T20 World Cup: వచ్చే నెలలో మొదలుకానున్న టీ 20 వరల్డ్ కప్ తర్వాత భారత టీ20 కెప్టెన్ గా విరాట్ కోహ్లి (virat kohli) దిగిపోనున్న విషయం తెలిసిందే. అయితే కోహ్లి వారసుడెవరనేదానిమీద ఇప్పటికి బీసీసీఐ (bcci) గానీ, జట్టు గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఐపీఎల్ (ipl 2021) ముగిసిన తర్వాత యూఏఈ వేదికగా జరుగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం భారత్ జట్టును ఇప్పటికే ప్రకటించారు. ఈ టోర్నీ తర్వాత టీ20 ఫార్మాట్ నుంచి కెప్టెన్ గా దిగిపోతానని విరాట్ కోహ్లి ఇప్పటికే ప్రకటించాడు. అయితే విరాట్ తర్వాత అతడి వారసుడెవరనేదానిపై ఇప్పటికీ ఊహాగానాలే తప్ప అటు బీసీసీఐ గానీ ఇటు విరాట్ గానీ ఎవరి పేరునూ అధికారికంగా ప్రకటించలేదు.
ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్, లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ తర్వాత వచ్చే రెండు టీ20 ప్రపంచకప్ ల దాకా ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (rohit sharma) ను టీమ్ ఇండియా సారథిగా నియమిస్తే మేలని అభిప్రాయపడ్డాడు.
ఓ టీవీ కార్యక్రమంలో చర్చ సందర్భంగా సన్నీ మాట్లాడుతూ.. ‘తదుపరి రెండు ప్రపంచకప్ లకు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉండాలని నేను అభిప్రాయపడుతున్నాను. ప్రస్తుత ప్రపంచకప్ ముగియగానే వచ్చే ఏడాది అక్టోబర్ లోనూ టీ20 వరల్డ్ కప్ జరుగనుంది. ఈ దశలో కెప్టెన్ లను మార్చాల్సిన అవసరం లేదు’ అని అన్నాడు.
ఇక భారత ఓపెనర్ కెఎల్ రాహుల్ (kl rahul), పంత్ (rishabh pant) లను వైస్ కెప్టెన్ లుగా నియమించాలని సునీల్ గవాస్కర్ సూచించాడు. ఇద్దరూ తమ తమ టీమ్ లకు అద్భుత విజయాలు అందిస్తున్నారని ముఖ్యంగా రిషబ్ పంత్ వ్యూహ రచన భాగుందని కొనియాడాడు. బౌలర్లను ఎలా వాడుకోవాలో పంత్ కు బాగా తెలుసునని, మ్యాచ్ పరిస్థితులను అంచనా వేసి తెలివిగా నిర్ణయాలు తీసుకోవడంలో పంత్ రాటుదేలాడని తెలిపాడు. ఈ విషయంలో రాహుల్ కూడా సమర్థుడే అని ప్రశంసలు కురిపించాడు.
