T20 World Cup 2022: బలహీనమైన యూఏఈపై బ్యాటింగ్ లో అంతగా మెరుపులు మెరిపించకపోయినా బౌలింగ్ లో మాత్రం శ్రీలంక ఆకట్టుకుంది. అంతగా అనుభవం లేని యూఏఈ బ్యాటర్లపై లంక బౌలర్లు తమ ప్రతాపం చూపించారు.
టీ20 ప్రపంచకప్ లో అర్హత సాధించాలంటే తప్పక విజయం సాధించాల్సిన మ్యాచ్ లో లంక సింహాలు గర్జించాయి. బలహీనమైన యూఏఈపై బ్యాటింగ్ లో అంతగా మెరుపులు మెరిపించకపోయినా బౌలింగ్ లో మాత్రం ఆకట్టుకుంది. అంతగా అనుభవం లేని యూఏఈ బ్యాటర్లపై లంక బౌలర్లు తమ ప్రతాపం చూపించారు. లంక నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యూఏఈ... 17.1 ఓవర్ల లో 73 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా లంక 79 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో తొలి మ్యాచ్ లో నమీబియాతో ఓడిన లంక నేడు విజయం సాధించడంతో క్వాలిఫై రేసులో నిలిచినట్టైంది.
జీలాంగ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన లంక తొలుత బ్యాటింగ్ కు వచ్చింది. ఓపెనర్ పతుమ్ నిస్సంక.. 60 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. అతడికి తోడుగా ధనంజయ డిసిల్వా (21 బంతుల్లో 33, 3 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచాడు.
వీళ్లిద్దరూ మినహా లంక బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భానుక రాజపక్స (5), అసలంక (0), దసున్ శనక (0), వనిందు హసరంగ (2) లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. యూఏఈ బౌలర్లలో కార్తీక్ మెయ్యప్పన్ హ్యాట్రిక్ తో మెరవగా జహూర్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు. అర్యన్ లక్ర, అఫ్జల్ ఖాన్ లు తలో వికెట్ తీశారు.
అనంతరం ఛేదనలో లంక బౌలింగ్ ధాటికి యూఏఈ బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. ఓపెనర్ మహ్మద్ వాసీం (2) చమీర రెండో ఓవర్లోనే బౌల్డ్ చేశాడు. చిరాగ్ సూరీ (19 బంతుల్లో 14, 3 ఫోర్లు) మూడు ఫోర్లతో ఊపు మీద కనిపించినా ప్రమోద్ మధుషన్ బౌలింగ్ లో అతడు కూడా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అర్యన్ లక్రా (1), కెప్టెన్ చుందన్ గోపాయిల్ రిజ్వాన్ (1), వృత్యా అరవింద్ (9), బాసిల్ హమీద్ (2) అలా వచ్చి ఇలా వెళ్లారు. ఓ క్రమంలో యూఏఈ వికెట్లు టపటపా పడుతుంటే ఈ జట్టు కనీసం 40 పరుగులైనా చేస్తుందా..? అనిపించింది. కానీ అయన్ అఫ్జల్ ఖాన్ (19), జునైద్ సిద్ధిఖీ (18) కాస్త ప్రతిఘటించడంతో యూఏఈ స్కోరు 50 పరుగులు దాటింది.
లంక బౌలర్లలో దుష్మంత్ చమీర, హసరంగ తలా 3 వికెట్లు పడగొట్టారు. మహేశ్ తీక్షణకు రెండు, దసున్ శనక, ప్రమోద్ కు ఒక వికెట్ దక్కింది.
ఇక గ్రూప్-ఏలో ఉన్న శ్రీలంక తమ తొలి మ్యాచ్ లో నమీబియా చేతిలో ఓడింది. ఇదే గ్రూప్ లో ఉన్న నెదర్లాండ్స్.. యూఏఈ, నమీబియాను ఓడించి సూపర్-12కు అర్హత రేసులో ముందువరుసలో నిలిచింది. కానీ నమీబియా, శ్రీలంక లు చెరో మ్యాచ్ గెలిచి ఓ మ్యాచ్ ఓడాయి. యూఏఈ రెండు ఆడి రెండింటిలోనూ ఓడింది. నమీబియా తమ తదుపరి మ్యాచ్ ను యూఏఈతో ఆడనుంది. శ్రీలంక తమ తర్వాతి మ్యాచ్ ను ఈనెల 20న నెదర్లాండ్స్ తో ఆడాల్సి ఉంది. ఒకవేళ నమీబియా.. యూఏఈని ఓడించి నెదర్లాండ్స్ తో లంక ఓడినా, గెలిచినా సూపర్-12కు వెళ్లే జట్టు విషయంలో తీవ్ర పోటీ నెలకొనే అవకాశముంది. అప్పుడు నెట్ రన్ రేట్ కీలక పాత్ర పోషిస్తుంది.
