Asianet News TeluguAsianet News Telugu

సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 విజేతగా తమిళనాడు... షారుక్ ఖాన్ ఫినిషింగ్ టచ్, వరుసగా రెండో ఏడాది...

ఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటను నాలుగు వికెట్ల తేడాతో ఓడించిన తమిళనాడు... వరుసగా రెండో టైటిల్ కైవసం... ఆఖరి బంతికి సిక్సర్‌ బాది మ్యాచ్‌ను ముగించిన షారుక్ ఖాన్...

Syed Mushtaq ali T20 Tourney Winner TamilNadu beats Karnataka In Final match, Shahrukh Khan finishes
Author
India, First Published Nov 22, 2021, 3:53 PM IST

దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ ఆలీ 2021 సీజన్‌ను తమిళనాడు సొంతం చేసుకుంది. ఆఖరి ఓవర్‌, ఆఖరి బంతి వరకూ సాగిన ఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటకపై నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది తమిళనాడు. మనీశ్ పాండే వర్సెస్ విజయ్ శంకర్ మధ్య పోటీగా చెప్పుకొన్న సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో లక్కీ ‘త్రీడీ ప్లేయర్’కే విజయం దక్కింది...

ఇదీ చదవండి: వాళ్లు ఫైనల్ ఆడి ఇక్కడికి వచ్చారు, సిరీస్ క్లీన్ స్వీప్ చేసినా... టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్...

టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. ఓపెనర్ రోహన్ కదమ్ డకౌట్ కాగా, కెప్టెన్ మనీవ్ పాండే 15 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఓపెనర్లు ఇద్దరినీ బౌల్డ్ చేసిన సాయి కిషోర్, కర్ణాటకకు ఊహించని షాక్ ఇచ్చాడు. కరణ్ నాయర్ 14 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేయగా, వికెట్ కీపర్ శరత్ 16 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

108 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది కర్ణాటక. ఈ దశలో అభినవ్ మనోహర్ 37 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు, ప్రవీణ్ దూబే 25 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేశాడు. ఆఖర్లో జగదీశ్ సుచిత్ 7 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌‌తో 18 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు..

గాయం నుంచి కోలుకుని, రీఎంట్రీ ఇచ్చిన భారత బౌలర్ టి నటరాజన్, 4 ఓవర్లలో 44 పరుగులు చేసి ఓ వికెట్ తీశాడు. సాయి కిషోర్ 4 ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు...

152 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన తమిళనాడుకి శుభారంభం దక్కలేదు. 12 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 23 పరుగులు చేసిన హరి నిశాంత్ రనౌట్ అయ్యాడు.  వికెట్ కీపర్ ఎన్ జగదీశన్ 46 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 41 పరుగులు చేయగా, సాయి సుదర్శన్ 9 పరుగులు చేశాడు...

Read: అతని బ్యాటింగ్ డిస్సపాయింట్ చేసింది, తన రేంజ్‌కి తగ్గట్టుగా ఆడలేదు... రిషబ్ పంత్‌పై ఆకాశ్ చోప్రా కామెంట్స్...

కెప్టెన్ విజయ్ శంకర్ 22 బంతుల్లో 18 పరుగులు చేసి అవుట్ కాగా సంజయ్ యాదవ్ 5, ఎం మహ్మద్ 5 పరుగులు చేశారు. విజయానికి 2 ఓవర్లలో 30 పరుగులు కావాల్సిన దశలో విద్యధర్ పాటిల్ వేసిన 19వ ఓవర్‌లో 14 పరుగులు వచ్చాయి. 

ఆఖరి ఓవర్‌లో విజయానికి 16 పరుగులు కావాల్సి ఉండగా సాయి కిషోర్ మొదటి బంతికి బౌండరీ బాదాడు. ఆ తర్వాత నాలుగు బంతుల్లో రెండు వైడ్లతో 7 పరుగులు వచ్చాయి. ఆఖరి బంతికి ఐదు పరుగులు కావాల్సిన దశలో సిక్సర్ బాదిన షారుక్ ఖాన్, మ్యాచ్‌ని ముగించాడు. 

15 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 33 పరుగులు చేసిన షారుక్ ఖాన్, ఫైనల్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు. కరోనా కారణంగా గత ఏడాది జరగాల్సిన సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీని జనవరిలో నిర్వహించింది బీసీసీఐ. ఆ టోర్నీని దినేశ్ కార్తీక్ కెప్టెన్సీలో సొంతం చేసుకున్న తమిళనాడు, 10 నెలల తర్వాత విజయ్ శంకర్ కెప్టెన్సీలో మరో టైటిల్ గెలిచింది. అంతకుముందు కర్ణాటక వరుసగా రెండు సీజన్లలో సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీ టైటిల్ గెలవగా, ఇప్పుడు కర్ణాటకను ఫైనల్ ఓడించి ఆ ఫీట్‌ను రిపీట్ చేసింది తమిళనాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios