ప్రతిష్టాత్మక  యాషెస్ సీరిస్ లో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అయితే అతడు బంతి తగిలి నొప్పితో విలవిల్లాడిపోతున్నా బౌలర్ జోప్రా ఆర్చర్ కనీసం దగ్గరికి కూడా వెళ్లకపోవడాన్ని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తప్పుబట్టాడు. తన బౌలింగ్ లోనే స్మిత్ గాయపడ్డాడు కాబట్టి దగ్గరకు వెళ్లి పరామర్శిస్తే హుందాగా వుండేదంటూ ఆర్చర్ కు అక్తర్ చురకలు అంటిస్తూ ట్వీట్ చేశాడు. 

''బౌన్సర్లు విసరడం అనేది ఆటలో ఓ బాగం. అయితే వీటివల్ల ప్రత్యర్థి  బ్యాట్స్ మెన్ గాయపడితే వెంటనే బౌలర్ అతడి వద్దకు వెళ్లి పరామర్శిస్తే బావుంటుంది. అతడి గాయాన్ని పరిశీలించి ఏమీ కాదని దైర్యం చెప్పాలి. కానీ ఆసిస్ ఆటగాడు స్మిత్ ను గాయపర్చిన ఇంగ్లీష్ బౌలర్ అలా హుందాగా ప్రవర్తించలేదు. నొప్పితో అతడు విలవిల్లాడిపోతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా పక్కకు వెళ్లిపోయాడు. నా బౌలింగ్ లో ప్రత్యర్థి ఆటగాడు గాయపడితే పరుగెత్తుకుని అతడి  వద్దకు వెళ్లి ఏమైందో కనుక్కునేవాడిని.'' అంటూ అక్తర్ ట్వీట్ చేశాడు. 

ఈ ట్వీట్ పై టీమిండియా మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ కామెంట్ చేస్తూ అక్తర్ ను తప్పుబట్టాడు. ''స్మిత్ ను గాయపర్చిన ఆర్చర్ దగ్గరకు వెళ్లి దైర్యం చెప్పకపోవచ్చు. కానీ నీలా మరింత బయపెట్టలేదు. నీ  బౌలింగ్ లో ఎవరైనా గాయపడితే వెంటనే అతడి వద్దకు వెళ్లేవాడివి. కానీ దైర్యం చెప్పడానికి కాకుండా ఇలాంటివి మరిన్ని ఎదుర్కోడానికి సిద్దంగా వుండమని భయపెట్టడానికి వెళ్లేవాడివి.'' అని అక్తర్ పై యువీ సెటైర్లు వేశాడు.  

యాషెస్ సీరిస్ మొదటి టెస్టులో వరుస సెంచరీలతో అదరగొట్టిన స్మిత్ రెండో  టెస్టులో తీవ్రంగా గాయపడ్డాడు.  మొదటి ఇన్నింగ్స్ లో స్మిత్ 80 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తూ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ గాయపడ్డాడు. ఆర్చర్ విసిరిన బంతి 149కిమీ ల వేగంతో వచ్చి స్మిత్ మెడ  భాగంలో బలంగా తాకింది. ఎలాంటి రక్షణలేని ప్రాంతంలో బంతి తగలడంతో స్మిత్ విలవిల్లాడిపోయాడు. మైదానంలోనే కుప్పకూలడంతో కాస్సేపు ఆందోళన  కొనసాగింది. అయితే కాస్సేపటి తర్వాత స్మిత్ లేచి రిటైర్ట్ హాట్ గా మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత గాయంతోనే మళ్లీ బ్యాటింగ్ కు దిగి 92 పరుగులు వద్ద ఔటయ్యాడు.