బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ - ఆస్ట్రేలియాల మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ సత్తాచాటిన సంగతి తెలిసిందే. మూడు టెస్టుల్లో 51 సగటుతో 259 పరుగులు చేశాడు.

ఇక నిర్ణయాత్మక గబ్బా టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో 91 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఈ యువ ఆటగాడికి మాజీలు, ఇతర క్రికెటర్లు అభినందనలు తెలియజేస్తున్నారు.

ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ చేరారు. శుభ్‌మన్‌ గిల్‌కు ఎంతో ప్రతిభ ఉందని ఆయన కొనియాడాడు. అయితే రాబోయే సిరీస్‌లలో అతడిపై అంచనాలు పెంచి, అనవసర ఒత్తిడి కలిగించొద్దని గంభీర్ సూచించాడు.

శుభమన్ గిల్‌కు ఎంతో ప్రతిభ ఉందని... కెరీర్‌లో అతడికి అదిరే ఆరంభం దక్కింది. అంతకంటే గొప్ప ఆరంభం లభించదని గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాలో ఆడటం, సిరీస్‌ గెలవడంలో ఈ కుర్రాడు కీలక పాత్ర పోషించాడని.. అద్భుతంగా ఆడుతున్నాడని కొనియాడాడు.

అయితే గిల్ నిలకడగా తన ప్రదర్శనను ఇలానే కొనసాగించాలని గంభీర్ సూచించాడు. అయితే అతడికి కాస్త సమయం ఇవ్వాలని... తన ఆటను అతడే మరింత మెరుగుపర్చుకోవాలని ఆయన తెలిపాడు. అనవసరం శుభమన్ గిల్‌పై అంచనాలు పెంచి, ఒత్తిడి తీసుకురావొద్దని హితవు పలికాడు.

రోహిత్ శర్మతో గిల్‌ ఇన్నింగ్స్‌ ఆరంభిస్తాడని.. దీనిలో ఎలాంటి సందేహం లేదన్నాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో నిలదొక్కుకోవడానికి మరింత శ్రమించాలని గంభీర్ సూచించాడు.