పాక్‌కు తొలి షాక్.. ఇంగ్లాండ్ ఘన విజయం.. ఐర్లాండ్ ను ఓడించిన జింబాబ్వే

T20 World Cup 2022: పొట్టి ప్రపంచకప్ ను విజయంతో ప్రారంభించాలని చూసిన పాక్ కు భారీ షాక్ తాకింది. వార్మప్ మ్యాచ్ లో ఆ జట్టు ఇంగ్లాండ్ చేతిలో చిత్తయ్యింది.  ఇక జింబాబ్వే-ఐర్లాండ్ మధ్య  జరిగిన మ్యాచ్ లో జింబాబ్వే విజయం సాధించింది. 

T20 World Cup 2022: England Beat Pakistan in Warm up Match, Zimbabwe Thrashes Ireland in Their First qualifying Game

ఈనెల 23న  టీమిండియాతో మ్యాచ్  కు ముందు  టీ20 ప్రపంచకప్ లో రెండు వార్మప్ మ్యాచ్ లు ఆడనున్న పాకిస్తాన్ కు ఇంగ్లాండ్ షాకిచ్చింది.  గబ్బా  (బ్రిస్బేన్) వేదికగా ఇంగ్లాండ్-పాకిస్తాన్ మధ్య జరిగిన  మొదటి వార్మప్ మ్యాచ్ లో  ఇంగ్లీష్ జట్టునే విజయం వరించింది.  వర్షం వల్ల 19 ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన  పాకిస్తాన్.. 19 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఇంగ్లాండ్.. 14.4 ఓవర్లలోనే ఊదిపారేసింది. ఈ మ్యాచ్ లో పాక్ స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది ఆడటమే గాక రెండు ఓవర్లు కూడా బౌలింగ్ చేయడం గమనార్హం. 

వార్మప్ మ్యాచ్ కావడంతో పాక్ సారథి బాబర్ ఆజమ్, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ లు  ఈ మ్యాచ్ ఆడలేదు. దీంతో షాదాబ్ ఖాన్  ఈ మ్యాచ్  లో పాక్ సారథిగా వ్యవహరించాడు.  టాస్ ఓడిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ కు వచ్చింది. షాన్ మసూద్ (22 బంతుల్లో 39, 7 ఫోర్లు), హైదర్ అలీ (18, 3 ఫోర్లు) పాక్ కు మెరుపు ఆరంభాన్నిచ్చారు. 4.5 ఓవర్లలో 49 పరుగులు జోడించారు.  

అలీని  స్టోక్స్ ఔట్ చేశాడు.  కెప్టెన్ షాదాబ్ ఖాన్ (14) విఫలమవగా  ఇఫ్తికార్ అహ్మద్ (22, 3 ఫోర్లు) రాణించాడు.  ఆ తర్వాత పాకిస్తాన్ వరుసగా వికెట్లను కోల్పోయింది. ఖుష్దిల్ (0), అసిఫ్ అలీ (14), నవాజ్ (10) విఫలమయ్యారు.  కానీ చివర్లో మహ్మద్ వసీం (జూనియర్) (16 బంతుల్లో 26, 3 ఫోర్లు, 1 సిక్సర్) మెరుపులతో పాక్ స్కోరు 160  చేరింది. 

 

లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ కు రెండో ఓవర్లోనే షాక్ తాకింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (1) , అలెక్స్ హేల్స్ (9) విఫలమయ్యారు. కానీ బెన్ స్టోక్స్ (18 బంతుల్లో 36, 2 ఫోర్లు, 3 సిక్సర్లు), లియామ్ లివింగ్‌స్టోన్ (16 బంతుల్లో 28, 1 ఫోర్, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడారు.  ఇక హ్యారీ బ్రూక్ (24 బంతుల్లో 45 నాటైట్, 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సామ్ కరన్ (14 బంతుల్లో 33 నాటౌట్, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) పాక్ బౌలర్లపై వీరవిహారం చేశారు. ఫలితంగా 14.4 ఓవర్లలోనే  ఇంగ్లాండ్ 160 పరుగులను ఛేదించింది. 

జింబాబ్వే సూపర్ విక్టరీ.. 

ఇక  క్వాలిఫికేషన్ రౌండ్ ఆడుతున్న జింబాబ్వే - ఐర్లాండ్ మధ్య హోబర్ట్ వేదికగా ముగిసిన మ్యాచ్ లో జింబాబ్వే ఘన విజయం అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఆ జట్టులో సికిందర్ రాజా (48 బంతుల్లో 82, 5 ఫోర్లు, 5 సిక్సర్లు) వీరవిహారం చేశాడు.  అనంతరం లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఐర్లాండ్.. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులకే పరిమితమైంది.  ఆ జట్టులో కర్టిస్ కంఫర్ (27) టాప్ స్కోరర్ కాగా జార్జ్ డాక్రెల్ (24), గారెత్ డెలాని (24) ఫర్వాలేదనిపించారు.  మిగిలిన బ్యాటర్లంతా విఫలమవ్వడంతో ఐర్లాండ్.. 31 పరుగుల తేడాతో ఓడింది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios