విడువని వాన.. సాగని ఆట.. ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు

T20 World Cup 2022: టీ20  ప్రపంచకప్ జరుగుతున్న ఆస్ట్రేలియాలో వరుణుడు ప్రాక్టీస్ మ్యాచ్ లకు ఆటంకం కలిగిస్తున్నాడు. మంగళవారం పలుమ్యాచ్ లు వర్షం వల్ల రద్దవగా నేడు భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ ను వరుణుడు ముంచెత్తాడు. 

T20 World Cup 2022: India vs New Zealand Match Called Off Due To Rain

ప్రపంచకప్ లో ప్రాక్టీస్ మ్యాచ్ లకు వరుణుడు అంతరాయం కొనసాగుతున్నది. మంగళవారం ఆస్ట్రేలియాలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పలు మ్యాచ్ లు రద్దవగా నేడు కూడా వరుణ దేవుడు  కరుణించలేదు. దీంతో బ్రిస్బేన్ వేదికగా జరగాల్సిన  ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ ను  రద్దు చేసినట్టు అంపైర్లు ప్రకటించారు. టాస్ కూడా పడకుండానే ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ రద్దైంది.  దీంతో పాకిస్తాన్ తో పోరుకు ముందు చివరిసారిగా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడి బరిలోకి దిగుదామనుకున్న టీమిండియా ఆశలు అడియాసలయ్యాయి. 

గబ్బా వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ ను వరుణుడు వదలలేదు.  టాస్ సమయానికల్లా అంతా సర్దుకుంటుంది అనుకున్నా వాన మాత్రం ఆగలేదు. దీంతో ఇరు జట్ల కెప్టెన్ లు టాస్ కు కూడా రాలేదు. 

చివరికి మ్యాచ్ ను ఐదు ఓవర్లకు కుదించైనా నిర్వహిద్దామనుకుంటే అది కూడా సాధ్యపడకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. ఈనెల 23న పాకిస్తాన్ తో కీలక పోరులో తలపడనున్న భారత జట్టు..  ఇప్పుడు ప్రాక్టీస్ లేకుండానే మెల్‌బోర్న్ కు బయలుదేరాల్సి ఉంది. గురువారం టీమిండియా.. మెల్‌బోర్న్ కు వెళ్లే అవకాశాలున్నాయి. అక్కడ కూడా చిరుజల్లులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆదివారం నాడు ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా..? లేదా..? అనేది  అనుమానంగానే ఉంది. 

 

పాక్-అఫ్గాన్ మ్యాచ్ రద్దు : 

భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ తో పాటు  ఇదే వేదికమీద ఉదయం జరిగిన పాకిస్తాన్-అఫ్గానిస్తాన్ మ్యాచ్ కూడా అర్థాంతరంగా రద్దైంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన అఫ్గాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. కెప్టెన్ మహ్మద్ నబీ (37 బంతుల్లో 51 నాటౌట్, 5 ఫోర్లు, 1 సిక్సర్)  తో పాటు ఇబ్రహీం జద్రాన్ (34 బంతుల్లో 35, 4 ఫోర్లు) రాణించారు. చివర్లో ఉస్మాన్ ఘనీ (20 బంతుల్లో 32, 5 ఫోర్లు) మెరుపులతో అఫ్గాన్ జట్టు 150 మార్కు  దాటింది.  

అనంతరం పాకిస్తాన్ బ్యాటింగ్ కు వచ్చి రెండు ఓవర్లు పడ్డాక  వర్షం ప్రారంభమైంది.  బాబర్ ఆజమ్ (6 నాటౌట్), రిజ్వాన్ (0 నాటౌట్) లు క్రీజులో ఉండగా మొదలైన వర్షం ఎంతకూ వదలకపోవడంతో ఈ మ్యాచ్ ను  రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఫలితం తేలకుండానే ఈ మ్యాచ్ ముగిసింది. 

 

- ప్రాక్టీస్ మ్యాచ్ లు ముగియడంతో భారత్-పాకిస్తాన్ జట్లు ఈనెల 23న మెల్‌బోర్న్‌ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం  క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios