Asianet News TeluguAsianet News Telugu

మహామహుల వల్లే కానిది మహిళలు సాధించారు.. ఆ ఒక్కటీ దాటితే సఫారీ అతివలది చరిత్రే..

ICC Womens T20 World Cup: స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ  మహిళల  టీ20 ప్రపంచకప్ లో   దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. శుక్రవారం  ఇంగ్లాండ్ తో జరిగిన సెమీస్ లో  ఆ జట్టును ఓడించి ఫైనల్ కు చేరింది. 

South African Women's Team Creates History, Will They Win Their First Ever ICC Trophy? MSV
Author
First Published Feb 25, 2023, 6:55 PM IST | Last Updated Feb 25, 2023, 6:55 PM IST

హాన్సీ క్రానే, షాన్ పొలాక్,  గ్రేమ్ స్మిత్, మార్క్ బౌచర్, జాక్వస్ కలిస్, ఏబీ డివిలియర్స్, ఫాఫ్ డుప్లెసిస్, క్వింటన్ డికాక్..  కాలంతో పాటు సారథుల పేర్లు మారుతున్నా ఐసీసీ ట్రోఫీలలో  దక్షిణాఫ్రికా తలరాత మాత్రం మారలేదు.  అంతర్జాతీయ స్థాయి బ్యాటర్లు.. అగ్రశ్రేణి బ్యాటర్లను బెంబేలెత్తించిన బౌలర్లు.. మైదానం నలువైపులా  పాదరసంలా కదిలే ఫీల్డర్లు.. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు ఆ జట్టుకు ఇంతవరకూ ఐసీసీ  టోర్నీలలో ఫైనల్ చేరిన చరిత్ర లేదు. కెప్టెన్లు, ప్లేయర్లు మారుతున్నా ఆ జట్టు రాత మార్చిన నాధుడే లేడు. 

1992 నుంచి  పురుషుల వన్డే ప్రపంచకప్ లలో పాల్గొంటున్న దక్షిణాఫ్రికా ఐసీసీ టోర్నీలలో అత్యంత దురదృష్టకరమైన జట్టు. ప్రకృతి పగబట్టిందో.. ఆటగాళ్ల వైఫల్యమో గానీ  వన్డే వరల్డ్ కప్, టీ20 ప్రపంచకప్.. పేరు ఏదైనా దక్షిణాఫ్రికాకు నిరాశే మిగులుతున్నది.    

ప్రపంచ క్రికెట్ లో డక్‌వర్త్ లూయిస్ వల్ల  అత్యధికంగా  నష్టపోయిన జట్టు ఏదైనా ఉందా అంటే అది కచ్చితంగా  సౌతాఫ్రికానే. 1992,  96,  99, 2007, 2011, 2015, 2019 వన్డే వరల్డ్ కప్ లతో పాటు టీ20 ప్రపంచకప్ లలో కూడా దారుణ వైఫల్యాలే సఫారీలను వెంటాడాయి. సౌతాఫ్రికా ఇంతవరకు వన్డే వరల్డ్ కప్ లలో సెమీస్ గండాన్నే దాటలేదు.  జట్టు నిండా టీ20 స్టార్లు ఉన్నా  ఇంతదాకా ఆ జట్టు ఫైనల్ కే చేరలేదు. మొన్నటికి మొన్న 2022  టీ20 ప్రపంచకప్ లో కూడా లీగ్ దశలో నమీబియా చేతిలో అనూహ్యంగా ఓడి ఇంటిబాట పట్టింది.  ఐసీసీ టోర్నీలలో దురదృష్టం వెంటాడే సఫారీ టీమ్ ను  క్రికెట్ పండితులు‘చోకర్స్ టీమ్’గా అభివర్ణిస్తారు.. 

మహిళలూ అదే తోవలో.. 

పురుషుల  ప్రదర్శన ఇలా ఉంటే మహిళల క్రికెట్ ఏమైనా  బాగుందా అంటే అదీ లేదు.  1997 వన్డే ప్రపంచకప్ నుంచి   నుంచి దక్షిణాఫ్రికా ఐసీసీ టోర్నీలలో ఆడుతోంది.  1997లో క్వార్టర్స్, 2000లో సెమీస్ కు చేరిన ఆ జట్టు ఆ తర్వాత 2017 దాకా గ్రూప్ స్టేజ్ కే పరిమితమైంది. కానీ ఆ ఏడాది సెమీస్ చేరినా  నిరాశ తప్పలేదు. గతేడాది న్యూజిలాండ్ వేదికగా ముగిసిన టోర్నీలో కూడా  సఫారీలు సెమీస్ గండాన్ని దాటలేదు.  వన్డేల సంగతి ఇలాఉంటే టీ20 ప్రపంచకప్ లలో కూడా ఆ జట్టు ప్రదర్శన పేలవంగా ఉంది.  2014, 2020లో సెమీస్ చేరిన ఆ జట్టు.. మిగతా సందర్భాలలో గ్రూప్ స్టేజ్ కే పరిమితమైంది. 

