విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం.. మెరుపు సెంచరీతో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న గిల్..
INDvsNZ 3rd T20I Live: టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అహ్మదాబాద్ టీ20లో రెచ్చిపోయాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో మ్యాచ్ లో సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్ లో సెంచరీతో గిల్ అరుదైన ఘనత సాధించాడు.

టెస్టులో ఓకే.. వన్డేలలో ఏడాదికాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఈ ఏడాది టీమిండియా సారథి రోహిత్ శర్మ ఏరికోరి మరీ ఓపెనర్ గా తెచ్చుకున్న శుభ్‌మన్ గిల్.. గత ఆరు వన్డేలలో తన విశ్వరూపమే చూపాడు. రెండు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ కూడా బాదాడు. దీంతో టీమిండియా..గిల్ నే టీ20లలో కూడా ఓపెనర్ గా పంపింది. అయితే అంతకుముందు శ్రీలంకతో టీ20 సిరీస్ తో పాటు తాజాగా న్యూజిలాండ్ తో కూడా తొలి రెండు మ్యాచ్ లలో గిల్ అట్టర్ ఫ్లాఫ్. రాంచీలో 7, లక్నో 21 పరుగులు చేసి నిరాశపరిచాడు. దీంతో అతడు టీ20లకు పనికిరాడన్న విమర్శలు వెల్లువెత్తాయి. గిల్ ను మూడో టీ20 ఆడించొద్దని, అతడి స్థానంలో పృథ్వీ షా ను ఆడించాలని డిమాండ్లు వినిపించాయి. ఇవన్నీ మూడో టీ20కి ముందు..
కట్ చేస్తే.. అహ్మదాబాద్ లో సీన్ మారిపోయింది. తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు గిల్. తాను ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అని నిరూపించుకున్నాడు. ఆది నుంచే బాదుడు మొదలుపెట్టిన గిల్.. అర్థ సెంచరీ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
అర్థ సెంచరీ సాధించేందుకు కాస్త సమయం తీసుకున్నా క్రీజులో కుదురుకున్నాక కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బెన్ లిస్టర్ వేసిన 16వ ఓవర్లో రెండు బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు బాదిన అతడు.. 80లలోకి వచ్చాడు. ఇక టిక్నర్ వేసిన 17వ ఓవర్లో.. 6, 4, 4 బాది 90లలోకి చేరాడు. ఫెర్గూసన్ వేసిన 18వ ఓవర్ తొలి బంతికి బౌండరీ బాది 54 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీ ద్వారా అతడు భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో సెంచరీ సాధించిన ఐదో క్రికెటర్ గా రికార్డులకెక్కాడు.
మూడు ఫార్మాట్లలో సెంచరీలు సాధించిన భారత క్రికెటర్లు :
- సురేశ్ రైనా
- రోహిత్ శర్మ
- కెఎల్ రాహుల్
- విరాట్ కోహ్లీ
- శుభ్‌మన్ గిల్
ఈ మ్యాచ్ లో గిల్.. 126 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తద్వారా కివీస్ పై అటు వన్డేలు, ఇటు టీ20లలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. వన్డేలలో గిల్.. కివీస్ పై 208 (హైదరాబాద్ వన్డేలో) పరుగులు చేశాడు.