Asianet News TeluguAsianet News Telugu

సెంచరీ చేసి అవుటైన శుబ్‌మన్ గిల్, పూజారా హాఫ్ సెంచరీ... బంగ్లాదేశ్ ముందు కొండంత లక్ష్యం...

టెస్టుల్లో మొట్టమొదటి సెంచరీ నమోదు చేసిన శుబ్‌మన్ గిల్... హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఛతేశ్వర్ పూజారా... బంగ్లాపై 450+ పరుగుల ఆధిక్యంలో టీమిండియా..

Shubman gill goes after scoring maiden test Century, Cheteshwar Pujara scores half century
Author
First Published Dec 16, 2022, 2:45 PM IST

రోహిత్ శర్మ గాయపడడంతో తుది జట్టులోకి వచ్చిన శుబ్‌మన్ గిల్, తొలి ఇన్నింగ్స్‌లో 20 పరుగులకే అవుటైనా రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ అందుకున్నాడు. బ్రిస్బేన్ టెస్టులో 91 పరుగులు చేసి అవుటైన శుబ్‌మన్ గిల్‌కి ఇదే మొట్టమొదటి టెస్టు సెంచరీ. ఇదే ఏడాది వన్డేల్లో రీఎంట్రీ ఇచ్చి సెంచరీ చేసిన శుబ్‌మన్ గిల్, టెస్టుల్లోనూ మొట్టమొదటి శతకాన్ని అందుకోవడం విశేషం...

రెండో ఇన్నింగ్స్‌లో కెఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్ కలిసి తొలి వికెట్‌కి 70 పరుగులు జోడించారు. 62 బంతుల్లో 3 ఫోర్లతో 23 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, ఖలీద్ అహ్మద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. మొదటి 54 బంతుల్లో 17 పరుగులే చేసిన శుబ్‌మన్ గిల్, ఆ తర్వాత గేరు మార్చి బ్యాటింగ్ చేశాడు. 147 బంతుల్లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు గిల్. 

సెంచరీ పూర్తి చేసుకున్న కొద్ది సేపటికే శుబ్‌మన్ గిల్ అవుట్ అయ్యాడు. 152 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 110 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, మెహిదీ హసన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి మోమినుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.  మరో ఎండ్‌లో ఛతేశ్వర్ పూజారా 87 బంతుల్లో 5 ఫోర్లతో హాఫ్ సెంచరీ అందుకున్నాడు...  ఇప్పటికే బంగ్లాదేశ్‌‌పై 450 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత జట్టు, ఈ రోజంతా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.

పూజారా- శుబ్‌మన్ గిల్ కలిసి రెండో వికెట్‌కి 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 133/8 వద్ద మూడో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన బంగ్లాదేశ్, 55.5 ఓవర్లలో 150 పరుగులకి ఆలౌట్ అయ్యింది. టీమిండియాకి 254 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. బంగ్లాని ఫాలోఆన్ ఆడించే అవకాశం ఉన్నా, టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడానికే మొగ్గు చూపించింది... 

మూడో రోజు మెహిదీ హసన్ మిరాజ్‌తో 9వ వికెట్‌కి 42 పరుగులు జోడించిన ఎబదత్ హుస్సేన్, 37 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 17 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 82 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేసి... అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

కుల్దీప్ యాదవ్‌కి ఐదు వికెట్లు దక్కగా మహ్మద్ సిరాజ్ 3 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్ చెరో వికెట్ తీశారు. బంగ్లా ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ నజ్ముల్ హుస్సేన్ షాంటోని అవుట్ చేసి, బంగ్లాకి ఊహించని షాక్ ఇచ్చాడు మహ్మద్ సిరాజ్. తొలి బంతికే కీపర్ రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు షాంటో...

ఆ తర్వాత 17 బంతుల్లో 4 పరుగులు చేసిన యాసిర్ ఆలీని ఉమేశ్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది బంగ్లాదేశ్. 30 బంతుల్లో 5 ఫోర్లతో 24 పరుగులు చేసి భారత బౌలర్లపై కౌంటర్‌ అటాక్ చేసిన లిటన్ దాస్, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

45 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసిన మరో ఓపెనర్, తొలి టెస్టు ఆడుతున్న జాకీర్ హుస్సేన్ 45 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసి... సిరాజ్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 

25 బంతుల్లో 3 పరుగులు చేసిన కెప్టెన్ షకీబ్ అల్ హసన్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 75 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది బంగ్లాదేశ్...

22 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు చేసిన నురుల్ హసన్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 58 బంతుల్లో 3 ఫోర్లతో 28 పరుగులు చేసిన ముస్తాఫిజుర్ రహీంని పెవిలియన్ చేర్చిన కుల్దీప్ యాదవ్, తైజుల్ ఇస్లామ్‌ని డకౌట్ చేశాడు...


అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 404 పరుగులకి ఆలౌట్ అయ్యింది. శ్రేయాస్ అయ్యర్ 192 బంతుల్లో 10 ఫోర్లతో 86 పరుగులు చేసి అవుట్ కాగా ఛతేశ్వర్ పూజారా 203 బంతుల్లో 11 ఫోర్లతో 90 పరుగులు చేసి టీమిండియా తరుపున తొలి ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.  

Follow Us:
Download App:
  • android
  • ios