మరికొద్దిరోజుల్లో టీమిండియాతో మైదానంలో పోటిపడాల్సి వుండగా అంతకుముందే దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మాటలయుద్దానికి దిగారు. ముఖ్యంగా భారత స్టార్ బౌలర్,
యార్కర్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ సింగ్ బుమ్రాను టార్గెట్ గా చేసుకుని లాభపడాలని సౌతాఫ్రికా ఆటగాళ్లు భావిస్తున్నట్లున్నారు. ఇందులో భాగంగానే బౌలర్ కగిసో రబడ బుమ్రాపై విమర్శలను ఎక్కుపెట్టాడు. కావాలనే మీడియా బుమ్రాను ఆకాశానికెత్తేస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

''ఈ మధ్యకాలంలో భారత పేసర్ బుమ్రా, ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ల పేరు అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువగా వినిపిస్తోంది.  వారిద్దరు మంచి ప్రతిభ గల ఆటగాళ్లే. కానీ మీడియా కేవలం వారిద్దరు మాత్రమే అంతర్జాతీయ స్థాయి బౌలర్లు అన్నట్లుగా ప్రచారం చేస్తోంది. వారికంటే గొప్ప బౌలర్లు చాలామంది ప్రస్తుత  క్రికెట్లో వున్నారు.

నేను కూడా చాలాకాలంగా నిలకడగా వికెట్లు పడగొడుతున్నాను. కానీ వారికి లభించినంత ప్రచారం నాకు లభించడంలేదు.  నాపట్ల మీడియా నిర్లక్ష్యపు ధోరణిని ప్రదర్శించడం వల్లే నా పేరు వెలుగులోకి రావడంలేదు. నాలాగే చాలామంది కేవలం తగినంత ప్రచారం లేకపోడం వల్లే ఇంకా వెనుకవరుసలో వుండిపోతున్నారు. 

ప్రస్తుతం బుమ్రా, ఆర్చర్లకు మంచి రోజులు కొనసాగుతున్నాయి. కానీ ఎల్లప్పుడూ వారిద్దరే టాప్ బౌలర్లుగా కొనసాగుతారని అనుకుంటే పొరపడినట్లే. ప్రతి ఒక్కరికి ఓ సమయం వస్తుంది. ఆ సమయంకోసమే నేను ఎదురుచూస్తున్నా. భారత పర్యటనలో నన్ను నేను నిరూపించుకోగలనన్న నమ్మకం వుంది. '' అని రబడ పేర్కొన్నాడు.