రాత మార్చారు..  

ఎట్టకేలకు దక్షిణాఫ్రికా సెమీస్ గండాన్ని విజయవంతంగా దాటింది.  వాళ్ల దేశంలోనే జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో  భాగంగా తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడటంతో.. ‘ఈ జట్టు ఈసారి కూడా గ్రూప్ స్టేజ్ కే పరిమితం’అని పెదవి విరిచిన వాళ్లూ లేకపోలేదు.  అదీగాక ఈ టోర్నీకి  ముందు ఆ టీమ్ లో పలువురు ప్లేయర్లకు ఫిట్నెస్ లేదని పెద్ద చర్చ జరిగింది.  ఏకంగా ఆ జట్టు సారథి డేన్ వాన్ నీరెక్ ను టీమ్ నుంచి తప్పించారు.  కానీ ఆసీస్ తో ఓటమి తర్వాత  సౌతాఫ్రికా మహిళలు పుంజుకున్నారు.  న్యూజిలాండ్, బంగ్లాదేశ్ లపై ఘన విజయాలు సాధించి నాకౌట్ దశకు చేరుకున్నారు.  

సెమీస్  లో దక్షిణాఫ్రికా ప్రత్యర్థి పటిష్టమైన ఇంగ్లాండ్.  తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు.. నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులే చేశారు. ఇదేం పెద్ద లక్ష్యం కాదు. అదీ ఇంగ్లాండ్ కు అస్సలే కాదు. కానీ దక్షిణాఫ్రికా అద్భుతమే చేసింది.  క్రమం తప్పకుండా ఇంగ్లాండ్ వికెట్లు తీసి ఆ జట్టుపై ఒత్తిడి పెంచింది.   కళ్లు చెదిరే క్యాచ్ లు, సింగిల్స్ ను నిలువరిస్తూ.. ఇంగ్లాండ్ జట్టును  158 పరుగులకే పరిమితం చేసింది. 

దక్షిణాఫ్రికా ఆరు పరుగుల తేడాతో గెలిచిన తర్వాత కామెంట్రీ బాక్స్ లో  కామెంట్రీ చెబుతున్న దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్  ఒకరు  కన్నీటి పర్యంతం అయ్యారు. ‘మా జట్టు  ఫైనల్ వెళ్లిందన్న’  సంతోషంతో ఆమె ఏడుస్తూనే  కామెంట్రీని కొనసాగించింది.  గ్రౌండ్ లో ఆటగాళ్లు, మ్యాచ్ ను చూస్తున్న దక్షిణాఫ్రికా అభిమానులు..  అందరి కళ్లల్లోనూ ఆనంద బాష్పాలే.  

 

తుది అడుగు దాటుతుందా..? 

సెమీస్ గండాన్ని దిగ్విజయంగా దాటిన దక్షిణాఫ్రికా  తుది అడుగు ఎలా వేస్తుందన్నది కీలకం. ఎందుకంటే   ఫైనల్ లో ఆ జట్టు ఢీకొనబోయేది పటిష్ట ఆస్ట్రేలియాను. ఐదు సార్లు  ప్రపంచ ఛాంపియన్ అయిన ఆ జట్టును లొంగదీసుకోవడం అంత ఈజీ కాదు.  ఇయాన్ హీలి, బెత్ మూనీ, ఆష్లే గార్డ్‌నర్, ఎల్లీస్ పెర్రీ  వంటి భీకరమైన ఆటగాళ్లు ఆ జట్టుకు సొంతం.  అదీగాక ఈ టోర్నీ తొలి మ్యాచ్ లో ఆసీస్.. దక్షిణాఫ్రికాకు ఓటమి రుచి చూపించింది.  మరి  ఆ దెబ్బకు  సఫారీలు దెబ్బ తీస్తారా..?   ఐసీసీ టోర్నీలలో ‘చోకర్స్’ ముద్రను మగువలు తొలగిస్తారా..?  దక్షిణాఫ్రికాకు తొలి ఐసీసీ ట్రోఫీని అందిస్తారా..? ఈ  ప్రశ్నలన్నింటికీ రేపు (ఆదివారం) సమాధానం దొరుకుతుంది.  ఆదివారం  సాయంత్రం 6.30 గంటల నుంచి ఈ రెండు జట్ల మధ్య  ఐసీసీ మహిళల  ప్రపంచకప్ ఫైనల్ జరగాల్సి ఉంది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios