Asianet News TeluguAsianet News Telugu

T20 worldcup: కివీస్ బౌలర్ కి తృటిలో తప్పిన ప్రమాదం..!

తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేయగా.. ఛేదనలో నమీబియా 7 వికెట్లు నష్టపోయి కేవలం 111 పరుగుల మాత్రమే చేసి ఓటమిపాలైంది.  

T20 World Cup: New Zealand's Ish Sodhi gets hit on the face against Namibia
Author
Hyderabad, First Published Nov 6, 2021, 9:21 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

T20 worldcup జోరు మీద సాగుతోంది. ఈ ప్రపంచకప్ లో భాగంగా శుక్రవారం  నమీబియా, న్యూజిలాండ్ మ్యాచులు తలపడ్డాయి. కాగా.. ఈ  మ్యాచ్ సందర్భంగా న్యూజిలాండ్ బౌలర్ ఐష్ సోధి కి పెను ప్రమాదం తృటిలో తప్పింది.

నమీబియా ఇన్నింగ్స్‌ 12వ ఓవర్లో డేవిడ్‌ వీస్‌ కొట్టిన బంతి బౌలర్‌ ఐష్‌ సోధి వేళ్లను తాకుతూ నుదుటిపై బలంగా తాకింది. దీంతో సోధి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ హఠాత్పరిణామంతో మైదానంలో ఉన్న వారంత ఉలిక్కిపడ్డాడు. అయితే, ఆశ్చర్యకరంగా సోధి ఎటువంటి గాయం లేకుండా లేచి నిలబడడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.

 

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఆల్‌రౌండ్‌ ప్రతిభతో మూకుమ్మడిగా రాణించడంతో 52 పరుగుల తేడాతో నమీబియాపై ఘన విజయం సాధించి సెమీస్‌ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేయగా.. ఛేదనలో నమీబియా 7 వికెట్లు నష్టపోయి కేవలం 111 పరుగుల మాత్రమే చేసి ఓటమిపాలైంది.  

కాగా.. అద్భుతం చేస్తుందనుకున్న నమీబియా.. భారత అభిమానుల ఆశలను ఆవిరి చేసింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ (ICC T20 World cup) లో.. గ్రూప్-2 లో షార్జా వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు న్యూజిలాండ్ (New Zealand Vs Namibia) చేతిలో పరాజయం పాలైంది. తొలుత ఫీల్డింగ్ ఎంచుకుని భారీ బ్యాటింగ్ లైనప్ ఉన్న కివీస్ ను 163 పరుగులకే కట్టడి చేసిన నమీబియా.. బ్యాటింగ్ లో కూడా పోరాడుతుందని  భావించగా.. ఆ జట్టు మాత్రం 111 పరుగులకే చేతులెత్తేసింది. ఈ మ్యాచ్ లో నమీబియా గనుక న్యూజిలాండ్ కు షాక్ ఇచ్చి ఉంటే భారత సెమీస్ ఆశలు మెరుగయ్యేవి. ఈ నెల 7న న్యూజిలాండ్-అఫ్గనిస్థాన్ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా భారత్ సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకునేది. నెట్ రన్ రేట్, మరే ఇతర సమీకరణాల గోల లేకుండా సెమీఫైనల్ కు అర్హత సాధించేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఇక భారత్ కు మిగిలిన ఒకే ఒక ఆశ అఫ్గానిస్థానే (Afghanistan). అఫ్గాన్-న్యూజిలాండ్  మ్యాచ్ పైనే భారత అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఆ మ్యాచ్ లో అఫ్గాన్ గెలిస్తేనే కప్పుపై మనకు ఆశలు. లేకుంటే టీమిండియా కథ కంచికే.. 

