Asia Cup 2022: గడిచిన కొన్నాళ్లుగా ఉపఖండపు అభిమానులతో పాటు ఆసియా క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్ పండుగకు వేళైంది. ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది.
వచ్చే నెల చివరి వారంలో మొదలుకానున్న ఆసియా కప్-2022 కోసం ఉపఖండపు అభిమానులతో పాటు మొత్తం ఆసియా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీని శ్రీలంకలో నిర్వహించాల్సి ఉండగా అక్కడ నెలకొన్న రాజకీయ, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈ టోర్నీని ఇప్పడు ఎడారి దేశం యూఏఈకి మార్చారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 దాకా టీ20 ఫార్మాట్ లో జరుగబోయే ఈ టోర్నీపై ఇప్పటికే అంచనాలు నెలకొని ఉన్న నేపథ్యంలో తాజాగా టోర్నీ అధికారిక ప్రసారదారు అయిన స్టార్ స్పోర్ట్స్.. ఆసియా కప్-2022 ప్రోమోను విడుదల చేసి ఆ అంచనాలను అమాంతం పెంచింది.
ఆరు దేశాలు పాల్గొనబోయే ఈ మెగా ఈవెంట్ లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ లు నేరుగా అర్హత సాధించాయి. ఆరో జట్టుకోసం హాంకాంగ్, యూఏఈ, సింగపూర్, కువైట్ పోటీ పడుతున్నాయి. అయితే ఈ నాలుగు దేశాలకు నిర్వహించబోయే అర్హత రౌండ్ లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఆరో జట్టుగా పోటీలో నిలవబోతున్నది.
ఇదిలాఉండగా ఈ టోర్నీ కోసం స్టార్ స్పోర్ట్స్ తాజాగా ప్రోమోను విడుదల చేసింది. ప్రోమోలో ఇండియా విజయాన్ని కాంక్షిస్తూ ఓ పాటతో కూడిన వీడియోను రూపొందించారు. ఇందులో ‘మా ఇండియా నెంబర్ వన్. ఇప్పుడు మేం ఆసియా (ఆసియా కప్) ను గెలుస్తాం. మా పొరుగుదేశాలు కూడా ఈ టోర్నీని గెలవడానికి ఆరాటపడుతున్నాయి. కానీ సగర్వంగా ఎగురుతున్న మువ్వన్నెల జెండా సాక్షిగా మేమిక్కడికి వచ్చింది గెలవడానికే అని మా ప్రత్యర్థులకు చెబుతున్నాం..’ అంటూ సాగే పాటతో టీమిండియా ఉద్దేశాన్ని ప్రోమోలో చేర్చారు.
స్టార్ స్పోర్ట్స్ ఆసియా కప్ కు అఫీషియల్ బ్రాడ్కస్టర్. ఈ టోర్నీలోని మ్యాచులన్నీ దీన్లోనే వీక్షించొచ్చు. అలాగే డిస్నీ హాట్ స్టార్ లో కూడా మ్యాచులను చూడొచ్చు.
ఈ టోర్నీలో భాగంగా భారత జట్టు ఆగస్టు 28న దాయాది దేశం పాకిస్తాన్ తో తలపడనున్నది. టీ20 ప్రపంచకప్-2022 కు ముందు జరుగుతున్న ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2016తో పాటు 2018లో కూడా భారత జట్టే ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఇక ఈ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టు కూడా టీమిండియానే కావడం గమనార్హం.
1984 నుంచి ఈ టోర్నీని నిర్వహిస్తుండగా.. ఇప్పటివరకు భారత జట్టు ఏడుసార్లు ట్రోఫీ నెగ్గింది. శ్రీలంక ఐదుసార్లు గెలుపొందగా పాకిస్తాన్ రెండు సార్లు విజేతగా నిలిచింది. మరి ఈసారి విజేత ఎవరవుతారని ఆసియా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
