అనేక సంక్షోభాలు, వివాదాల మధ్యలో కొట్టామిట్టాడుతున్న భారత క్రికెట్ జట్టులో ధైర్యాన్ని నింపి విజయవంతమైన జట్టుగా తీర్చిదిద్దాడు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. యువతను ప్రోత్సహించడంతో పాటు వారికి తగిన అవకాశాల్ని ఇచ్చి జట్టులో దూకుడు స్వభావాన్ని నింపాడు.

దాదా తర్వాత వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ కూడా యువతకు పెద్దపీట వేయడంతో భారత్ తిరుగులేని శక్తిగా మారింది. అయితే యువకులను ప్రోత్సహించే పద్ధతిలో గంగూలీ, ధోనీల మధ్య చాలా పోలికలు ఉన్నాయన్నాడు టీమిండియా మాజీ పేసర్ జహీర్‌ఖాన్.

తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌తో మాట్లాడిన జహీర్.. భారత క్రికెట్‌లో ప్రతీ దశాబ్ధానికి ఒక అత్యుత్తమ కెప్టెన్ నుంచి మరో అత్యుత్తమ కెప్టెన్ జట్టు పగ్గాలను అందుకుంటాడని అతను అభిప్రాయపడ్డాడు.

సౌరవ్ గంగూలీ సారథ్యంలో జట్టులోకి చేరిన తనకు ఆయన నుంచి మంచి సహచారం లభించిందని, సౌరవ్ ప్రోత్సాహం వల్లే తన కెరీర్ మలుపు తిరిగిందని గుర్తుచేసుకున్నాడు. అలాగే టీంలో ఎంతోమంది సీనియర్లు ఉండగా ధోనీ భారత జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడని, సీనియర్లు తప్పుకుంటు్న క్రమంలో మహీ యువకులను ప్రోత్సహించాడని తెలిపాడు.

దాదా లాగే ధోనీ కూడా యువకులను వెన్నుతట్టి ప్రోత్సహించడాడని జహీర్‌ గుర్తుచేశాడు. గంగూలీ భారత క్రికెట్ రూపురేఖల్ని మార్చి యువకులను మ్యాచ్ విన్నర్లుగా తీర్చిదిద్దితే.. ధోనీ అక్కడి నుంచి టీమిండియాను ఛాంపియన్‌గా తీర్చిదిద్దాడని తెలిపాడు.

ఏ క్రికెటర్‌కైనా కెరీర్ ఆరంభంలో మంచి ప్రోత్సాహం అవసరమని, అది దొరికాక జీవితాన్ని మలుపు తిప్పుకోవడం వారి బాధ్యతేనని జహీర్ చెప్పాడు. సరైన సమయంలో అలా కెప్టెన్‌ మద్ధతు దొరకడమే అన్నింటికంటే ముఖ్యమని వెల్లడించాడు.

తన జీవితంలో గంగూలీ నుంచి మంచి సహకారం లభించిందని జహీర్ ఖాన్ గుర్తుచేసుకున్నాడు. కాగా గంగూలీ సారథ్యంలో టీమిండియాలో స్థానం సంపాదించిన జహీర్ ఖాన్.. ధోనీ కెప్టెన్సీలోనూ తనదైన ముద్ర వేశాడు. 2011 ప్రపంచకప్‌ను భారత్ గెలవడంలో జహీర్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.