బంగ్లా పులులపై సౌతాఫ్రికా బౌలర్ల సఫారీ... ఘన విజయంతో దక్షిణాఫ్రికా బోణీ..
సౌతాఫ్రికా చేతుల్లో 104 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన బంగ్లాదేశ్... 206 పరుగుల లక్ష్యఛేదనలో 101 పరుగులకి ఆలౌట్ అయిన బంగ్లాదేశ్...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో జింబాబ్వేతో మొదటి మ్యాచ్‌ని వర్షం కారణంగా పూర్తి చేయలేకపోయిన సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌పై ప్రతాపం చూపించింది. 104 పరుగుల తేడాతో బంగ్లా పులులను చిత్తు చేసి, టీ20 వరల్డ్ కప్ 2022లో బోణీ కొట్టింది సౌతాఫ్రికా...
206 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన బంగ్లాదేశ్, 16.3 ఓవర్లలో 101 పరుగులకి ఆలౌట్ అయ్యింది. నజ్ముల్ హుస్సున్ 9, సౌమ్య సర్కార్ 15, లిటన్ దాస్ 34, షకీబ్ అల్ హసన్ 1, అఫిఫ్ హుస్సేన్ 11, నురుల్ హసన్ 2, టస్కిన్ అహ్మద్ 10 పరుగులు చేసి అవుట్ కాగా మోసడెక్ హుస్సేన్, హసన్ మహ్మద్ డకౌట్ అయ్యారు.
సౌతాఫ్రికా బౌలర్ అన్రీచ్ నోకియా 3.3 ఓవర్లలో 10 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా తబ్రిజ్ షంసీకి 3 వికెట్లు దక్కాయి. రబాడా, కేశవ్ మహరాజ్ చెరో వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగుల భారీ స్కోరు చేసింది...
సౌతాఫ్రికా తరుపున టీ20 వరల్డ్ కప్‌లో సెంచరీ చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా రిలీ రోసోవ్ రికార్డు క్రియేట్ చేశాడు. టీమిండియా పర్యటనలో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 100 చేసి నాటౌట్‌గా నిలిచిన రిలీ రోసోవ్‌కి వరుసగా ఇది రెండో టీ20 సెంచరీ. వరుసగా రెండు టీ20 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు రిలీ రోసోవ్...
ఫ్రాన్స్ ప్లేయర్ గుస్తవ్ మెక్‌కియోన్, ఇదే ఏడాది టీ20ల్లో వరుసగా రెండు సెంచరీలు బాదాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికాకి తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. 6 బంతుల్లో 2 పరుగులు చేసిన తెంబ భవుమా, టస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
క్వింటన్ డి కాక్, రిలీ రోసోవ్ కలిస రెండో వికెట్‌కి 168 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించారు. 38 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 63 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్, అఫిఫ్ హుస్సేన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
ట్రిస్టన్ స్టబ్స్ 7, అయిడిన్ మార్క్‌రమ్ 10 పరుగులు చేసి అవుట్ కాగా 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 109 పరుగులు చేసిన రిలీ రోసోవ్‌ని షకీబ్ అల్ హసన్ పెవిలియన్ చేర్చాడు.15 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసిన సౌతాఫ్రికా... ఆఖరి 5 ఓవర్లలో 29 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది..
జింబాబ్వేతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో సెమీ ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే మిగిలిన అన్ని మ్యాచుల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో పడింది సౌతాఫ్రికా. అయితే నేటి మ్యాచ్‌కి కూడా వర్షం అంతరాయం కలిగించింది. కొద్దిసేపటి తర్వాత వాన తగ్గడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది...
షకీబ్ అల్ హసన్ బౌలింగ్ చేస్తున్న సమయంలో వికెట్ల వెనకాల వికెట్ కీపర్ నురుల్ హసన్ కదలడంతో పెనాల్టీ రూపంలో 5 పరుగులను సౌతాఫ్రికా టోటల్‌కి జత చేశారు అంపైర్లు.