SL vs AUS T20Is: శ్రీలంక పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా టీ20 సిరీస్ ను గెలుచుకుంది. సిరీస్ లో ఇప్పటివరకు రెండు మ్యాచులు జరుగగా రెండూ ఆసీస్ గెలిచింది.
నడుము కంటే కాస్త ఎక్కువ ఎత్తులో వచ్చిన బంతిని ఆడే క్రమంలో ప్రపంచంలోని ఏ బ్యాటరైనా పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నిస్తాడు. అదే బంతి బౌన్సర్ అయితే తల కాస్త కిందకు వంచి దాని నుంచి తప్పించుకుంటాడు. శ్రీలంక కు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండిస్ మాత్రం హిట్ వికెట్ గా ఔట్ అయ్యాడు. దురదృష్టం అతడిని వెంటాడగా కీలక సమయంలో హిట్ వికెట్ గా వెనుదిరిగి తీవ్ర నిరాశకు గురయ్యాడు. బుధవారం శ్రీలంక-ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టీ20లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన లంక.. తొలి రెండు ఓవర్లలోనే ఓపెనర్లను కోల్పోయిన క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ అయిన కుశాల్ మెండిస్ క్రీజులోకి వచ్చి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 36 పరుగులు చేసిన అతడు.. రెండో మూడో వికెట్ కు అసలంక (39) తో కలిపి 66 రన్స్ జోడించాడు.
ఇన్నింగ్స్ 15వ ఓవర్లో జై రిచర్డ్సన్ వేసిన షార్ట్ పిచ్ బంతిని ఆడే క్రమంలో కుశాల్ మెండిస్ హిట్ వికెట్ గా ఔటయ్యాడు. నడుముకు కాస్త ఎత్తులో వచ్చిన బంతిని ఫుల్ షాట్ ఆడటానికి యత్నించాడు. కానీ అది కాస్త మిస్ అయింది. అయితే అప్పటికే శరీరంపై నియంత్రణ కోల్పోయిన మెండిస్.. వెనక్కి పడిపోయాడు. ఈ క్రమంలో అతడి బ్యాట్.. వికెట్ల మీద పడింది. దీంతో అతడు హిట్ వికెట్ అయి పెవిలియన్ కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లంక.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. అసలంక (39) టాప్ స్కోరర్. ఆసీస్ బౌలర్లలో కేన్ రిచర్డ్సన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. జై రిచర్డ్సన్ 3, మ్యాక్స్వెల్ 2 వికెట్లు తీశారు. అనంతరం ఆసీస్.. 17.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మాథ్యూ వేడ్ (26 నాటౌట్), ఆరోన్ ఫించ్ (24), డేవిడ్ వార్నర్ (21) లు రాణించారు. దీంతో మూడు మ్యాచుల టీ20 సిరీస్ ను ఆసీస్ 2-0తో గెలుపొందింది. శనివారం పల్లెకెలెలో మూడో టీ20 జరగాల్సి ఉంది.
ఈ ఏడాది మొదట్లో ఆసీస్ పర్యటనకు వెళ్లిన శ్రీలంక అక్కడ (1-4) భంగపడగా.. స్వదేశంలో అదే ఆసీస్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో కూడా అదే విధంగా తడబడుతుండటం గమనార్హం.
