వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి శ్రీలంక అర్హత... జింబాబ్వేతో మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం.. జింబాబ్వే, వెస్టిండీస్‌లకు ఛాన్స్! 

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి శ్రీలంక అర్హత సాధించింది. 1996లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన శ్రీలంక, 2007, 2011 వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో ఫైనల్ చేరినా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. కొంతకాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న శ్రీలంక జట్టు, నేరుగా వరల్డ్ కప్ 2023 టోర్నీకి అర్హత సాధించలేకపోయింది..

క్వాలిఫైయర్స్‌లో గ్రూప్ స్టేజీలో నాలుగు మ్యాచుల్లో గెలిచి టేబుల్ టాపర్‌గా నిలిచిన శ్రీలంక, సూపర్ 6 రౌండ్‌లో నెదర్లాండ్స్‌, జింబాబ్వేలపై వరుస విజయాలు అందుకుని... ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి అర్హత సాధించింది. గ్రూప్ స్టేజీలో వరుస విజయాలు అందుకున్న జింబాబ్వేకి క్వాలిఫైయర్స్‌లో ఇదే తొలి పరాజయం..

అయితే జూలై 4న స్కాట్లాండ్‌తో మ్యాచ్ ఆడబోతున్న జింబాబ్వే, ఆ మ్యాచ్ గెలిస్తే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి అర్హత సాధించగలుగుతుంది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 32.2 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బీభత్సమైన ఫామ్‌లో ఉన్న సీన్ విలియమ్స్ 57 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 56 పరుగులు చేయగా, సికందర్ రజా 51 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 31 పరుగులు చేశాడు..

రియాన్ బర్ల్ 16, క్రెగ్ ఎర్విన్ 14, జాంగ్వే 10 పరుగులు, బ్రాడ్ ఇవన్స్ 14 పరుగులు చేశారు. మిగిలిన జింబాబ్వే బ్యాటర్లు ఎవ్వరూ సింగిల్ డిజిట్ స్కోరు కూడా దాటలేకపోయారు. శ్రీలంక బౌలర్లలో మహీశ తీక్షణ 8.2 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 25 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు..

దిల్షాన్ మధుశనక 3 వికెట్లు తీయగా మతీశ పథిరాణా 2 వికెట్లు తీశాడు. దసున్ శనకకి ఓ వికెట్ తీసింది. ఈ లక్ష్యాన్ని 33.1 ఓవర్లలో వికెట్ కోల్పోయి ఛేదించింది శ్రీలంక. తొలి వికెట్‌కి 103 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించిన తర్వాత దిముత్ కరుణరత్నే వికెట్ కోల్పోయింది శ్రీలంక. 

56 బంతుల్లో 2 ఫోర్లతో 30 పరుగులు చేసిన కరుణరత్నేని రిచర్డ్ గరావా అవుట్ చేయగా పథుమ్ నిశ్శంక 102 బంతుల్లో 14 ఫోర్లతో 101 పరుగులు చేసి... లంక విజయానికి 1 పరుగు కావాల్సిన సమయంలో ఫోర్‌ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కుశాల్ మెండిస్ 42 బంతుల్లో 2 ఫోర్లతో 25 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. 

జింబాబ్వే చేతుల్లో ఓడి ఆ తర్వాత స్కాట్లాండ్, నెదర్లాండ్స్ చేతుల్లో వరుస పరాజయాలు అందుకున్న వెస్టిండీస్.. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి అర్హత సాధించలేకపోయింది.. జూలై 5న ఓమన్‌తో, జూలై 7న శ్రీలంకతో మ్యాచులు ఆడనుంది వెస్టిండీస్. ఈ రెండు మ్యాచుల్లో ఘన విజయాలు అందుకుని, జింబాబ్వే, స్కాట్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో ఓడితే విండీస్‌కి వన్డే వరల్డ్ కప్ 2023 ఆడే అవకాశాలు ఉంటాయి..