్డ్‌ను మిచెల్ స్టార్క్ అవుట్ చేయగా ఆఖరి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాదిన ఆండ్రే రస్సెల్, విండీస్ స్కోరును 150+ మార్కు దాటించాడు. 

మొదటి ఓవర్‌లో 20 పరుగులు సమర్పించిన జోష్ హజల్‌వుడ్, ఆ తర్వాత మూడు ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీయడం విశేషం.