కీలక పోరుకు ముందు ఆసీస్‌కు భారీ షాక్.. వికెట్ కీపర్‌కు కరోనా.. బ్యాకప్ కూడా లేకపాయే..!
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు భారీ షాక్ తాకింది. ఆ జట్టు వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో ఆతిథ్య దేశానికి భారీ షాక్ తగిలింది. ఇప్పటివరకు ఈ టోర్నీలో రెండు మ్యాచ్ లు ఆడి న్యూజిలాండ్ తో ఓడి శ్రీలంకతో గెలిచిన ఆస్ట్రేలియా.. తమ మూడో మ్యాచ్ ను ఇంగ్లాండ్ తో ఆడనుంది. శుక్రవారం ఇరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కు ముందు ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ కరోనా బారిన పడ్డాడు. గురువారం వేడ్ కు కొవిడ్-19గా నిర్ధారణ అయింది.
ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టులో స్పిన్నర్ ఆడమ్ జంపాకు కరోనా సోకింది. శ్రీలంకతో మ్యాచ్ కు ముందు అతడికి కరోనా నిర్ధారణ కావడంతో ఆ మ్యాచ్ లో అతడు ఆడలేదు. తాజాగా వేడ్ కు కూడా కొవిడ్ సోకింది.
అయితే ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో వేడ్ కు విశ్రాంతినిస్తారా..? లేక ఆడిస్తారా..? అనేదానిపై టీమ్ మేనేజ్మెంట్ మల్లగుల్లాలు పడుతున్నది. ఆస్ట్రేలియాకు బ్యాకప్ వికెట్ కీపర్ లేడు. టీ20 ప్రపంచకప్ కు ఎంపిక చేసిన జట్టులో వేడ్ తో పాటు జోష్ ఇంగ్లిస్ కూడా ఉన్నాడు. కానీ ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందు ఇంగ్లిస్.. గోల్ఫ్ ఆడుతూ గాయపడ్డాడు. దీంతో అతడు టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకున్నాడు.
తాజాగా వేడ్ కు కరోనా సోకిన నేపథ్యంలో అతడు ఆడకుంటే గ్లెన్ మ్యాక్స్వెల్ లేదా డేవిడ్ వార్నర్ లలో ఎవరో ఒకరిని వికెట్ కీపర్ గా దించే అవకాశాలున్నాయి. ఈ మేరకు గురువారం ప్రాక్టీస్ సెషన్ లో ఈ ఇద్దరూ గ్లవ్స్ పెట్టుకుని ప్రాక్టీస్ చేశారు.
ఈ ప్రపంచకప్ లో ఐసీసీ కరోనా సోకినా ఆటగాళ్లు ఆడే అవకాశమిస్తున్నది. విశ్రాంతినివ్వడం జట్టుకు సంబంధించిన విషయమని.. కానీ సదరు ఆటగాడిని మ్యాచ్ ఆడించేందుకు కూడా ఐసీసీ అనుమతినిచ్చింది. దీంతో ఐర్లాండ్ - శ్రీలంక మధ్య ముగిసిన సూపర్-12 మ్యాచ్ లో ఐర్లాండ్ ఆటగాడు జార్జ్ డాక్రెల్ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినా బరిలోకి దిగాడు. జార్జ్ డాక్రెల్‌లో కరోనా లక్షణాలు స్వల్పంగా ఉండడంతో మిగిలిన ప్లేయర్లకు ఈ వైరస్ సోకకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది ఐర్లాండ్ క్రికెట్ బోర్డు.
ఐసీసీ సవరించిన రూల్స్ తో వేడ్ ఈ మ్యాచ్ ఆడటానికి అర్హుడే. ఇంగ్లాండ్-ఆస్ట్రేలియాకు సూపర్-12లో ఈ మ్యాచ్ కీలకం కానున్న నేపథ్యంలో వేడ్ ను ఆస్ట్రేలియా ఆడిస్తుందా..? లేదా..? అనేది శుక్రవారం తేలనుంది. సూపర్-12లో భాగంగా గ్రూప్-1లో ఉన్న ఈ రెండు జట్లు.. అక్టోబర్ 28న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో తలపడనున్నాయి.