మహేంద్ర సింగ్ ధోనీ సహచరుడు సురేశ్ రైనా ఐపీఎల్‌లో తన అద్భుతమైన ప్రదర్శన వెనుక వున్న రహస్యాన్ని బయటపెట్టాడు. క్రిక్ బజ్ ఇంటర్వ్యూలో భాగంగా హర్షభోగ్లేతో ఇంటర్వ్యూ సందర్భంగా రైనా పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు.

చెన్నై వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా ఆహారపు అలవాట్లను, డైట్‌ను ఫాలో అవ్వడం వల్లే టోర్నీలో తాను మంచి ఫిట్‌నెస్‌గా ఉండగలుగుతున్నానని తెలిపాడు. తాను చారు, పెరుగు, అన్నం తినడం వల్లనే ఫిట్‌గా ఉండగలుగుతున్నానని వివరించాడు.

Also Read:ధోనీతో కలిసి రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణం చెప్పిన రైనా

దీని కారణంగానే చిదంబరం స్టేడియంలో కఠినమైన సాధనలు చేయగలుగుతున్నానని రైనా చెప్పాడు. ముఖ్యంగా వేసవి కాలంలో చెన్నైలో ఉండే వేడిని తట్టుకోవాలంటే ఆహారం పక్కాగా ఉండాలని సురేశ్ రైనా సూచించాడు.

ఇందుకు సంబంధించి ఓ ఉదాహరణ కూడా చెప్పాడు. 2013 ఐపీఎల్ సందర్భంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో 53 బంతుల్లో 100 పరుగులు చేయడంలో తన డైట్ ఎలా సహకరించిందో వివరించాడు.

కొద్దిరోజుల క్రితం ఆ మ్యాచ్‌ను చూశానని.. ఆ రోజును సాయంత్రం 4 గంటలకు మ్యాచ్ మొదలైందని రైనా చెప్పాడు. అంతకు కొద్దిగంటల ముందే ఎండ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టిందని.. ఇలాంటి పరిస్దితుల్లో రాణించడం కష్టం అనుకున్నారు.

కానీ ధోనీ మాత్రం ఇదేమీ లెక్క చేయలేదని... ఈ సమయంలో ఏదైనా కఠిన పరిస్ధితులు ఎదురైతే జట్టుకు అండగా ఉంటానని ధోనీకి హామీ ఇచ్చానని పేర్కొన్నాడు. ఆ ధైర్యం తనకు తీసుకునే ఆహారం ద్వారానే లభించిందని తెలిపాడు.

ఇంట్లో తీసుకునే డైట్ కాకుండా చెన్నై వాతావరణ పరిస్ధితికి తగ్గట్టుగా ఆహార నియమాలు పాటించానని రైనా గుర్తుచేసుకున్నాడు. ఎండ నేరుగా తలపై పడుతుందని.. అందువల్ల డిహైడ్రేట్ కాకుండా మ్యాచ్‌‌లో రాణించాలంటే ఆహారం పాత్ర కూడా ఉంటుందని చెప్పాడు.