తిలక్ వర్మ సూపర్ సెంచరీ... అయినా హైదరాబాద్‌కి తప్పని పరాజయం!
బరోడాతో మ్యాచ్‌లో అజేయ సెంచరీతో అదరగొట్టిన హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ... హాఫ్ సెంచరీలతో బరోడాకి విజయం అందించిన కృనాల్ పాండ్యా, విష్ణు సోలంకి..
టీమిండియా యంగ్ సెన్సేషన్ తిలక్ వర్మ, సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలోనూ అదరగొడుతున్నాడు. హైదరాబాద్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న తిలక్ వర్మ, మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో 31 బంతుల్లో 41 పరుగులు చేసి మెప్పించగా జమ్మూ కశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో 43 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 58 పరుగులు చేశాడు..
తాజాగా బరోడాతో జరిగిన మ్యాచ్‌లో అజేయ సెంచరీతో అదరగొట్టాడు తిలక్ వర్మ. జైపూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగుల భారీ స్కోరు చేసింది.
తన్మయ్ అగర్వాల్ 15, రోహిత్ రాయుడు 1, రాహుల్ సింగ్ 1, చందన్ సహనీ 2 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచారు. రవితేజ 20 బంతుల్లో 23 పరుగులు చేయగా భవేశ్ సేత్ 6 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 17 పరుగులు చేశాడు. ఓ ఎండ్‌లో వచ్చిన బ్యాటర్ వచ్చినట్టు అవుట్ అవుతున్నా క్రీజులో పాతుకుపోయిన కెప్టెన్ తిలక్ వర్మ.. 69 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్సర్లతో 121 పరుగులు చేశాడు..
ఈ లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది బరోడా జట్టు. జ్యోస్నిల్ సింగ్ 23 పరుగులు చేయగా అనంత్ భర్వాడ్ 7, అభిమన్యు సింగ్ 1, నినద్ రథ్వా 11 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 49 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది బరోడా జట్టు..
ఈ దశలో బరోడా కెప్టెన్ కృనాల్ పాండ్యా 36 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 64 పరుగులు చేయగా విష్ణు సోలంకి 37 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 71 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కి 138 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పడంతో బరోడా ఈజీ విక్టరీ అందుకుంది..