ఇంగ్లాండ్ పేసర్  జేమ్స్ అండర్సన్ వరల్డ్ రికార్డు సృష్టించాడు.సెంచూరియాన్ లోని సూపర్ పార్క్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో  అండర్సన్ ఈ రికార్డు చేజిక్కించుకున్నాడు. ఈ మ్యాచ్ అండర్సన్ కి 150వ మ్యాచ్ కాగా... 150 టెస్టులు ఆడిన ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా అండర్సన్ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. మరే బౌలరూ ఇప్పటి వరకు 150 టెస్టులు ఆడిందిలేదు.
 
దిగ్గజ బౌలర్లు అయిన షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్, అనిల్ కుంబ్లే, గ్లెన్ మెక్‌గ్రాత్ వంటి దిగ్గజాలకు కూడా సాధ్యం కాని రికార్డును అండర్సన్ సాధించాడు. వార్న్ 145, మురళీధరన్ 133, కుంబ్లే 132, మెక్‌గ్రాత్ 124 టెస్టులు ఆడారు. ఇక, పేస్ బౌలర్లలో అత్యధిక టెస్టులు ఆడిన వారి జాబితాలో 135 టెస్టులతో స్టువర్ట్ బ్రాడ్ రెండో స్థానంలో ఉన్నాడు. విండీస్ మాజీ బౌలర్ వాల్స్ 132 టెస్టులలో ప్రాతినిధ్యం వహించి మూడో స్థానంలో ఉన్నాడు.
 
అంతేకాదు, 150 టెస్టులు ఆడిన రెండో ఇంగ్లిష్ క్రికెటర్‌గానూ అండర్సన్ మరో రికార్డును అందుకున్నాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ 161 టెస్టులతో అండర్సన్ కంటే ముందున్నాడు. కాగా, ఓవరాల్‌గా 150 టెస్టులు ఆడిన 9వ క్రికెటర్‌గా అండర్సన్ తన పేరును లిఖించుకున్నాడు. అతడి కంటే ముందు సచిన్‌ టెండూల్కర్ (200), రికీ పాంటింగ్‌ (168), స్టీవ్‌ వా (168), జాక్విస్ కలిస్ (166), శివ నరేన్ చంద్రపాల్‌ (164), రాహుల్‌ ద్రవిడ్‌ (164), అలిస్టర్ కుక్‌ (161), అలెన్ బోర్డర్ (156)లు ఉన్నారు.