ODI Cricketer Of The Year 2023:ప్రతిష్టాత్మక అవార్డు రేసులో విరాట్ కోహ్లీ.. భారత ఆటగాళ్లతోనే పోటీ!
ODI Cricketer Of The Year 2023: క్రికెట్ ఏడాది పొడవునా అద్భుత ప్రదర్శన ఇచ్చిన ఆటగాళ్లకు ICC.. క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డును అందజేస్తుంది. కాగా, ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌కు నామినేట్ అయిన ఆటగాళ్లను ప్రకటించారు. అయితే.. అవార్డు కు నామినేట్ అయిన నలుగురిలో ముగ్గురు భారతీయులే కావడం విశేషం. ఇంతకీ ఆ ఆటగాళ్లు ఎవరు?
ODI Player Of The Year 2023: టీమిండియా 2023లో అద్బుతంగా రాణించింది. కొందరు టీమిండియా ప్లేయర్స్ తమ కెరీర్లోనే అత్యద్భుతమైన ప్రదర్శన కనబరించి.. అద్వితీయమైన విజయాలను టీమిండియాకు అందించారు. ఈ ఏడాది వరల్డ్ కప్ టోర్నీలోనూ టీమిండియా దుమ్మురేపింది.ఫైనల్ మ్యాచ్ లో తప్ప ఓటమి ఎరుగని జట్టుగా నిలిచింది. ఇలా రాణించడం వల్లే వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2023 కు నామినేట్ అయిన నలుగురిలో ముగ్గురు భారతీయులే కావడం విశేషం.
ఈ ముగ్గురు భారతీయ ఆటగాళ్లలో ఎవరైనా ఐసిసి క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును పొందవచ్చు. ఈసారి భారత జట్టు నుంచి మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ పేర్లు నామినేట్ చేయబడ్డాయి. నాలుగో ఆటగాడిగా న్యూజిలాండ్‌కు చెందిన డారిల్ మిచెల్ కూడా నామినేట్ చేయబడ్డారు.
ముందుగా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ గురించి మాట్లాడుకుందాం.. 2023లో 29 వన్డే మ్యాచ్‌లు ఆడిన శుభ్‌మన్ గిల్ ఏకంగా 63.36 సగటుతో 1584 పరుగులు చేశాడు. అందులో ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా గిల్ నిలిచాడు. 2023 మొదట్లోనే హైదరాబాద్ లో న్యూజిలాండ్ పై అతడు 208 రన్స్ చేశాడు. అలాగే.. అతని పేరిట 24 క్యాచ్‌లు కూడా ఉన్నాయి. 2023లో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ జోడీ చాలా పరుగులు చేసింది. 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో శుభ్‌మన్ గిల్ మొత్తం 354 పరుగులు చేశాడు. వరల్డ్‌కప్ ప్రారంభంలో అతనికి డెంగ్యూ సోకడంతో తొలి మ్యాచ్‌ల్లో ఆడలేకపోయాడు. అనంతరం తిరిగి వచ్చి.. విద్వంసం స్రుష్టించారు. టీమిండియా నుంచి నామినేట్ అయిన ముగ్గురిలో ఓపెనర్ గిల్ గతేడాది అత్యధిక స్కోరర్.
భారత పేసర్ మహమ్మద్ షమీని కూడా ఐసీసీ నామినేట్ చేసింది. ప్రపంచకప్‌లో లేటుగా ఎంట్రీ ఇచ్చి చెలరేగిపోయాడు.అద్భుతంగా బౌలింగ్ చేసి డైమండ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచాడు. ప్రపంచ కప్ టోర్నమెంట్ లో 10.7 సగటుతో 24 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ గా నిలిచాడు. న్యూజిలాండ్ తో సెమీఫైనల్లో 57 పరుగులకే 7 వికెట్లు తీసుకొని.. టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. అలాగే.. ఆయన గత ఏడు మ్యాచ్‌ల్లో మూడుసార్లు ఐదు వికెట్లు, ఒకసారి నాలుగు వికెట్లు తీశాడు. మహ్మద్ షమీ 19 వన్డేల్లో 43 వికెట్లు పడగొట్టాడు. దీంతో పాటు అతని బ్యాట్ నుంచి 36 పరుగులు రాగా, మూడు క్యాచ్‌లు కూడా అందుకున్నాడు.
ఇక విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకుంటే.. 2022లో మళ్లీ సెంచరీల బాట పట్టిన విరాట్ కోహ్లి.. 2023లో అదే ఫామ్ కొనసాగించాడు. కోహ్లీ 2023లో 27 మ్యాచ్‌లలో 1377 పరుగులు చేశాడు. ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. అలాగే.. ఏడాదిలో 12 క్యాచ్‌లు కూడా పట్టాడు. ఇక ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ టైటిల్‌ను కూడా అందుకున్నాడు. 765 రన్స్ తో వరల్డ్ కప్ చరిత్రలోనే ఒక ఎడిషన్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్ గా విరాట్ నిలిచాడు. అతడు ఆ టోర్నీలో 11 మ్యాచ్ లు ఆడగా. 9 మ్యాచ్ లలో 50, అంతకన్నా ఎక్కువ స్కోర్లు చేశాడు. సెమీఫైనల్లో 50వ సెంచరీ చేశాడు.
ఈ జాబితాలో ఈ ముగ్గురు భారతీయులతో పాటు న్యూజిలాండ్‌కు చెందిన డారిల్ మిచెల్ కూడా ఉన్నాడు. ఆయన అతడు 2023లో 26 మ్యాచ్‌ల్లో 1204 పరుగులు చేసి 9 వికెట్లు పడగొట్టడంతో పాటు 22 క్యాచ్‌లు కూడా తీసుకున్నాడు. వరల్డ్ కప్ లోనూ అతడు రాణించాడు. 69 సగటుతో 552 రన్స్ చేశాడు. అందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. గురువారం ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రేసులో ఉన్న ప్లేయర్స్ లిస్ట్ కూడా విడుదల చేసింది. ఈ జాబితాలో టీమిండియా నుంచి సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు.