Asianet News TeluguAsianet News Telugu

టీ20 వరల్డ్ కప్ 2022: పోరాడి ఓడిన ఐర్లాండ్... ఆస్ట్రేలియాకి రెండో విజయం...

180 పరుగుల లక్ష్యఛేదనలో 137 పరుగులకి ఆలౌట్ అయిన ఐర్లాండ్... 42 పరుగుల తేడాతో ఘన విజయం అందుకున్న ఆస్ట్రేలియా... 

T20 World cup 2022: Australia beats Ireland, Lorcan Tucker impressive innings
Author
First Published Oct 31, 2022, 4:57 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో తొలి మ్యాచ్ షాక్ నుంచి త్వరగానే కోలుకుంది ఆస్ట్రేలియా. లంకపై ఘన విజయం అందుకున్న ఆసీస్, ఐర్లాండ్‌పైనా అదే జోరు కొనసాగించింది. 180 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఐర్లాండ్ 18.1 ఓవర్లలో 137 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఒకనొక దశలో 25 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్, లోర్కన్ టక్కర్ వీరోచిత పోరాటం కారణంగా 19వ ఓవర్ వరకూ పోరాడి ఓడింది. 


టాస్ గెలిచి ఆస్ట్రేలియాకి బ్యాటింగ్ అప్పగించింది ఐర్లాండ్. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 7 బంతుల్లో 3 పరుగులు చేసి మరోసారి నిరాశపరిచాడు. ఆరోన్ ఫించ్, మిచెల్ మార్ష్ కలిసి రెండో వికెట్‌కి 52 పరుగుల భాగస్వామ్యం జోడించారు...

22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 పరుగులు చేసిన మిచెల్ మార్ష్, బారీ మెక్‌కార్తీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. మ్యాక్స్‌వెల్ 9 బంతుల్లో ఓ సిక్సర్‌తో 13 పరుగులు చేసి అవుట్ కాగా మార్కస్ స్టోయినిస్ 25 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 35 పరుగులు చేశాడు...

44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 63 పరుగులు చేసిన ఆరోన్ ఫించ్, బారీ మెక్‌కార్తీ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. టిమ్ డేవిడ్ 10 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు, మాథ్యూ వేడ్ 3 బంతుల్లో 7 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఐర్లాండ్ బౌలర్ బారీ మెక్‌కార్తీ 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా జోషువా లిటిల్‌కి రెండు వికెట్లు దక్కాయి..

13 ఓవర్లు ముగిసే సమయానికి 92 పరుగులు మాత్రమే చేసిన ఆస్ట్రేలియా, ఆఖరి 7 ఓవర్లలో 88 పరుగులు రాబట్టింది. 180 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఐర్లాండ్ వరుస వికెట్లు కోల్పోయింది...

6 పరుగులు చేసిన ఐర్లాండ్ కెప్టెన్ ఆండ్రూ బాల్బరీన్‌ని ప్యాట్ కమ్మిన్స్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్‌లో 11 పరుగులు చేసి పాల్ స్టిర్లింగ్ కూడా మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అదే ఓవర్ ఆఖరి బంతికి హ్యారీ టెక్టర్ కూడా అవుట్ అయ్యాడు. 

మిచెల్ స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో కూపర్, డాక్‌రెల్ డకౌట్ అయ్యారు. డబుల్ వికెట్ మెయిడిన్ వేసిన మిచెల్ స్టార్ తొలి ఓవర్ కారణంగా 25 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఐర్లాండ్...

ఈ దశలో డెలనీ, టక్కర్ కలిసి ఆరో వికెట్‌కి 43 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 10 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసిన డెలనీ, స్టోయినిస్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 11 పరుగులు చేసిన మార్క్ అదైర్‌ని అవుట్ చేసిన ఆడమ్ జంపా, ఆ తర్వాతి ఓవర్‌లో ఫియోన్ హ్యాండ్‌ని బౌల్డ్ చేశాడు.

50 పరుగుల లోపే ఆలౌట్ అవుతుందని అనుకున్న ఐర్లాండ్ జట్టు... లోర్కన్ టక్కర్ ఇన్నింగ్స్ కారణంగా ఆఖరి వరకూ పోరాడింది. జోష్ హజల్‌వుడ్ బౌలింగ్‌లో ఓ ఫోర్, సిక్సర్ బాదిన లోర్కన్ టక్కర్, మిచెల్ స్టార్క్ వేసిన 17వ ఓవర్‌లో 3 ఫోర్లతో 18 పరుగులు రాబట్టాడు. 

ఐర్లాండ్ విజయానికి 18 బంతుల్లో 44 పరుగులు కావా్లసి రావడంతో ఉత్కంఠ రేగింది. అయితే ప్యాట్ కమ్మిన్స్ ఓవర్‌లో మెక్‌క్యాతీ అవుట్ అయ్యాడు. ఆ ఓవర్‌లో 1 పరుగు మాత్రమే వచ్చింది. ఆఖరి బంతికి సింగిల్ తీసిన జోషువా లిటిల్, 19వ ఓవర్ మొదటి బంతికి సింగిల్ తీయబోయి రనౌట్ అయ్యాడు. దీంతో ఐర్లాండ్ ఇన్నింగ్స్‌ 137 పరుగుల వద్ద తెరపడింది...

లోర్కన్ టక్కర్ 48 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 71 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios