భారత్-సౌతాఫ్రికాల మధ్య జరిగిన టీ20 సీరిస్ లో ఇరుజట్లు సమఉజ్జీలుగా నిలిచాయి. బెంగళూరు వేదికన జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20 లో సఫారీ జట్టు పుంజుకుని అద్భుత విజయాన్ని అందుకుంది. మొహాలీ టీ20లో హాఫ్ సెంచరీతో చెలరేగినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయిన కెప్టెన్ డికాక్ ఈసారి మాత్రం అలా జరగనివ్వలేదు. బెంగళూరు మ్యాచ్ లో చివరివరకు అజేయంగా నిలిచి జట్టును విజేతగా నిలబెట్టాడు. ఇలా సౌతాఫ్రికాను 1-1 తో భారత్ కు సమానంగా నిలబెట్టిన డికాక్ తన ఖాతాలో కూడా పలు అరుదైన రికార్డులు వేసుకున్నాడు. 

భారత పర్యటనలోనే సఫానీ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను క్వింటన్ డికాక్ అందుకున్నాడు. ఇలా మొదటిసారి సారథిగా వ్యవహరించిన మొహాలీ టీ20 లో అతడు హాఫ్ సెంచరీ (52 పరుగులు) తో రాణించాడు. ఆ తర్వాత తాజాగా బెంగళూరులో జరిగిన మ్యాచ్ లో కూడా డికాక్ మరో హాఫ్ సెంచరీ (79 పరుగులు) బాదాడు. ఇలా కెప్టెన్ గా వరుస మ్యాచుల్లో రెండు హాఫ్ సెంచరీలు బాదడం ద్వారా డికాక్ ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. 

ఇప్పటివరకు పాల్ స్టిర్లింగ్ ఐర్లాండ్ కెప్టెన్సీ, నవనీత్ సింగ్ కెనడా కెప్టెన్స్ బాధ్యతలు చేపట్టగానే వరుస మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు సాధించారు. వీరిద్దరి తర్వాత ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్ గా డికాక్ నిలిచాడు. 

ఇక ఇదే బెంగళూరు మ్యాచ్ ద్వారా డికాక్ అంతర్జాతీయ టీ20 కెరీర్లో1000 పరుగులను పూర్తిచేసుకున్నాడు. అతడు కేవలం 38 ఇన్నింగ్సుల్లో ఈ ఘనత సాధించాడు. అంతర్జాతీయ స్థాయి వికెట్ కీపర్లలో వేగంగా 1000 పరుగులు పూర్తిచేసుకున్న ఆటగాళ్ల జాబితాలో డికాక్ మూడో స్ధానంలో నిలిచాడు. అతడికంటే ముందు కుమార సంగక్కర 31, మహ్మద్  షెహజాద్ 37మ్యాచుల్లోనే ఈ ఘనత సాధించారు. 

నిర్ణయాత్మక బెంగళూరు టీ20లో సఫారీ జట్టు విజయం సాధించి ఆతిథ్య జట్టు క్లీన్ స్వీప్ ఆశలపై నీళ్లు చల్లింది. మొదట బౌలర్లు కోహ్లీసేనను 134 పరుగులకే కట్టడిచేశారు. ఆ తర్వాత కెప్టెన్ డికాక్ 79 పరుగులతో నాటౌట్ గా నిలిచిన సఫారీ జట్టును గెలిపించాడు. అతడికి హెన్రిక్స్(28 పరుగులు), బవుమా(19 పరుగులు  నాటౌట్) ల నుండి చక్కటి సహకారం అందింది. దీంతో సౌతాఫ్రికాటీం  16.2 ఓవర్లలో కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.