సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుత పరిస్థితిని 2024 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అద్భుత పునరాగమనంతో పోల్చారు నితీష్ కుమార్ రెడ్డి పోల్చారు. తొమ్మిది మ్యాచ్‌లలో మూడు విజయాలతో సన్ రైజర్స్ ప్రస్తుతం 6 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది... అయినా ప్లేఆఫ్ అవకాశాలపై ధీమాతో ఉంది. 

Sunrisers Hyderabad : హోంగ్రౌండ్ లోనే చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించింది సన్ రైజర్స్ హైదరాబాద్. నిన్న(శుక్రవారం ఏప్రిల్ 25న) చిదంబరం స్టేడియంలో సిఎస్కేతో సన్‌రైజర్స్ తలపడింది. ఈ మ్యాచ్ ద్వారా చెన్నై ప్లేఆఫ్ ఆశలు గల్లంతవగా సన్ రైజర్స్ కు మిగిలివున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి తమ జట్టు సన్ రైజర్స్ ఐపిఎల్ 2025 ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశాలపై ధీమా వ్యక్తం చేశారు.

వరుసగా రెండు ఓటముల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌పై ఐదు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పుంజుకుంది. 155 పరుగుల లక్ష్యాన్ని కేవలం 18.4 ఓవర్లలోనే ఛేదించారు. ఇషాన్ కిషన్ 34 బంతుల్లో 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కమిందు మెండిస్ (32*), నితీష్ కుమార్ రెడ్డి (19*), అనికేత్ వర్మ (19) విలువైన ఇన్నింగ్స్‌లతో SRH పరుగుల ఛేదనలో కీలక పాత్ర పోషించారు. మెండిస్, నితీష్ ఆరో వికెట్‌కు 49 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి సన్‌రైజర్స్ లక్ష్యాన్ని ఛేదించడంలో సహాయపడ్డారు.

తొమ్మిది మ్యాచ్‌లలో మూడో విజయంతో ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మూడు విజయాలు, ఆరు ఓటములతో, సన్‌రైజర్స్ ప్రస్తుతం 6 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది మరియు -1.103 నెట్ రన్ రేట్ (NRR) కలిగి ఉంది.

SRH ప్లేఆఫ్ అవకాశాలపై నితీష్ కుమార్ రెడ్డి

CSK పై SRH విజయం తర్వాత నితీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జట్టు విజయం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. పరుగుల ఛేదన సమయంలో మధ్యలో తనకు, కమిందు మెండిస్‌కు మధ్య జరిగిన సంభాషణను వెల్లడించారు. ఇది సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఒక 'డూ ఆర్ డై' మ్యాచ్ అని ఆయన అంగీకరించారు. గత ఐపిఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుండి ప్రేరణ పొంది జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుందని నితీష్ రెడ్డి నమ్ముతున్నారు.

“జట్టు కోసం ఆలోచన బాగానే సాగింది. మేము ఈ మ్యాచ్ గెలిచినందుకు నేను గర్వపడుతున్నాను, రాబోయే మ్యాచ్‌లలో కూడా గెలుస్తామని ఆశిస్తున్నాను.” అని నితీష్ అధికారిక ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్‌తో అన్నారు.

''మేము(కమిందు) సాధారణ ఆట ఆడటం గురించి మాట్లాడుకున్నాము.పెద్ద షాట్లు కొట్టాలని చూడలేదు. పెద్ద బౌండరీని ఎదుర్కొని ఒకటి రెండు పరుగులు తీసుకోవాలని చూస్తున్నాము, మేము దాన్ని సులభంగా ఛేదించాము. ఇది మాకు చాలా ముఖ్యమైన మ్యాచ్. గత సంవత్సరం ఇదే పరిస్థితిలో ఉన్న ఆర్సిబి వరుసగా 7 మ్యాచ్‌లు గెలిచింది. ఈ సంవత్సరం మనం ఎందుకు కాదు. 100 శాతం కృషి చేస్తాం” అని నితీష్ రెడ్డి తెలిపారు. 

ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ లీగ్ దశలో మిగిలిన 5 మ్యాచ్‌లు గెలవాలి. ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని జట్టు లీగ్ దశను 8 విజయాలతో ముగించినట్లయితే వారు 16 పాయింట్లు సాధిస్తారు, అదే సమయంలో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడానికి టాప్ 4 స్థానాన్ని పొందుతారు. SRH 14 పాయింట్లు సాధిస్తే, ప్లేఆఫ్‌కు వారి అర్హత వారి నెట్ రన్ రేట్‌పై ఆధారపడి ఉంటుంది, అలాగే పోటీలో ఉన్న ఇతర జట్ల ఫలితంపై ఆధారపడి ఉంటుంది.

IPL 2024లో RCB ఎలా పునరాగమనం చేసి ప్లేఆఫ్ బెర్త్‌ను కైవసం చేసుకుంది?

ఫాఫ్ డు ప్లెసిస్ కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గత సీజన్ ను పేలవంగా ప్రారంభించింది... వారు 8 మ్యాచ్‌లలో ఒక విజయంతో పాయింట్ల పట్టికలో దిగువన ఉన్నారు. మూడుసార్లు ఐపిఎల్ ఫైనలిస్ట్‌లు ప్లేఆఫ్‌కు అర్హత సాధించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే ఆర్సిబి వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి అద్భుతంగా పునరాగమనం చేసి ప్లేఆఫ్స్‌లో తమ స్థానాన్ని సంపాదించుకుంది.