Asianet News TeluguAsianet News Telugu

ఉద్వాసన ఖాయం: ఎమ్మెస్కే ప్రసాద్ కు సౌరవ్ గంగూలీ షాక్

సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా ఎమ్మెస్కే ప్రసాద్ కు ఉద్వాసన పలకాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. సీఏసీ నియామకం తర్వాత సెలెక్షన్ కమిటీలో మార్పులుంటాయని ఆయన చెప్పారు.

Sourav Ganguly may replace MSK Prasad as BCCI selection committee chairman
Author
Mumbai, First Published Dec 28, 2019, 12:48 PM IST

ముంబై: తెలుగువాడైన ఎమ్మెస్కే ప్రసాద్ కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ షాక్ ఇవ్వనున్నారు. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా ఉన్న ఎమ్మెస్కేను ఆయన తప్పించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

బీసీసీఐ సెలెక్షన్ కమిటీలో కీలకమైన మార్పులు తేవాలని గంగూలీ ఆలోచన చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెస్కే ప్రసాద్ స్థానంలో మరొకరిని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా నియమించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఆయనతో పాటు మరొకరిని కూడా పక్కన పెడుతారనే ప్రచారం సాగుతోంది. 

బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ పదవీ బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచి సెలెక్షన్ కమిటీలో మార్పులు జరుగుతాయంటూ ప్రచారం ప్రారంభమైంది. ప్రస్తుత కమిటీలోని ముగ్గురు సభ్యులకు మరో ఏడాది పాటు పదవీ కాలం ఉంది. దాంతో ఇద్దరిని మాత్రమే మార్చే అవకాశం ఉంది. 

మార్పు జరుగుతుందనే విషయాన్ని గంగూలీ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ధ్రువీకరించారు. ప్రస్తుత సభ్యుల్లో దేవాంగ్ గాంధీ, జతిన్ పరాంజ్పే, శరణ్ దీప్ సింగ్ కొనసాగనున్నారు. చైర్మన్ గా పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న ఎమ్మెస్కే ప్రసాద్, సభ్యుడిగా ఉన్న గగన్ ఖోడాల స్థానాల్లో కొత్తవారిని నియమించే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడుతుందని గంగూలీ చెప్పారు. 

క్రికెట్ సలహా మండలి సూచనల మేరకే నియామకాలు జరుగుతాయని ాయన చెప్పారు. మొదట కొత్త సీఏసీ నియామకం జరగాల్సి ఉందని, దాని తర్వాత సెలెక్షన్ కమిటీపై దృష్టి పెడుతామని ఆయన అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios