ICC Cricket World Cup 2023 : 2019 వరల్డ్ కప్ లో ఐదు సెంచరీలు బాదిన రోహితేనా ఇతడు..!: సునీల్ గవాస్కర్
ఐసిసి వన్డే వరల్డ్ కప్ 2023 లో టీమిండియా ఆడిన మొదటి మ్యాచ్ లోనే కెప్టెన్ రోహిత్ డకౌట్ అవడంపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
హైదరాబాద్ : స్వదేశంలో జరుగుతున్న ఐసిసి వన్డే ప్రపంచ కప్ 2023 ని విజయంతో ప్రారంభించింది టీమిండియా. ఈ మెగా టోర్నీలో మొదటి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆడిన భారత జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. అయితే భారత జట్టు గెలిచినా కొందరు ఆటగాళ్ల ప్రదర్శన ఆందోళన కలిగించింది. పాకిస్థాన్ వంటి జట్టు 345 పరుగుల భారీ లక్ష్యాన్ని అవలీలగా చేధించగా టీమిండియా మాత్రం కేవలం 200 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి ఆపసోపాలు పడింది. ముఖ్యంగా
కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ టీమిండియా ఫ్యాన్స్ నే కాదు క్రికెట్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అయితే రోహిత్ ఆటచూసి ఇతడు 2019 వరల్డ్ కప్ ఐదు సెంచరీలతో అదరగొట్టిన ఆటగాడేనా అని ఆశ్చర్యపోయాట. ఈ విషయాన్ని స్వయంగా గవాస్కరే వెల్లడించారు.
2019 వన్డే ప్రపంచ కప్ లో వరుస సెంచరీలతో బెస్ట్ బ్యాటర్ గా రోహిత్ నిలిచిన విషయాన్ని గవాస్కర్ గుర్తుచేసారు. అయితే ఈసారి ఆ కసి రోహిత్ లో కనిపించడం లేదని... మొదటి మ్యాచ్ లోనే అతడి పేలవ ఆటతీరు బయటపడిందన్నారు. కెప్టెన్ గా తోటి బ్యాటర్లకు ఆదర్శంగా వుండాల్సినవాడే పరుగులేమీ సాధించకుండానే వెనుదిరగడంలో ఆ తర్వాత వచ్చిన యువ క్రికెటర్లపై ఒత్తిడి పెరిగిందన్నారు. దీంతో మరో ఓపెనర్ ఇషాన్ కిషన్, మిడిల్ ఆర్డర్ లో దిగిన శ్రేయాస్ అయ్యర్ లు కూడా డకౌట్ అయ్యారన్నారు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఆదుకోకుంటే ఘోర పరాజయాన్ని టీమిండియా చవిచూసేదని గవాస్కర్ పేర్కొన్నారు.
ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ విఫలమవడానికి అతడి ఫుట్ వర్క్ కారణమని గవాస్కర్ పేర్కొన్నారు. క్రీజులో రోహిత్ ఫుట్ వర్క్ చాలా నెమ్మదిగా వుంటుందని... అందువల్లే అతడు విఫలం అవుతున్నాడని పేర్కొన్నారు. ఇదే ఆటతీరు కొనసాగిస్తే రోహిత్ శర్మ పరుగులు సాధించడం కష్టమేనని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
''2019 వన్డే ప్రపంచకప్ లో రోహిత్ శర్మ ఐదు సెంచరీలు, మరికొన్ని హాఫ్ సెంచరీలు సాధించాడు. దీంతో స్వదేశంలో జరుగుతున్న 2023 వరల్డ్ కప్ లో అంతకంటే గొప్పగా ఆడతాడని ఆశించా. కానీ అతడు మొదటి మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. స్లో ఫుట్ వర్క్ కారణంగా అతడు విఫలమయ్యాడు. ఆ తప్పును సరిచేసుకుంటే రోహిత్ 2019 ఫామ్ ను అందిపుచ్చుకోగలడు... ఇది టీమిండియాకు ఎంతో మేలు చేయనుంది'' అని గవాస్కర్ పేర్కొన్నారు.