గ్రౌండ్‌లోనే మ్యారేజ్ ప్రపోజల్... ఆ వెంటనే రనౌట్ ఛాన్స్ మిస్ చేసిన శుబ్‌మన్ గిల్...
ICC WTC Final 2023: బ్యాటింగ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 13 పరుగులు చేసి నిరాశపరిచిన శుబ్‌మన్ గిల్... రెండో ఇన్నింగ్స్‌లో గిల్‌కి మ్యారేజ్ ప్రపోజల్ చేసిన మహిళా అభిమాని...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023లో శుబ్‌మన్ గిల్‌పై బోలెడు ఆశలు పెట్టుకుంది టీమిండియా. ఐపీఎల్ 2023 సీజన్‌లో 3 సెంచరీలతో 890 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలిచిన శుబ్‌మన్ గిల్, భారత జట్టుకి మ్యాచ్ విన్నర్ అవుతాడని అనుకున్నారు చాలామంది మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు...
అయితే తొలి ఇన్నింగ్స్‌లో 13 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయిన శుబ్‌మన్ గిల్, తీవ్రంగా నిరాశపరిచాడు. బ్యాటింగ్‌లోనే కాకుండా ఫీల్డింగ్ కూడా శుబ్‌మన్ గిల్ నుంచి ఆశించిన పర్ఫామెన్స్ రాలేదు. టాపార్డర్ బ్యాటర్లు అట్టర్ ఫ్లాప్ అయినా అజింకా రహానే, శార్దూల్ ఠాకూర్ హాఫ్ సెంచరీలతో ఆదుకోవడంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 296 పరుగులకి ఆలౌట్ అయ్యింది..
173 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలెట్టిన ఆస్ట్రేలియా, డేవిడ్ వార్నర్ వికెట్ త్వరగా కోల్పోయింది. మహ్మద్ సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో డేవిడ్ వార్నర్, వికెట్ కీపర్ శ్రీకర్ భరత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. టెస్టుల్లో సిరాజ్ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్ అవుట్ కావడం ఇది మూడోసారి..
ఆ తర్వాత ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో టీమిండియాకి రనౌట్ ఛాన్స్ వచ్చింది. సిరాజ్ బౌలింగ్‌లో మార్నస్ లబుషేన్ ఆడిన షాట్ నేరుగా శుబ్‌మన్ గిల్ చేతుల్లోకి వెళ్లింది. సమన్వయ లోపంతో మార్నస్ లబుషేన్, ఉస్మాన్ ఖవాజా ఇద్దరూ కూడా ఒకే వైపు పరుగెత్తారు..
మూడో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శుబ్‌మన్ గిల్, మెల్లిగా లేచి బంతి అందుకుని వికెట్ కీపర్ వైపు బంతి వేసేందుకు కావాల్సినంత సమయం ఉండింది. అయితే బంతిని ఆపగానే కంగారుపడిన శుబ్‌మన్ గిల్, బ్యాటర్లు ఎటువైపు ఉన్నారనే విషయాన్ని కూడా గమనించకుండా బౌలింగ్ ఎండ్‌వైపు బంతి త్రో చేశాడు. అటు వైపు బంతిని ఆపేందుకు కూడా ఎవ్వరూ లేకపోవడంతో రనౌట్ ఛాన్స్ మిస్ కావడమే కాకుండా ఆస్ట్రేలియాకి సింగిల్ తీసేందుకు అవకాశం దొరికింది..
ఈ సంఘటనకి ముందే గ్రౌండ్‌లో ఉన్న ఓ యువతి, శుబ్‌మన్ గిల్‌కి మ్యారేజ్ ప్రపోజ్ చేసింది. ‘శుబ్‌మన్ గిల్ మ్యారీ మీ’ అని రాసి ఉన్న ఫ్లకార్డును కెమెరాకి ప్రదర్శించింది. కెమెరా కంట్లో పడడానికి గ్రౌండ్‌కి వచ్చిన ఫ్యాన్స్ రకరకాల వేషాలు వేస్తారు. అయితే శుబ్‌మన్ గిల్ మాత్రం ఆ పిల్ల ప్రపోజల్ గురించి సీరియస్‌గా తీసుకుని ఊహల్లో తేలిపోవడం వల్లే, రనౌట్ ఛాన్స్ మిస్ చేశాడని ట్రోల్ చేస్తున్నారు ట్విట్టర్ జనాలు..
మరికొందరైతే శుబ్‌మన్ గిల్‌కి ఇద్దరు సారాలు ఉండగా ఆ పిల్లను ఎందుకు పెళ్లి చేసుకుంటాడని మీమ్స్ వైరల్ చేస్తున్నారు. సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్, శుబ్‌మన్ గిల్ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత సైఫ్ ఆలీ ఖాన్ కూతురు సారా ఆలీ ఖాన్‌తో చక్కర్లు కొడుతూ కనిపించాడు శుబ్‌మన్ గిల్..
ఇదంతా ఎలా ఉన్నా రెండో ఇన్నింగ్స్‌లో శుబ్‌మన్ గిల్ బ్యాటు నుంచి సరైన ఇన్నింగ్స్ రాకపోతే, టీమిండియా ఫ్యాన్స్ ట్రోల్స్ ఓ ఆటాడుకోవడం గ్యారెంటీ..