నెట్‌బౌలర్ మారిన స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్.. కష్టం తెచ్చిన ఫలం , ఎవరీ లోకేష్ కుమార్ .?
భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్ జట్టుకు ఓ స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్ నెట్ బౌలర్‌గా ఎంపికయ్యాడు . నెట్ బౌలర్లుగా ఎంపికైన వారిని పరిచయం చేస్తూ నెదర్లాండ్స్ జట్టు ఓ వీడియోను షేర్ చేసింది.
భారతదేశంలో క్రికెట్ ఓ మతమైతే క్రికెటర్లు దేవుళ్లు. వీరిని చూసి తాము కూడా క్రికెటర్లుగా మారాలని కోట్లాది మంది కలలు కంటూ వుంటారు. కానీ కొందరు మాత్రం దీనిని నిజం చేసుకోగలుగుతారు. వేరే రంగంలో వుంటూనే క్రికెట్ మీద పిచ్చితో శ్రమించేవారు కొందరుంటారు. ఈ కోవలోకే వస్తాడు చెన్నైకి చెందిన లోకేష్ కుమార్. కొద్దిరోజుల్లో భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్ జట్టుకు ఇతను నెట్ బౌలర్‌గా ఎంపికయ్యాడు. ఇందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా.. లోకేష్ స్విగ్గీ డెలవరీ ఎగ్జిక్యూటివ్ కావడమే.
ప్రపంచకప్ టోర్నమెంట్ కోసం తమకు కావాల్సిన నెట్ బౌలర్ కోసం నెదర్లాండ్స్ జట్టు భారత్ మొత్తం గాలించింది. ఇందుకోసం భారీగా ప్రకటనలు సైతం ఇచ్చింది. దీనికి అనూహ్య స్పందన రాగా.. దాదాపు 10 వేల మంది తమ బౌలింగ్ వీడియోను పంపించారు. వీటిని పరిశీలించిన నెదర్లాండ్స్ జట్టు మేనేజ్‌మెంట్ నలుగురిని ఎంపిక చేసుకుంది. వీరిలో లోకేష్ కుమార్ ఒకడు. నెట్ బౌలర్లుగా ఎంపికైన వారిని పరిచయం చేస్తూ నెదర్లాండ్స్ జట్టు ఓ వీడియోను షేర్ చేసింది.
ఈ సందర్భంగా లోకేష్ కుమార్ స్పందిస్తూ.. నెదర్లాండ్స్ జట్టుకు నెట్ బౌలర్‌గా ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. తనకు చిన్నతనం నుంచే క్రికెట్ అంటే ఎంతో ఇష్టమని నాలుగేళ్ల పాటు డివిజన్ 5లో ఆడానని చెప్పాడు. అనంతరం ఇండియన్ ఆయిల్ జట్టుకు డివిజన్ 4 క్రికెట్‌లోకి రిజిస్టర్ చేసుకున్నానని, తాజాగా నెదర్లాండ్స్ జట్టుకు నెట్ బౌలర్‌గా ఎంపిక కావడం సంతోషంగా వుందన్నారు. ఇక వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో భాగంగా నెదర్లాండ్స్ జట్టు అక్టోబర్ 6న పాక్‌తో తన తొలి మ్యాచ్ ఆడనుంది. దీనికంటే ముందు టీమిండియాతో అక్టోబర్ 3న వార్మప్ మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది .