నా తమ్ముడు రిషబ్ పంత్ త్వరగా మెరుగ్గా కోలుకోవాలని కోరుకుంటున్నా... సురేష్ రైనా ట్వీట్! ఐపీఎల్ 2023 సీజన్‌లో కామెంటేటర్లుగా శ్రీశాంత్, భజ్జీ, రైనా.. 

గత ఏడాది డిసెంబర్ 30న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు క్రికెటర్ రిషబ్ పంత్. న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఇంటికి వెళ్తున్న సమయంలో రిషబ్ పంత్ కారు డివైడర్‌ని ఢీకొట్టి, కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో రిషబ్ పంత్ మోకాలికి, వీపు భాగాలకు, మోచేతులకు తీవ్ర గాయాలయ్యాయి...

నెలన్నర రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న రిషబ్ పంత్ ఇప్పుడు ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. చల్లని గాలిని, సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నానని ట్వీట్లు చేస్తున్న రిషబ్ పంత్, త్వరలోనే క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వగలనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు..

తాజాగా భారత మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, సురేష్ రైనా, శ్రీశాంత్ కలిసి రిషబ్ పంత్ ఇంటికి వెళ్లి అతన్ని పరామర్శించారు. రిషబ్ పంత్‌తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు సురేష్ రైనా...

‘అన్నదమ్ముల అనుబంధమే జీవితం. మన మనసులో కుటుంబం చిరస్థాయిలో నిలిచిపోతుంది. నా తమ్ముడు రిషబ్ పంత్ త్వరగా మెరుగ్గా కోలుకోవాలని కోరుకుంటున్నా... నన్ను నమ్ము తమ్ముడు... నీకు ఏ సాయం కావాలన్నా మేం సిద్ధంగా ఉన్నాం.. నువ్వు ఓ ఫోనిక్స్ పక్షిలా ఎగురుతావ్... ’ అంటూ ట్వీట్ చేశాడు సురేష్ రైనా.. ఈ ట్వీట్‌కి ‘ఫ్యామిలీ’, ‘లైఫ్’, బ్రదర్‌హుడ్, టైమ్ అంటూ ట్యాగ్‌లను  జోడించాడు సురేష్ రైనా...

Scroll to load tweet…

ఐపీఎల్ 2022 మెగా వేలంలో అమ్ముడుపోని సురేష్ రైనా, అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు. 2023 సీజన్‌లో తొలిసారిగా సురేష్ రైనా లేకుండా చెన్నైలో మ్యాచులు ఆడబోతోంది చెన్నై సూపర్ కింగ్స్. కరోనా కారణంగా ఐపీఎల్ 2020 సీజన్ యూఏఈలో జరగగా 2021, 2022 సీజన్లలో కూడా చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచులు, చెన్నైలో జరగలేదు. దీంతో రైనా లేకుండా తొలిసారి చెన్నైలో మ్యాచ్ ఆడబోతోంది సీఎస్‌కే...

2021 ఐపీఎల్ తర్వాత టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించాడు... స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కుని ఏడేళ్లు బ్యాన్ అనుభవించిన శ్రీశాంత్, 2021 జనవరిలో ఆ నిషేధం నుంచి బయటపడి దేశవాళీ టోర్నీల్లో పాల్గొన్నాడు. ఐపీఎల్ 2021, 2022 సీజన్ వేలంలో పేరు రిజిస్టర్ చేయించుకున్నా, షార్ట్ లిస్టు జాబితాలో శ్రీశాంత్‌కి చోటు దక్కలేదు...

37 ఏళ్ల వయసులోనూ రీఎంట్రీ ఇస్తానని ధీమా వ్యక్తం చేసిన శ్రీశాంత్, గత ఏడాది మార్చిలో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఈ ముగ్గురూ ఐపీఎల్ 2023 సీజన్‌లో కామెంటేటర్లుగా వ్యవహరించబోతున్నారు..