Asianet News TeluguAsianet News Telugu

నెదర్లాండ్స్‌పై గెలిచి నిలిచిన పాకిస్తాన్... గ్రూప్ 2లోనూ ఆసక్తికరంగా మారిన సెమీస్ రేసు...

నెదర్లాండ్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలిచిన పాకిస్తాన్... టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌కి తొలి విజయం... టీమిండియా - సౌతాఫ్రికా మ్యాచ్ రిజల్ట్‌ మీదే ఆశలు...

T20 World cup 2022: Pakistan beats Netherlands, Group 2 Interesting
Author
First Published Oct 30, 2022, 4:26 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో గ్రూప్ 2 సెమీస్ రేసులు కూడా ఆసక్తికరంగా మారాయి. గత మ్యాచ్‌లో జింబాబ్వే చేతుల్లో ఊహించని పరాజయాన్ని ఎదుర్కొన్న పాకిస్తాన్ జట్టు, పసికూన నెదర్లాండ్స్‌పైన ప్రతాపం చూపించి టీ20 వరల్డ్ కప్‌లో తొలి విజయాన్ని అందుకుంది...

నెదర్లాండ్స్ విధించిన 92 పరుగుల లక్ష్యాన్ని 13.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది పాకిస్తాన్. బాబర్ ఆజమ్ 4 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. తొలి రెండు మ్యాచుల్లో సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరిన బాబర్ ఆజమ్, వరుసగా మూడు టీ20 మ్యాచుల్లో సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ కావడం ఇదే తొలిసారి...

2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత బాబర్ ఆజమ్ సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ కావడం ఇది 10వ సారి. మొత్తంగా తన కెరీర్‌లో మొదటి 62 ఇన్నింగ్స్‌ల్లో 8 సార్లు సింగిల్ డిజిట్ స్కోరుకి అవుటైన బాబర్ ఆజమ్, ఆ తర్వాత 28 ఇన్నింగ్స్‌ల్లో 10 సార్లు డబుల్ డిజిట్ స్కోరు అందుకోకుండానే పెవిలియన్ చేరడం విశేషం. 

ఈ టోర్నీలో తొలిసారి తుదిజట్టులోకి వచ్చిన ఫకార్ జమాన్ 16 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేశాడు. షాన్ మసూద్ తన స్టైల్‌లో 16 బంతుల్లో 12 పరుగులు చేసి అవుట్ కాగా మహ్మద్ రిజ్వాన్ 39 బంతుల్లో 5 ఫోర్లతో 49 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

ఇఫ్తికర్ అహ్మద్ 6, షాదబ్ ఖాన్ 4 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించారు.  టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్... నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 91 పరుగులు మాత్రమే చేయగలిగింది... టీ20 వరల్డ్ కప్‌లో పూర్తి 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన టీమ్‌కి ఇదే అత్యల్ప స్కోరు. ఇంతకుముందు 2012లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో జింబాబ్వే 8 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేయగా నెదర్లాండ్స్ 20 ఓవర్ల ఆడి 9 వికెట్లు కోల్పోయి 91 పరుగులే చేసింది. 

మేబర్గ్ 6, మ్యాక్స్ ఓడాడ్ 8 పరుగులు చేసి అవుట్ కాగా 16 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన బస్ డే లీడ్, పాక్ బౌలర్ హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో గాయపడ్డాడు. హారీస్ రౌఫ్ వేసిన రాకాసి బౌన్సర్, బస్ డే లీడ్ హెల్మెట్‌కి బలంగా తాకింది. ఈ దెబ్బకి బస్ డే లీడ్ ముఖానికి గీసుకుపోయి రక్తం కారింది. ఫిజియో వచ్చి పరీక్షించిన తర్వాత నొప్పితో బాధపడుతూ పెవిలియన్ చేరాడు బస్ డే లీడ్...

టాప్ కూపర్ 1, వార్ డేర్ మెర్వ్ 5, టిమ్ ప్రింగెల్ 5 పరుగులు చేయగా అకీర్‌మెన్ 27 బంతుల్లో 2 ఫోర్లతో 27 పరుగులు చేసి నెదర్లాండ్స్ తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఎడ్వర్డ్స్ 20 బంతుల్లో ఓ ఫోర్‌తో 15 పరుగులు చేసి నెదర్లాండ్స్ తరుపున డబుల్ డిజిట్ స్కోరు దాటిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు...

ఫ్రెడ్ క్లాసీన్ డకౌట్ కాగా వాన్ మెకీరన్ ఇన్నింగ్స్ ఆఖరి బంతికి రనౌట్ అయ్యాడు. పాక్ బౌలర్లలో షాదబ్ ఖాన్ 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా మహ్మద్ వసీం జూనియర్‌కి 2 వికెట్లు దక్కాయి. షాహీన్ ఆఫ్రిదీ, నసీం షా, హారీస్ రౌఫ్‌లకు తలా ఓ వికెట్ దక్కింది. 

Follow Us:
Download App:
  • android
  • ios