7 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, 1 పరుగు చేసి సూర్యకుమార్ యాదవ్ రనౌట్...7 పరుగులు చేసి అవుటైన సంజూ శాంసన్..
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, 11.2 ఓవర్లలో 76 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. 9 బంతుల్లో ఓ సిక్సర్‌తో 7 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, అల్జెరీ జోసఫ్ బౌలింగ్‌లో సిమ్రాన్ హెట్మయర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
జోసఫ్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన శుబ్‌మన్ గిల్, ఆ తర్వాతి బంతికి కూడా షాట్ ప్రయత్నించి అవుట్ అయ్యాడు. అల్జెరీ జోసఫ్ కెరీర్‌లో ఇది 50వ టీ20 వికెట్. 3 బంతుల్లో 1 పరుగు చేసిన సూర్యకుమార్ యాదవ్, రనౌట్ అయ్యాడు. కైల్ మేయర్స్ కొట్టిన డైరెక్ట్ హిట్ కారణంగా థర్డ్ అంపైర్ నిర్ణయం ప్రకటించకముందే పెవిలియన్ చేరాడు సూర్య..
వెస్టిండీస్ టూర్‌లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో సూర్యకుమార్ యాదవ్ ఒక్కసారి కూడా 40+ స్కోరు చేయలేకపోయాడు. మూడో వన్డేలో చేసిన 35 పరుగులే, వెస్టిండీస్ టూర్‌లో సూర్యకుమార్ చేసిన అత్యధిక స్కోరు. 18 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ కలిసి ఇన్నింగ్స్ నిర్మించేందుకు సమయం తీసుకున్నారు. మూడో వికెట్‌కి 42 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత ఇషాన్ కిషన్ వికెట్ కోల్పోయింది టీమిండియా..
23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 27 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, రొమారియో షెఫర్డ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. శుబ్‌మన్ గిల్ మాదిరిగానే అవుట్ అవ్వడానికి ముందు ఆడిన బాల్‌కి సిక్సర్ కొట్టాడు ఇషాన్ కిషన్. 60 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా. గత మ్యాచ్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న హార్ధిక్ పాండ్యా, నేటి మ్యాచ్‌లో ఆ తప్పు చేయలేదు..
వెస్టిండీస్ బౌలర్లు చక్కగా బౌలింగ్ చేస్తుండడంతో ఐదో స్థానంలో సంజూ శాంసన్‌ని బ్యాటింగ్‌కి పంపాడు. జాసన్ హోల్డర్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదిన తిలక్ వర్మ, టీమిండియా స్కోరును 76 పరుగులకే చేర్చాడు. అకీల్ హుస్సేన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ముందుకు వచ్చిన సంజూ శాంసన్, స్టంపౌట్ అయ్యాడు.
7 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన సంజూ శాంసన్, మరో అవకాశాన్ని వృథా చేసేశాడు. 12 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసింది టీమిండియా.
