టీ20 వరల్డ్ కప్ 2022: గ్లెన్ ఫిలిప్స్ సెంచరీ... శ్రీలంకపై న్యూజిలాండ్ భారీ విజయం...
శ్రీలంకపై 65 పరుగుల తేడాతో భారీ విజయం అందుకున్న న్యూజిలాండ్... సెంచరీతో ఒంటరి పోరాటం చేసిన కివీస్‌కి భారీ స్కోరు అందించిన గ్లెన్ ఫిలిప్స్...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో న్యూజిలాండ్ జట్టు మరో భారీ విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాని చిత్తు చేసిన కివీస్, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 65 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుని, సెమీస్ రేసుకి చేరువైంది... 15 పరుగులకే 3 వికెట్లు తీసి క్యాచులు అందుకోవడంలో విఫలమై, ప్రత్యర్థికి 167 పరుగుల భారీ స్కోరు అందించిన శ్రీలంక జట్టు, ఆ లక్ష్యఛేదనలో 19.2 ఓవర్లలో 102 పరుగులకి ఆలౌట్ అయ్యింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఫిన్ ఆలెన్ 1, డివాన్ కాన్వే 1, కేన్ విలియంసన్ 8 పరుగులు చేసి అవుట్ కావడంతో 15 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్. అయితే గ్లెన్ ఫిలిప్స్ అద్భుతంగా పోరాడాడు....
24 బంతుల్లో 22 పరుగులు చేసిన డార్ల్ మిచెల్‌తో కలిసి నాలుగో వికెట్‌కి 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన గ్లెన్ ఫిలిప్స్ ఇచ్చిన క్యాచ్‌ని పథుమ్ నిశ్శంక జారవిడిచాడు. సింగిల్ డిజిట్ దగ్గర అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న గ్లెన్ ఫిలిప్స్, ఆ తర్వాత ఎక్కడా లంక బౌలర్లకు ఛాన్స్ ఇవ్వకుండా చెలరేగిపోయాడు...
జేమ్స్ నీశమ్ 8 బంతుల్లో 5 పరుగులు, ఇష్ సోదీ 1 పరుగులు చేసి అవుట్ కాగా గ్లెన్ ఫిలిప్స్ 64 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 104 పరుగులు చేసి ఆఖరి ఓవర్‌లో అవుట్ అయ్యాడు. మిచెల్ సాంట్నర్ 11 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. లంక బౌలర్లలో కసున్ రజిత్ 2 వికెట్లు తీయగా మహీశ్ తీక్షణ, ధనంజయ డి సిల్వ, వానిందు హసరంగ, లహీరు కుమారలకు ఒక్కో వికెట్ దక్కింది...
168 పరుగుల లక్ష్యఛేదనలో 5 బంతులాడిన పథుమ్ నిశ్శంక డకౌట్ కావడంతో సున్నా దగ్గరే తొలి వికెట్ కోల్పోయింది శ్రీలంక జట్టు. ఓ ఫోర్ బాదిన కుశాల్ మెండిస్‌ని అవుట్ చేసిన ట్రెంట్ బౌల్ట్, అదే ఓవర్‌లో ధనంజయ డి సిల్వని డకౌట్ చేశాడు. చరిత అసలంక 4 పరుగులు చేసి ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 8 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది శ్రీలంక...
3 పరుగులు చేసిన కరుణ రత్నేని మించెల్ సాంట్నర్ అవుట్ చేయగా 22 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 పరుగులు చేసి లంక స్కోరు బోర్డులో కదలిక తీసుకొచ్చిన భనుక రాజపక్ష, లూకీ ఫర్గూసన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 4 పరుగులు చేసిన వానిందు హసరంగ, ఇష్ సోదీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు...
మహీశ్ తీక్షణని మిచెల్ సాంట్నర్ డకౌట్ చేయగా 65 పరుగులకి 8 వికెట్లు కోల్పోయింది శ్రీలంక. 9వ వికెట్‌కి 28 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కెప్టెన్ ధస్సున్ శనక 32 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 35 పరుగులు చేసి ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు... 4 పరుగులు చేసిన లహిరు కుమారను ఇష్ సోధీ స్టంపౌట్ చేయడంతో లంక ఇన్నింగ్స్ 102 పరుగుల వద్ద తెరపడింది.
ట్రెంట్ బౌల్ట్ 4 ఓవర్లలో 13 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీ రెండేసి వికెట్లు తీయగా, లూకీ ఫర్గూసన్, టిమ్ సౌథీ తలా ఓ వికెట్ తీశారు.