సఫారీలకు తప్పని తిప్పలు.. మెల్బోర్న్లో విజయం దిశగా ఆసీస్
AUSvsSA Test: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికాకు తిప్పలు తప్పడంలేదు. మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో కూడా సఫారీ టీమ్ ఓటమి అంచున ఉంది.

ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకూ ఏదీ కలిసిరావడం లేదు. ఇదివరకే తొలి టెస్టులో దారుణంగా ఓడిన సఫారీలు.. మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో కూడా ఓటమి దిశగా పయనిస్తున్నారు. తొలుత దక్షిణాఫ్రికాను 189 పరుగులకే కట్టడి చేసిన ఆసీస్.. తర్వాత మొదటి ఇన్నింగ్స్ లో డేవిడ్ వార్నర్ వీరవిహారానికి తోడు వికెట్ కీపర్ అలెక్స్ కేరీ సెంచరీతో 8 వికెట్ల నష్టానికి 575 పరుగుల భారీ స్కోరు చేసింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన సౌతాఫ్రికా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయింది.
ఆట రెండో రోజు డబుల్ సెంచరీతో వార్నర్ చెలరేగగా మూడో రోజు ట్రావిస్ హెడ్ (51), కామెరూన్ గ్రీన్ (51) లు హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆ తర్వాత వికెట్ కీపర్ అలెక్స్ కేరీ.. 149 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 111 పరుగులు చేశాడు. ఫలితంగా ఆసీస్ ఈ టెస్టులో పటిష్ట స్థితిలో నిలిచింది.
భారీ స్కోరు చేశాక ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు ఆసీస్ సారథి పాట్ కమిన్స్. రెండో ఇన్నింగ్స్ లో 386 పరుగులు వెనుకబడ్డ సఫారీలకు ఆదిలోనే భారీ షాక్ తాకింది. ఆ జట్టు సారథి డీన్ ఎల్గర్ ను కమిన్స్ ఔట్ చేశాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా.. 7 ఓవర్లలో వికెట్ నష్టానికి 15 పరుగులు చేసింది. ప్రస్తుతం సరెల్ ఎర్వీ (7 నాటౌట్), డి బ్రుయాన్ (6) లు క్రీజులో ఉన్నారు. వెలుతురు లేకపోవడంతో మూడో రోజు ఆటను అరగంట ముందే నిలిపేశారు.
ఇక నాలుగో రోజు కూడా ఆసీస్ పేసర్లు విజృంభిస్తే అప్పుడు సఫారీలకు కష్టాలు తప్పవు. ఆట మొదటి సెషన్ లో నిలిస్తే పరుగులు రాబట్టడం అంత కష్టమేమీ కాదని ఆసీస్ బ్యాటర్లు నిరూపించిన చోట దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఎలా ఆడతారనేది ఆసక్తికరం. ఒకవేళ వికెట్లు కోల్పోతే మాత్రం సిరీస్ ఆసీస్ వశమవడం ఖాయం.