తీరుమారని బంగ్లాదేశ్.. వార్మప్ మ్యాచ్‌లో ఓటమి.. ఆసియా కప్ జోరు కొనసాగించిన అఫ్గాన్..
T20 World Cup 2022: వరుస పరాజయాలు వెంటాడుతున్నా బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మారడం లేదు. సాధారణ ద్వైపాక్షిక సిరీస్ ల సంగతి పక్కనబెడిడితే టీ20 ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలో కూడా అదే రకమైన ఆటతో విసుగు తెప్పిస్తున్నది.
గత కొంతకాలంగా సీనియర్ల రిటైర్మెంట్, ఆటగాళ్ల పేలవ ఫామ్ తో ప్రభ కోల్పోతున్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు.. అదే ఆటతీరును కొనసాగిస్తూ విమర్శల పాలవుతున్నది. ఈ ఏడాది జింబాబ్వే మీద కూడా ఓడిన ఆ జట్టు.. ఇటీవల ఆసియా కప్ లో గ్రూప్ స్టేజ్ లోనే నిష్క్రమించింది. వారం రోజుల క్రితం పాకిస్తాన్, న్యూజిలాండ్ తో కలిసి ఆడిన ముక్కోణపు సిరీస్ లో కూడా ఒక్క విజయం సాధించలేదు. తాజాగా టీ20 ప్రపంచకప్ లో అయినా మెరుగుపడతారనుకుంటే ఇక్కడా అదే ఆటతో బోల్తా కొట్టింది. అఫ్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో 62 పరుగుల తేడాతో ఓడింది.
బ్రిస్బేన్ లోని అలెన్ బోర్డర్ వేదికగా ముగిసిన తొలి వార్మప్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తొలుత టాస్ ఓడి బౌలింగ్ కు దిగింది. ఆసియా కప్ లో అనూహ్య విజయాలతో ప్రశంసలు అందుకున్న అఫ్గాన్.. ఈ మ్యాచ్ లో కూడా అదే జోరు చూపించింది. ఓపెనర్ రహనుల్లా గుర్బాజ్ (27) కు తోడు ఇబ్రహీం జద్రాన్ (46) రాణించారు.
ఈ ఇద్దరికీ తోడు కెప్టెన్ మహ్మద్ నబీ.. 17 బంతుల్లో ఓ బౌండరీ ఐదు సిక్సర్ల సాయంతో 41 పరుగులు చేశాడు. బంగ్లా బౌలర్లలో హసన్ మహ్ముద్, షకిబ్ అల్ హసన్ లు తలా రెండు వికెట్లు తీశారు.
ఛేదనలో బంగ్లాదేశ్ అట్టర్ ఫ్లాఫ్ అయింది. ఓపెనర్లు నజ్ముల్ హోసేన్ షాంతో (12), మెహది హాసన్ మిరాజ్ (16) విఫలమయ్యారు. వీరికి తోడు సౌమ్యా సర్కార్ (1), షకిబ్ అల్ హసన్ (1), అఫిఫ్ హోసేన్ (0), నురుల్ హసన్ (13) కూడా విఫలమయ్యారు. అఫ్గాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసిరి బంగ్లా బ్యాటర్లు పరుగులు తీయకుండా కట్టడి చేశారు. అఫ్గాన్ బౌలర్లలో ఫరూఖీ మూడు వికెట్లు తీయగా.. ముజీబ్ ఉర్ రెహ్మన్, నబీ తలా వికెట్ తీశారు.