ఇక న్యూజిలాండ్-నమీబియా మ్యాచ్ విషయానికొస్తే.. లక్ష్య ఛేదనలో మంచి ఆరంభం లభించినా నమీబియన్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. 20 ఓవర్లు ఆడిన నమీబియా (Namibia) బ్యాటర్లు.. 111 పరుగులకే పరిమితమయ్యారు. ఫలితంగా కివీస్.. 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. మధ్య ఓవర్లలో కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా వేసి మ్యాచ్ పై పట్టు సాధించి గెలుపును ఖాయం చేసుకున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించిన జిమ్మీ నీషమ్ (న్యూజిలాండ్) కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 

164 పరుగుల లక్ష్య ఛేదనలో నమీబియాకు శుభారంభం లభించింది. ఆ జట్టు ఓపెనర్లు  వాన్ లింగెన్ (25 బంతుల్లో 25.. 2 ఫోర్లు, సిక్స్), స్టీఫెన్ బార్డ్ (19 బంతుల్లో 19.. 2 ఫోర్లు) నిలకడగా బ్యాటింగ్ చేశారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు 47 పరుగులు జోడించారు. ఇద్దరూ కలిసి కివీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కున్నారు. వీలైనప్పుడు బౌండరీలు బాదుతూ వికెట్ల మధ్య పరుగెత్తుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. మిల్నే వేసిన  ఆరో ఓవర్లో లింగెన్.. సిక్స్, ఫోర్ కొట్టాడు. 6 ఓవర్లు ముగిసేసరికి  నమీబియా స్కోరు వికెట్ నష్టపోకుండా 36 పరుగులు. 

లక్ష్యం దిశగా సాగుతుందేమో అనిపించిన నమీబియాను నీషమ్.. తొలి దెబ్బ తీశాడు. 7.2 ఓవర్ లో లింగెన్ ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లోనే  సాంట్నర్..  మరో ఓపెనర్ బార్డ్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. పట్టు బిగించాలని చూసిన కివీస్ బౌలర్లు.. పదో ఓవర్లో మరోసారి సఫలమయ్యారు. ఆ ఓవర్ వేసిన ఇష్ సోధి.. నమీబియా సారథి ఎరాస్మస్ (3) ను ఔట్ చేశాడు. 

ఈ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన నమీబియా  వికెట్ కపీర్  జేన్ గ్రీన్ (27 బంతుల్లో 23),  ఆల్ రౌండర్ డేవిడ్ వీస్ (17 బంతుల్లో 16.. 1 సిక్స్, 1 ఫోర్) వికెట్ల పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు. సోధి వేసిన 14 వ ఓవర్లో సిక్స్ కొట్టి ఊపు మీద కనిపించిన వీస్.. ఆ తర్వాత ఓవర్ వేసిన టిమ్ సౌథీ కి వికెట్ల ముందు దొరికిపోయాడు. అప్పటిదాకా నిలకడగా ఆడిన గ్రీన్ కూడా.. సౌథీ బౌలింగ్ లోనే బౌల్ట్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

ఇక ఆ తర్వాత నమీబియా ఇన్నింగ్స్ లో పెద్దగా మెరుపులేమీ లేవు. వచ్చినవాళ్లంతా సింగిల్స్ తీయడానికే ఇబ్బంది పడ్డారు.  నమీబియా ఇన్నింగ్స్ లో లింగెన్ (25) టాప్ స్కోరర్. ఫలితంగా ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. న్యూజిలాండ్ 52 పరుగుల తేడాతో విజయం సాధించింది.  ఈ విజయంతో గ్రూప్-2 లో పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ (New Zealand)..  పాకిస్థాన్ (Pakistan) తర్వాత రెండో స్థానంలో నిలిచింది.

ఇక కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి నమీబియా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ముఖ్యంగా టిమ్ సౌథీ.. 4 ఓవర్లు వేసి 15 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. బౌల్ట్ కూడా 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. స్పిన్నర్లు సాంట్నర్, సోధి తలో వికెట్ దక్కించుకున్నారు.  నీషమ్ కు ఒక వికెట్ దక్కింది. ఈ విజయంతో న్యూజిలాండ్.. సెమీస్ రేసుకు మరింత దగ్గరైంది. 

Follow Us:
Download App:
  • android
  • ios