భారత క్రికెట్ చరిత్రలో 2000-01 మధ్య కాలంలో జరిగిన స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం ఓ మచ్చగా మారితే.. ఆ తర్వాత 2013 ఐపీఎల్ సీజన్‌లో చోటు చేసుకున్న మరో స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం అదే స్థాయిలో కలకలం రేపింది.

ఈ ఫిక్సింగ్‌కు సంబంధించి టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ తన కెరీర్‌నే కోల్పోయాడు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో శ్రీశాంత్ ఇంటికే పరిమితమయ్యాడు.

Also Read:అగమ్యగోచరం: స్టాక్ మార్కెట్ ను నమ్మి రోడ్డున పడ్డ క్రికెట్ ఆస్ట్రేలియా

ఈ సందర్భంగా హలో యాప్ లైవ్‌లో మాట్లాడిన ఈ కేరళ స్పీడ్ స్టార్.. భారత క్రికెట్‌లో ఎప్పటికీ కపిల్ దేవే అత్యుత్తమ కెప్టెన్ అని ప్రశంసించాడు. విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అని, బుమ్రా అత్యుత్తమ బౌలర్ అని అభిప్రాయపడ్డాడు.

2011 ప్రపంచకప్ నాటి విశేషాలను గుర్తుచేసుకున్న శ్రీశాంత్.. ఆ మెగా టోర్నీ సందర్భంగా తాను కొంత ఆందోళన చెందానని చెప్పాడు. ఈ సమయంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తనకు ధైర్యం చెప్పి ఎంతగానో ప్రోత్సహించారని శ్రీశాంత్ గుర్తుచేసుకున్నాడు.

ఆ ప్రపంచప్‌ భారతదేశంలోనే జరుగుతున్నందున జట్టులోని ప్రతీ ఒక్కరూ సచిన్ కోసం ఎలాగైనా ట్రోఫీని కైవసం చేసుకోవాలని కసితో ఆడారని శ్రీశాంత్ చెప్పాడు. స్వదేశంలో, వేలాది మంది అభిమానుల మధ్య విశ్వవిజేతగా నిలవడం గొప్ప అనుభూతిగా పేర్కొన్నాడు. అలాగే టీమిండియా జెర్సీతో తాను ఆడిన చివరి మ్యాచ్ అదేనని అతను గుర్తుచేసుకున్నాడు.

Also Read:దొరక్క దొరక్క దొరికాడు: లాక్‌డౌన్‌లో ధోనీని అస్సలు వదలడం లేదుగా

లాక్‌డౌన్‌పై స్పందిస్తూ భార్య, పిల్లలతో సంతోషంగా ఉన్నానని తెలిపాడు. ఈ సమయాన్ని తన ఫిట్‌నెస్‌ను పెంచుకునేందుకు ఉపయోగిస్తానని శ్రీశాంత్ చెప్పాడు. తనది లవ్ మ్యారేజ్ అని చెప్పిన అతను.. తన భార్యను తొలిచూపులోనే ప్రేమించానని తెలిపాడు.

కాగా ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌లో ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీశాంత్‌ను బీసీసీఐ నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే అతనిపై విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు గతేడాది మార్చి 15న తోసిపుచ్చడంతో.. ఈ ఏడాది ఆగస్టులో శ్రీశాంత్ నిషేధం పూర్తవుతుంది. తద్వారా అతను కేరళ , టీమిండియాల తరపున ఆడే అర్హత సాధిస్తాడు.